ప్రారంభం.. ఆనందంగా!

సెలవు కోసం ఎదురుచూసే వారిలో పిల్లలే కాదు.. ఉద్యోగులూ ఉంటారు. కానీ అదేమో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. దీంతో సోమవారం తిరిగి ఆఫీసుకు వేలాడుతూనే వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా ఉత్సాహంగా ప్రారంభమవ్వాలా? నిపుణుల చిట్కాలివిగో..  ‘వీకెండ్‌’ అనగానే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఆ ఆనందంలో పడి పనిని వాయిదా వేయట్లేదు కదా! అప్పటికి తర్వాత చేసేద్దామనే అనిపిస్తుంది.

Updated : 30 Jun 2023 06:13 IST
సెలవు కోసం ఎదురుచూసే వారిలో పిల్లలే కాదు.. ఉద్యోగులూ ఉంటారు. కానీ అదేమో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. దీంతో సోమవారం తిరిగి ఆఫీసుకు వేలాడుతూనే వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా ఉత్సాహంగా ప్రారంభమవ్వాలా? నిపుణుల చిట్కాలివిగో..
‘వీకెండ్‌’ అనగానే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఆ ఆనందంలో పడి పనిని వాయిదా వేయట్లేదు కదా! అప్పటికి తర్వాత చేసేద్దామనే అనిపిస్తుంది. తీరా సోమవారం ఉదయం నుంచి అదో కొండలా కనిపించడం మొదలవుతుంది. పోగు పడిన పని నీరసం కాక ఇంకేం తెస్తుంది? కాబట్టి, వాయిదాలొద్దు. పూర్తిచేశాకే సిస్టమ్‌ ఆఫ్‌ చేయండి. కొత్త పని కూడా కొంగొత్త ఉత్సాహాన్ని ఇవ్వగలదు.
ఇల్లంతా సర్దేయాలి, పిల్లల ప్రాజెక్టులు పూర్తిచేయాలి, షాపింగ్‌.. అన్నీ సెలవు రోజునే మన కోసం ఎదురు చూస్తుంటాయి. రోజంతా తిరిగితే, ఒళ్లు అలసేలా పనిచేస్తే నిస్సత్తువేగా మిగిలేది! వీలైతే రోజుకి కొంచెం చొప్పున చేసుకుంటూ వెళ్లండి. లేదూ వేరే ఎవరికైనా అప్పగించండి. విశ్రాంతి తీసుకునే వీలు దొరుకుతుంది.
సెలవు రోజున మనమెక్కువగా చేసే పని ఇల్లు సర్దడం. పక్కదుప్పట్లు మార్చడమూ అందులో భాగం. ఈసారి సెలవు ముందురోజు రాత్రే అది చేసేయండి. రేపు సెలవు అన్న భావన మనసుని తేలిక పరుస్తుంది. శుభ్రమైన దుప్పట్లు గాఢనిద్రకు సాయపడతాయి. మరింత ఉత్సాహంగా లేస్తారు. తర్వాతి రోజుకీ అది కొనసాగుతుంది.
రోజూ హడావుడే.. ఈరోజు ఇంటిల్లిపాదికీ చక్కగా వండిపెట్టాలి అనుకుంటున్నారా? పెరిగే శ్రమేగా! వేరే ఏ పనులూ లేకపోతే అలాగే చేయండి. ఇంకేవైనా పనులుంటే మాత్రం బయటి నుంచి తెప్పించుకోండి. సమయానికి అందివ్వలేమన్న కంగారు ఉండదు. పిల్లలతో గడపడానికి సమయమూ దొరుకుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గి మనసూ తేలికపడుతుంది. శక్తిని పుంజుకున్న శరీరం ఉత్సాహంగా పనికి సిద్ధమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని