కలిసిపోయే మనస్తత్వమేనా?

కొత్త స్కూల్లో చేరుతోంటే టీచర్లు పేరు, వివరాలతో పరిచయం చేస్తారు. ఎవరినైనా పిలిచి తనను చూసుకోమన్న సలహా ఇస్తారు. అలా స్నేహితులవుతారు. మరి ఆఫీసులో? అక్కడా టీమ్‌ పరిచయం ఉంటుంది. కానీ స్నేహం కావాలంటే మీరే చొరవ తీసుకోవాలి.

Published : 10 Jul 2023 00:09 IST

కొత్త స్కూల్లో చేరుతోంటే టీచర్లు పేరు, వివరాలతో పరిచయం చేస్తారు. ఎవరినైనా పిలిచి తనను చూసుకోమన్న సలహా ఇస్తారు. అలా స్నేహితులవుతారు. మరి ఆఫీసులో? అక్కడా టీమ్‌ పరిచయం ఉంటుంది. కానీ స్నేహం కావాలంటే మీరే చొరవ తీసుకోవాలి. వీటినే సంస్థలు ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌గా చెబుతాయి. ఆ నైపుణ్యాలను మీరే పెంపొందించుకోవాలి అంటున్నారు నిపుణులు. ఎలాగంటే..

* సిగ్గు, పని పట్ల అవగాహన లేమి, భాషా సమస్య.. ఇతరులతో కలవడానికి అడ్డుపడే కారణాల్లో కొన్ని. అలాగని కూర్చుంటే ఎవరూ స్నేహితులు కాలేరు. ముందు వాటిని పక్కన పెట్టేయాలి. ఇంకా.. కొందరు కొత్తవాళ్లతో వెంటనే మాట్లాడలేరు. బాగా మాట్లాడేవాళ్లు, పలకరించేవాళ్లే మంచివారు.. కాస్త ముభావంగా మాట్లాడినంత మాత్రాన చెడ్డవాళ్లు అని నిర్ణయానికి రావొద్దు. ముందు వీటిన్నింటినీ మనసులోంచి తీసేయండి.

* అన్నీ విడమరిచి చెప్పడానికది స్కూలు కాదు, అక్కడున్నది టీచర్లూ కాదు. కాబట్టి, పని గురించి అర్థమవడానికి సమయం పడుతుంది. అర్థం కాకపోయినా.. పదే పదే సందేహాలొచ్చినా ‘నా వల్ల కాదు.. నేను పనికిరాను’ లాంటి ఆలోచనలకు తావివ్వొద్దు. కంగారు పడుతోంటే పనివ్వడానికే కాదు నేర్పడానికీ ఎవరూ సుముఖంగా ఉండరు. భారమనిపిస్తే విరామం తీసుకోండి. తిరిగి తాజాగా ఆలోచించండి.. పని కాస్త తేలికవుతుంది.

* నేర్చుకునే దశలో సందేహాలు సహజమే! అలాగని ఆలోచిస్తూ కూర్చోవద్దు. సమయం వృథా. ఎవరో వచ్చి సాయం చేస్తారనీ ఆశించొద్దు. నోరు తెరిచి అడగండి. చేసిన పని వివరాలూ మీరే చెప్పాలి. లేదంటే ఇవి కమ్యూనికేషన్‌ గ్యాప్‌ని పెంచుతాయి.

* సరదా సంభాషణ, మీటింగ్‌.. ఆలోచనలను వ్యక్తం చేయాలన్న తొందరొద్దు. ముందు చెప్పేది వినండి. తర్వాతా మీ సూచనలు ఉపయోగపడతాయనిపిస్తే చెప్పండి. వినడం తెలిసినవారే భావాలను బాగా వ్యక్తం చేయగలరన్న సామెత ఉందిగా! పాటించేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని