పప్పీలతో యోగా చేస్తారా!

గది నిండా బుజ్జి బుజ్జి కుక్కపిల్లలు.. అమాయకంగా చూస్తూ.. తోక ఊపుతూ కాళ్ల చుట్టూ తిరుగుతోంటే.. తల నిమరాలని అనిపిస్తుంది కదూ! సరదాగా వాటితో ఆడతాం కూడా.

Updated : 26 Jul 2023 12:55 IST

స్వాతి, సింధూజ , శుభశ్రీ

గది నిండా బుజ్జి బుజ్జి కుక్కపిల్లలు.. అమాయకంగా చూస్తూ.. తోక ఊపుతూ కాళ్ల చుట్టూ తిరుగుతోంటే.. తల నిమరాలని అనిపిస్తుంది కదూ! సరదాగా వాటితో ఆడతాం కూడా. అప్పుడు తెలియకుండానే మనసు తేలికపడుతుంది. ఇక ఒత్తిడి అనగానే అందరూ ఎంచుకునే మార్గాలు యోగా. ఇంకా.. అలా కాసేపు బయట గడపడం. వీటన్నింటినీ కలుపుతూ ఏదైనా ఎందుకు ప్రయత్నిద్దామన్న ముగ్గురు స్నేహితురాళ్ల ఆలోచనే.. పాగా!

స్వాతి రేణుగోపాల్‌, సింధూజ కృష్ణకుమార్‌, శుభశ్రీ మాధవన్‌.. ప్రాణ స్నేహితురాళ్లు. ఈ చెన్నై అమ్మాయిలు గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక ఏదైనా కలిసి చేయాలనుకున్నారు. పేస్ట్రీ, కేకుల తయారీ, గ్రాఫిక్‌లతో కూడిన టీ షర్టులు ఇలా ఎన్నో ప్రయత్నించారు. ఆదాయం బాగానే ఉన్నా.. ఇంకేదో చేయాలన్న తపన. ముగ్గురికీ పెంపుడు జంతువులంటే ప్రాణం. బ్లూక్రాస్‌ సహా పలు జంతు సంరక్షణ కేంద్రాలకు వెళ్లడం, అక్కడి మూగజీవాలతో గడపడం వీరికో వ్యాపకం.
స్వాతి పైచదువుల కోసం యూకేకి వెళ్లింది. అక్కడ కొన్నిచోట్ల మేకపిల్లలతో యోగా చేయడం గమనించింది. ఆసక్తి అనిపించి ఆరాతీస్తే దీంతో ఒత్తిడి తగ్గుతుందని చెప్పారట. దీని గురించి ఇంకాస్త పరిశోధిస్తే ‘పెట్‌ ఎక్సర్‌సైజ్‌, పెట్‌-యోగా’ వంటి వాటి పరిచయమైందామెకు. స్నేహితురాళ్లతో పంచుకుంటే ఈ విధానాన్ని భారత్‌లోనూ పరిచయం చేస్తే బాగుంటుందన్నారు. కొవిడ్‌ తర్వాత మానసిక సమస్యల తీవ్రతేంటో ఎలాగూ తెలిసొచ్చింది. దీంతో 2020లో చెన్నైలో ‘పాగా’ ప్రారంభించారీ మిత్ర త్రయం.

‘ఇక్కడ జంతువులనేమీ ఇబ్బంది పెట్టం. అవి స్వేచ్ఛగా ఆడుకుంటాయి. నచ్చిన వారి ఒడికి చేరతాయి. పెంపుడు జంతువులంటే మన దగ్గర ఎక్కువగా విదేశాల నుంచే తెచ్చుకుంటారు. దేశీరకాలను పెంచినా.. ఏదైనా ఇబ్బందైనా, దూరప్రాంతాలకు వెళ్లాల్సొచ్చినా వదిలేస్తుంటారు. ఇంటి వాతావరణానికి అలవాటుపడిన అవేమో బెంబేలెత్తుతాయి. అలాంటివాటికి కాస్త ప్రేమ దొరుకుతుంది. వాటి చేష్టలతో మనకీ మానసికానందం. దీనికోసం బ్లూక్రాస్‌ సహా జంతు సంరక్షణ కేంద్రాలతో ఒప్పందం చేసుకున్నాం. కొందరు నచ్చిన జీవులను దత్తత తీసుకుంటారు కూడా. వాటికో నీడ కల్పించామన్న ఆనందం అదనం. అన్నట్టూ ఈ సెషన్ల ద్వారా వచ్చిన మొత్తంలో ఎక్కువభాగాన్ని మూగజీవుల సంరక్షణకే వినియోగిస్తున్నాం’ అంటున్న ఈ స్నేహితురాళ్లు దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో తమ సేవలు అందిస్తున్నారు. ఈ యోగా చేయించడానికి ప్రత్యేక ‘పా-గి’లు కూడా ఉన్నారట. ‘పాగా ఆలోచన చెప్పగానే ‘ఇదేం యోగా’ అన్నారంతా. దీంతో కొన్నివీడియోలు, ఫొటోలు చేసిపెట్టాక అవగాహన తర్వాత నెమ్మదిగా ఆదరణ పెరిగింది’ అని ఆనందంగా చెబుతున్నారీ అమ్మాయిలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్