నిమ్మకాయతో జలుబు వస్తుందా..
మా పాప వయసు 13 ఏళ్లు. నెలకోసారైనా జలుబొస్తుంటుంది. నిమ్మకాయలు వద్దని, పెరుగు, అరటిపండు పెట్టొద్దని ఇలా తలా ఒక సలహా ఇస్తున్నారు.
మా పాప వయసు 13 ఏళ్లు. నెలకోసారైనా జలుబొస్తుంటుంది. నిమ్మకాయలు వద్దని, పెరుగు, అరటిపండు పెట్టొద్దని ఇలా తలా ఒక సలహా ఇస్తున్నారు. ఇది నిజమేనా? వస్తోంది వానాకాలం ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి రక్షించుకోడానికి ఎలాంటి ఆహారం ఇస్తే మంచిదంటారు.
- సుధ, ఖమ్మం
చిన్నప్పటి నుంచి మీ పాప ఆహారపు అలవాట్లు గమనించే ఉంటారు. ఏది తింటే ఆమెకు జలుబు వస్తుందో ఈపాటికే మీకు తెలిసుండాలి. లేకపోతే డైరీ మొదలుపెట్టండి. తను రోజువారి తినే ఆహారాన్ని అందులో రాయండి. ఏది తిన్నప్పుడు తనకు జలుబు వస్తుందో సులభంగా గుర్తించవచ్చు. వానాకాలంలో ఇన్ఫెక్షన్లు రావడం నిజమే. ఈ పరిస్థితుల్లో ఆమె ఆహారం, శుభ్రతపై పూర్తి దృష్టి పెట్టాలి. తినే ముందు చేతులు కడగడం, ధూళీ ఎక్కువగా ఉన్నప్పుడు మాస్క్ ధరించడం లాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పండి. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని ఆమెకు అందించండి. విటమిన్ సి, ఎ, ఈ ఎక్కువగా ఉన్న ఆహారం ఇవ్వాలి. వెన్న, నెయ్యి, ఆకు కూరల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. సిట్రస్ ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేయండి. నువ్వులు, అవిసెలు, వాల్‌నట్స్, తృణధాన్యాలను ఆహారంలో ఉండేలా చూడండి. దీనివల్ల ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి వస్తుంది. ఇకపోతే నిమ్మ, అరటి, పెరుగు తినడం వల్ల జలుబు పెరగడం అపోహ మాత్రమే. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శుభ్రత పాటిస్తూ, మేలైన డైట్ను ఫాలో అయితే సమస్య నుంచి బయటపడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.