ఆత్మవిశ్వాసాన్ని వీడొద్దు...

అధికారులు, సహోద్యోగులు, క్లైంట్స్‌ నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ కొన్నిసార్లు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. అప్పటివరకు పడిన కష్టమంతా ఆవిరి అయినట్లు అనిపిస్తుంది.

Published : 11 Jun 2023 00:08 IST

అధికారులు, సహోద్యోగులు, క్లైంట్స్‌ నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ కొన్నిసార్లు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. అప్పటివరకు పడిన కష్టమంతా ఆవిరి అయినట్లు అనిపిస్తుంది. ఇటువంటి విమర్శలొచ్చినప్పుడు పరిస్థితిని సవాలుగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. ధైర్యంగా ముందడుగు వేయాలని సూచిస్తున్నారు.

నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌తో ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఎక్కువ. మన నైపుణ్యాలపై దాడి చేసినట్లు అనిపిస్తుంది. అయితే అన్నిరకాల ఫీడ్‌బ్యాక్‌ కుంగుబాటుకు గురిచేయదు. కొన్ని నిర్మాణాత్మక విమర్శలు మనల్ని మనం మరింత అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ప్రొఫెషనల్‌ కెరియర్‌లో ఇటువంటి విమర్శలుంటేనే నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఏయే చోట్ల లేదా ఎటువంటి సందర్భాల్లో వెనకబడ్డామో ఈ విమర్శలద్వారా తెలుసుకోవచ్చు. వాటి నుంచి బయటపడే విధానాలనూ గుర్తించగలిగితే ఎదుగుదలకు సాయపడతాయి.

నిశ్శబ్దంగా.. విమర్శలొచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రతి స్పందనను వారెదుట ప్రదర్శించకూడదు. తాత్కాలిక ఎమోషన్స్‌కు ప్రాధాన్యతనిస్తే ఆఫీస్‌లో ప్రొఫెషనల్‌ రిలేషన్స్‌ దెబ్బ తింటాయి. ఎదుటివారితో కమ్యూనికేషన్‌ దూరమవుతుంది. అవతలి వారు తమ విమర్శలను ఏ స్థాయిలో చెప్పినా వాటిని పూర్తిగా వినడం మంచిది. ఒంటరిగా ఉన్నప్పుడు తిరిగి జ్ఞాపకం తెచ్చుకొని సమీక్షించుకోవడం నేర్చుకోవాలి. ఇలా చేసినప్పుడు మనసు ఉద్వేగం చెందదు. చేయాల్సిన పనిపైన ఏకాగ్రత పోదు.

వివరణ.. విమర్శ ఎదురవగానే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవనవసరం లేదు. విమర్శిస్తున్న వారిని వాటిపై వివరణ అడగడం మంచిది. అప్పుడే అపార్థాలు తొలగుతాయి. అవతలివారేం చెబుతున్నారో పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని, మీరు పాటించే విధానాలను వివరించాలి. అప్పుడే విమర్శలకు మరోసారి తావుండదు.

పొరపాటును.. ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని ధైర్యంగా స్వీకరించాలి. అవతలివారిపై రుద్దడానికి ప్రయత్నించి తప్పించుకోవాలని చూడకూడదు. దానికి పూర్తిగా మనం బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే పరిష్కారం ఆలోచించడానికి కూడా వీలుంటుంది. భవిష్యత్తులో అటువంటి పొరపాటు మరోసారి చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ ప్రవర్తనతో కెరియర్‌లో ఎదుగుదలతోపాటు అవతలివారి మనసులో నమ్మకాన్ని సంపాదించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్