వారాంతాలూ పనేనా?

వీకెండ్‌ అంటే అందరికీ ఉత్సాహమే. మనకు మాత్రం అదనపు శ్రమ. గృహిణులైతే కొత్త వంటకాలతో బిజీ. ఉద్యోగినులైతే ఇంటి శుభ్రత, పనులతో సరిపోతుంది.

Published : 19 Aug 2023 00:16 IST

వీకెండ్‌ అంటే అందరికీ ఉత్సాహమే. మనకు మాత్రం అదనపు శ్రమ. గృహిణులైతే కొత్త వంటకాలతో బిజీ. ఉద్యోగినులైతే ఇంటి శుభ్రత, పనులతో సరిపోతుంది. ఇలాగైతే మనసు కుదుట పడేదెలా?

  • స్క్రీన్‌ని పక్కన పెట్టేయండి. ఏదైనా నచ్చిన పుస్తకాన్ని తీసుకొని ప్రశాంత వాతావరణంలో చదవండి. పుస్తకం సమాచారాన్నే కాదు.. తెలియని ప్రశాంతతనీ ఇస్తుంది.
  • నవ్వుతారు, వెక్కిరిస్తారు లేదా ఏమనుకుంటారోనని ప్రతిదాన్నీ మనసులో దాచేస్తుంటాం. ఇదీ మనసు భారాన్ని పెంచేదే. పుస్తకం, పెన్ను తీసుకొని ఆలోచనలు, ఇబ్బందులు, ప్రణాళికలు, లక్ష్యాలు అన్నింటినీ పేపర్‌పై ఉంచండి. ఆ వారం ఎలా గడిచింది.. సెలవు రోజు ఎలా గడపాలనుందో కూడా రాయొచ్చు. మనసు భారం దిగడమే కాదు.. ఏం కోరుకుంటున్నారు, ఏ దారిలో వెళ్లాలన్న స్పష్టతా దొరుకుతుంది.
  • సెలవు దొరికిందంటే అడుగు బయట పెట్టాలని అనిపించదు చాలామందికి. దొరికిన ఆ కాసేపు సమయం అలా కూర్చొని ఉంటే చాలనిపిస్తుంది. నాలుగ్గోడల మధ్యే ఎంతసేపని ఉంటారు? సరదాగా  పిల్లలను తీసుకుని అలా పార్క్‌కో, మొక్కల మధ్యకో వెళ్లండి. కొత్త ఆలోచనలు వస్తాయి. చెప్పుల్లేకుండా గడ్డి మీద నడవండి. ఇంద్రియాల పనితీరు మెరుగుపడుతుంది.
  • ప్రతి ఒక్కరికీ ఏదైనా నచ్చిన అంశం ఉంటుంది. సమయం లేదనో, మరే కారణం చేతో పక్కన పడేస్తాం. నచ్చింది చేయలేకపోవడం కూడా ఒక రకమైన ఒత్తిడే! వీలు కల్పించుకొని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుంది.
  • ‘జీతం లేని పని, ఎంత చేసినా విలువుండదు’ మనకు మనమే ఎన్నిసార్లు ఈ మాట అనుకొని ఉంటాం? ఓ గంట అనాథాశ్రమంలోనో, వృద్ధాశ్రమంలోనో గడిపేయండి. డబ్బులే ఇవ్వాల్సిన పనిలేదు. వాళ్లతో కాసేపు గడిపి కబుర్లు చెప్పండి. వాళ్లకీ ఆనందం.. మీకూ సంతృప్తి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని