పదోన్నతి కావాలంటే...

ఉద్యోగంలో ఎదుగుదల లేకపోతే అసంతృప్తి పేరుకుపోతుంది. అయినా ఉన్నత స్థితిలోకి వెళ్లడమనేది మన చేతిలో లేదు, ఆ నిర్ణయాలు యాజమాన్యానివే అనుకుంటున్నారా!

Updated : 11 Jul 2023 04:09 IST

ఉద్యోగంలో ఎదుగుదల లేకపోతే అసంతృప్తి పేరుకుపోతుంది. అయినా ఉన్నత స్థితిలోకి వెళ్లడమనేది మన చేతిలో లేదు, ఆ నిర్ణయాలు యాజమాన్యానివే అనుకుంటున్నారా! పదోన్నతులు ఇచ్చేది పైవాళ్లే అయినా.. వాళ్లనందుకు ప్రేరేపించాల్సింది మనమేనంటూ, కెరియర్‌ని వృద్ధి చేసుకోవడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. అవేంటో చదివేయండి..

అప్పగించిన పనులను బాధ్యతగా చేయండి. వంక పెట్టడానికి లేదు అనిపించేలా నిర్దుష్టంగా ఉండాలి.

పనులను ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల త్వరగా పూర్తవుతాయి. ఏది ముందు, ఏది తర్వాత అనే ప్రాధామ్యాలు తెలుస్తాయి.

చేస్తున్న పనిలో చాకచక్యంతోబాటు నైపుణ్యాలు పెంచుకోవాలి. ఏదైనా రిపోర్ట్‌ ఇవ్వాల్సివచ్చినప్పుడు అంశాలు క్రమ పద్ధతిలో, సరళంగా, అర్థమయ్యేలా వ్యక్తీకరించాలి. చెప్పాల్సిన సంగతులూ అంతే.. అధిక ప్రసంగం లేకుండా క్లుప్తంగా, స్పష్టంగా ఉండాలి.

నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భాల్లో ముందుగానే బాగా ఆలోచించుకోవాలి. ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత ఇక సందేహాలూ, సంశయాలకు తావుండకూడదు.

సామర్థ్యాన్ని రోజురోజుకూ పెంచుకోవాలి. అప్పుడే ప్రగతి సాధ్యమవుతుంది.

సంక్లిష్టత ఏర్పడిన సందర్భాల్లో పైవాళ్ల సలహాలూ సహకారం తీసుకోవచ్చు. అంతే తప్ప డీలా పడాల్సిన అవసరమే లేదు.

మనసులో మెదిలే భావాలూ లేదా సంఘర్షణలను అందరితో పంచుకోవద్దు. అవి రూపాంతరం చెంది ఎవరెవరికో చేరి మీమీద సదభిప్రాయం పోగొట్టే ప్రమాదముంది.

ఉద్యోగం అన్నాక ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. రోజూ కాసేపు ధ్యానం చేస్తే ఆ ఆందోళన తగ్గి మనసుకు ప్రశాంతత చిక్కుతుంది.

ఎట్టి పరిస్థితిలో నిరాశా నిస్పృహలకు చోటు ఇవ్వొద్దు. ఎప్పుడూ ఆశావహ దృక్పథంతోనే ఉండండి.

పని పూర్తిచేయడంతో సరిపెట్టక నలుగురితో కలిసిమెలిసి ఉండటం అలవాటు చేసుకోండి. సోషల్‌ స్కిల్స్‌ను పెంచుకోకపోతే పనిలో ఎంత నైపుణ్యం ఉన్నా వెనకే ఉండిపోతారు.

నీతి నియమాలను ఉల్లంఘించొద్దు. అప్పుడే మీ మీద సద్భావం పెరుగుతుంది. ఉన్నత బాధ్యతలు అప్పగించగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని