సమయాన్ని వృథా చేస్తోంటే..

సుకన్యకు పెద్ద వ్యాపారవేత్తగా నిలవాలని ఆసక్తి. కానీ స్నేహితులతో కలిసి సమయాన్ని వృథా చేస్తూ ఉంటుంది. తన ఆశయాలను మాత్రం మాటల్లో చెబుతూనే ఉంటుంది. బలమైన లక్ష్యమంటూ ఉంటే, దానికి తగినట్లుగా ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా అడుగులేయాలంటున్నారు కెరియర్‌ నిపుణులు..

Published : 02 Jul 2023 00:08 IST

సుకన్యకు పెద్ద వ్యాపారవేత్తగా నిలవాలని ఆసక్తి. కానీ స్నేహితులతో కలిసి సమయాన్ని వృథా చేస్తూ ఉంటుంది. తన ఆశయాలను మాత్రం మాటల్లో చెబుతూనే ఉంటుంది. బలమైన లక్ష్యమంటూ ఉంటే, దానికి తగినట్లుగా ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా అడుగులేయాలంటున్నారు కెరియర్‌ నిపుణులు..

డిగ్రీలోకి అడుగుపెట్టక ముందే భవిష్యత్తులో ఏ లక్ష్యంవైపు నడవాలో ముందే ఆలోచించుకొని పాటించాల్సిన ప్రణాళికలపై అవగాహన పెంచుకోవాలి. అడుగుపెట్టనున్న రంగంపై అధ్యయనం చేయాలి. యుక్త వయసులో సమయాన్ని వృథా చేయకుండా ఉంటేనే ఇదంతా వీలవుతుంది.

లక్ష్యం ఒక్కటే ఉంటే సరిపోదు. ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే లక్ష్యాన్ని చేరుకున్నవారి గురించి తెలుసుకోగలిగితే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. తమ ఇబ్బందులను వారెలా దాటగలిగారో తెలుసుకోవచ్చు. వారు చెప్పేవన్నీ సలహా లేదా సూచనలుగా మాత్రమే ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నామో ఎవరికి వారే సొంతంగా ఆలోచించుకోవాలి. అప్పుడే దాన్ని చేరుకోవాలన్న తపన మనసులో మొదలవుతుంది.

అర్హత.. వ్యాపారమే లక్ష్యమైతే ... దానికి కావాల్సిన విద్యార్హతలతోపాటు తగిన నైపుణ్యాలను పొందడం మొదటి మెట్టు. ఈ అర్హతలతోపాటు జీవన నైపుణ్యాలు, సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటివన్నీ అందుకోవాలి. చదువు పూర్తయిన వెంటనే అర్హత వచ్చింది కదా అనుకొంటూ.. వ్యాపారవేత్తగా కెరియర్‌ ప్రారంభించకూడదు. ఆయా రంగాల్లో శిక్షణ లేదా అనుభవాన్ని పొందడానికి కృషి చేయాలి. ఈ ఉద్యోగ అనుభవంతో భవిష్యత్తులో మంచి వ్యాపారవేత్తగా నిలవడానికి పాఠాలెన్నింటినో నేర్చుకోవచ్చు. కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవరుచుకోవాలి. అలాగే వ్యాపారవేత్తగా నిలిచి మరికొందరికి ఉపాధి కల్పించాలనుకొంటే, దానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు, నిర్వహణ సామర్థ్యం వంటివి పెంచుకోవాలి. లాభనష్టాలే కాకుండా మార్కెట్‌ పరిస్థితి, వినియోగదారుడి అవసరం వంటి వాటిపై ముందుగానే తెచ్చుకొనే అవగాహన భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అప్పుడే వ్యాపారవేత్తగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని