అప్పుడిక ఆనందమేగా

ఒత్తిడి, ఆందోళనలకు తావులేకుండా.. ఆనందంగా సాగిపోయే జీవితం.. ఎవరైనా ఇంతకంటే ఏం కోరుకుంటారు? అది వేరొకరిచ్చేది కాదు.. మన చేతుల్లోనే ఉంటుందంటున్నారు నిపుణులు.

Updated : 19 Jul 2023 04:53 IST

ఒత్తిడి, ఆందోళనలకు తావులేకుండా.. ఆనందంగా సాగిపోయే జీవితం.. ఎవరైనా ఇంతకంటే ఏం కోరుకుంటారు? అది వేరొకరిచ్చేది కాదు.. మన చేతుల్లోనే ఉంటుందంటున్నారు నిపుణులు. కాకపోతే కాస్త సాధన చేయాలట. చేద్దామా మరి?

ఆనందాన్ని తెచ్చిపెట్టే మొదటి మెట్టు కృతజ్ఞతదే! దాన్ని సాధన చేయండి. ఎలాగంటే.. రోజూ ‘ఇవి నా జీవితంలో ఉండటం నా అదృష్టం’ అని భావించే మూడు విషయాలను పేపరు మీద పెట్టండి. సాధారణంగా ‘ఆమె కన్నా నేను బాగాలేను.. నాకా నగల్లేవు.. తనకన్నా జీతం తక్కువ’ ఇలా లేనివాటిపైనే ఎక్కువ దృష్టిపెడతామట. ఆ క్రమంలో మన సానుకూలతలు చూడటం మర్చిపోతాం. ఫలితమే ఒత్తిడి, ఆందోళన, బాధ వగైరా! పాజిటివ్‌ అంశాలపై దృష్టిపెట్టడం అలవాటు చేసుకుంటే మన దృష్టి ఆనందకర విషయాలపై మళ్లుతుంది.

 పెరిగిన పని ఒత్తిడి, చుట్టూ ఉండే చిన్న చిన్న వివాదాలు మెదడుపై ఒత్తిడి పెంచుతూనే ఉంటాయి. దీన్ని తగ్గించుకోవడానికి పని భారాన్ని పంచుకోండి. లేదూ మీ ఇబ్బందినైనా కుటుంబ సభ్యులూ, సహోద్యోగులతో పంచుకోండి. అవతలివారు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మనసు భారం దిగుతుంది.

సామాజిక మాధ్యమాలు, నిరంతరం చెడు, నెగెటివ్‌ ఆలోచనలు నింపేవారి ప్రభావమే మనపై ఎక్కువే. దీనివల్ల దీర్ఘకాలంలో చిన్న విషయాల్లోనూ అసంతృప్తి రగులుతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీ ఆలోచనల్ని మరల్చుకోండి. ఒక మంచి కోట్‌, నచ్చిన పాట, స్ఫూర్తిని నింపే వ్యక్తుల వ్యాఖ్యలు వినడం వంటివన్నీ మనసుని తేలికపరిచేవే.

 ఎంతసేపూ ఎవరో మెచ్చుకోవాలి, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకోవడమేనా? తీరా అలా జరగకపోయినా అసంతృప్తే. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. వ్యాయామం, అందం సంరక్షణ, చిన్న చిన్న వ్యాపకాలు.. వంటివాటిపై దృష్టిపెడితే సరి. నచ్చింది చేసేప్పుడు దొరికే ఆనందం అంతా ఇంతా కాదు.

కష్టంగా ఉన్నా ‘తప్పదు’ అనుకుంటూ వెళ్లిపోవడం మన ఆడాళ్ల తత్వం. ఈసారి నుంచి ‘చేయగలనా? ఎంతవరకూ పూర్తి చేయగలను’ అని ఆలోచించుకోండి. ఆ తర్వాతే మొదలుపెట్టండి. కొంచెం పూర్తిచేసినా పర్లేదు కానీ.. ఆత్మవిశ్వాసం సన్నగిల్లదు. అదీ ఆనందమేగా మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని