పిలుపు రాలేదంటే..
చదువయ్యాక కోరుకున్న ఉద్యోగానికి ఇంటర్వ్యూకు పిలుపొస్తే చాలు.. సాధించామనుకుంటాం. తీరా పూర్తి చేశాక ఎంపిక కాలేదనే కబురొస్తుంది. ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తే చాలనుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు. అక్కడ మాట్లాడకూడని విషయాలు కూడా కొన్ని ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
చదువయ్యాక కోరుకున్న ఉద్యోగానికి ఇంటర్వ్యూకు పిలుపొస్తే చాలు.. సాధించామనుకుంటాం. తీరా పూర్తి చేశాక ఎంపిక కాలేదనే కబురొస్తుంది. ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తే చాలనుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు. అక్కడ మాట్లాడకూడని విషయాలు కూడా కొన్ని ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
- ఉద్యోగానికి సంబంధించి లేదా సంస్థ గురించి ఏదైనా విషయం అడిగితే తెలియదని సమాధానం చెప్పకూడదు. ఉద్యోగం పట్ల సీరియస్‌గా లేరన్న ఉద్దేశం కలిగించిన వారవుతారు. సంస్థ, దాని కీలక విభాగాల గురించి ముందుగానే అవగాహన తెచ్చుకోవాలి. అంకెలతో సహా వివరాలు చెప్పకపోయినా ఫర్వాలేదు. కానీ.. కనీస సమాచారమైనా తెలిసుండాలి. లేదంటే మీరు ఎంపిక కాకపోవడానికి ఇదొక కారణమవుతుంది. అలాగని తెలియని వాటికి ఏదోకటి చెప్పాలన్న తీరూ మంచిది కాదు. ఇదీ నష్టపరిచేదే.
- ఈ స్థానాన్నిస్తే మీవంతుగా సంస్థ అభివృద్ధికెలా తోడ్పడతారని అడగొచ్చు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి మీరెలా అర్హులో.. ఆ స్థానంలో మీ బాధ్యతలను ఎలా నిర్వర్తించగలుగుతారో తెలుసుకోవడం ఈ ప్రశ్న ఉద్దేశం. ఉద్యోగం ద్వారా మీకొచ్చే ప్రయోజనాలు, శలవులు వంటివి ఏకరువు పెట్టొద్దు. మీ నైపుణ్యాలు ఉద్యోగానికి ఎలా సరిపడతాయో చెప్పండి.
- మీరేమన్నా అడగదలుచుకున్నారా అని చివర్లో అవకాశాన్నిస్తారు. ఏమీ లేవని ఊరుకోవద్దు. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వచ్చిన సందేహాలను అప్పుడు నివృత్తి చేసుకోండి. అలాగే ఏదో ఒకటి ప్రశ్నించాలనుకుంటూ సంస్థ ప్రొఫైల్ ఏంటి, ఏం చేస్తోందని అడగకూడదు. వ్యక్తిగత ఎదుగుదల అవకాశాలు, ప్రాజెక్టులకు సంబంధించినవి అడగొచ్చు. ఇంకా సామాజిక సేవలో సంస్థ సిబ్బందికి పాలుపంచుకొనే అవకాశాన్ని అందించడం గుర్తు చేస్తూ.. చాలా హర్షదాయకమనే మీ అభిప్రాయాన్ని చెప్పాలి. ఇవన్నీ ఎదుటివారికి మీపై సదభిప్రాయాన్ని కలిగిస్తాయి.
- వ్యక్తిగత, విద్యార్హతల వివరాలను రెజ్యూమెలో పరిశీలించే ఉంటారు. అయినా వాటి గురించి ప్రశ్నలడిగితే దరఖాస్తులో పొందుపరిచినవే చెప్పి ఊరుకోవద్దు. పెద్దగా సన్నద్ధమవ్వలేదన్న భావన ఏర్పరిచిన వారవుతారు. మీరు చేసిన ప్రాజెక్టులు, పరిశోధనలు, వాటి కోసం మీరు చేసిన కృషి, పొందిన ప్రశంసలన్నీ వివరించాలి. ఇవన్నీ మీపై సానుకూల భావాన్ని ఏర్పరుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.