Dear Vasundhara: పెళ్లికి ముందే చనిపోయాడు..
నా స్నేహితురాలి కాబోయే భర్త పెళ్లికి పది రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇది జరిగి ఆరు నెలలవుతున్నా ఆ బాధ నుంచి బయట పడలేక కుమిలి పోతోంది. ఎంతో ధైర్యంగా ఉండే తనని ఇలా చూడలేకపోతున్నాను.
నా స్నేహితురాలి కాబోయే భర్త పెళ్లికి పది రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇది జరిగి ఆరు నెలలవుతున్నా ఆ బాధ నుంచి బయట పడలేక కుమిలి పోతోంది. ఎంతో ధైర్యంగా ఉండే తనని ఇలా చూడలేకపోతున్నాను.
- ఓ సోదరి
పెళ్లి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. అందుకే స్త్రీలూ పురుషులూ కూడా వైవాహిక జీవితం కోసం ఎదురు చూస్తుంటారు. మీ స్నేహితురాలి జీవితంలో చోటుచేసుకున్న పెను విషాదం నుంచి తనను బయటకు తేవాలన్న మీ ప్రయత్నం అభినందనీయం. ఆ ఘటన ఆమెను షాక్‌కి గురిచేసి ఉండొచ్చు. పెళ్లికి ముందు అతను చనిపోయాడంటే.. సమాజం నష్టజాతకురాలని నిందించడం లాంటి హీనత్వాలుంటాయి కనుక ఆ భయమూ ఇందుకు కారణం కావొచ్చు. దాంతో జాతకం బాగోలేదని తనని తాను నిందించుకునే అవకాశమూ ఉంది. ఇంట్లోవాళ్ల ఆందోళన చూసి కూడా వేదన పడుతుందేమో! కానీ అతను చనిపోవడానికి ఆమె ప్రమేయం, బాధ్యత లేవని అర్థం అయ్యేలా చెప్పండి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేక పోయినప్పటికీ అదొక అనుకోని ప్రమాదకర ఘటన అని తనకు తాను నచ్చజెప్పుకొనేలా ఆమెకు తోడుండండి. అతడూ, అతడి మాటలు గుర్తుకు రావడం, ఒకవేళ చనిపోయాక పార్థివ శరీరాన్ని చూసుంటే ఆ భయానక దృశ్యం కళ్లముందు మెదలడం, నిద్ర పట్టకపోవడం, కలలు రావడం వంటివి జరుగుతుంటే దీన్ని పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. ఆ లక్షణాలతో మనసును కుదుట పరచుకోలేకపోతే.. సైకియాట్రిస్టును సంప్రదించాలి. అనుకోకుండా జరిగిన ఇలాంటి సంఘటనలు మెదడు రసాయనాల్లో మార్పు తెస్తాయి. కనుక యాంటీ డిప్రెసెంట్స్‌తో వాటిని యథాస్థితికి తెస్తారు. దాంతోబాటు ట్రామా ఫోకస్డ్ కాగ్నెటివ్ బిహేవియర్ థెరపీ ఇస్తారు. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ నేర్పిస్తారు. భవిష్యత్తుని ఎలా మలచుకోవాలో కౌన్సెలింగ్ ఇస్తారు. ఎవరు ప్రతికూలంగా మాట్లాడినా పట్టించుకోనవసరం లేదు. సమాజంలో అనునయంగా ఉండేవారూ, వ్యతిరేకించే వారు కూడా ఉంటారని అర్థం చేసుకుని స్థైర్యంగా ఉండగలగాలి. ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడితే కొంత భారం తగ్గుతుంది. ఏదేమైనా ఆర్నెల్లు గడిచినా ఇంకా దాన్నుంచి బయటపడకుండా, ఆందోళన చెందుతోందంటే చికిత్స తీసుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.