మీ ప్రపంచాన్నే మార్చేసుకోండిలా...!

పెళ్లి, పిల్లలు...కుటుంబ బాధ్యతలు అంటూ కొందరు మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో కెరియర్‌కి దూరమవుతుంటారు. కొన్నాళ్లు గడిచేసరికి తామేమీ చేయలేకపోతున్నామనే నిస్సహాయత వారిని కుంగుబాటులోకి నెట్టేస్తుంది.

Published : 22 Aug 2023 00:01 IST

పెళ్లి, పిల్లలు...కుటుంబ బాధ్యతలు అంటూ కొందరు మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో కెరియర్‌కి దూరమవుతుంటారు. కొన్నాళ్లు గడిచేసరికి తామేమీ చేయలేకపోతున్నామనే నిస్సహాయత వారిని కుంగుబాటులోకి నెట్టేస్తుంది. ఇలాంటప్పుడు జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవాలన్నా, నూతనోత్సాహంతో అడుగులు వేయాలన్నా ఈ సూత్రాలు మీకెంతగానో తోడ్పడతాయంటారు మానసిక నిపుణులు.

జీవితంలో వెనకబడిపోతున్నామని బాధపడిపోతుంటారు చాలామంది. అందుకు తమకెన్నో ప్రతిబంధకాలున్నాయని చెబుతుంటారు. ఎన్ని ఇబ్బందులున్నా... నేర్చుకోవాలన్న తపనకి అది అడ్డంకి కాకూడదు. ఉదాహరణకు తోటపని అంటే ఇష్టముంటే సామాజిక మాధ్యమాల్లో ఉన్న సంబంధిత నెట్‌వర్క్‌లు, గ్రూపుల్లో చేరండి. కొత్త విషయాలెన్నో తెలుస్తాయి. ఇదేకాదు... మీకు ఆసక్తి ఉన్న ఫ్యాషన్‌ అప్‌డేట్లూ, టెక్నాలజీ, హోం, కిచెన్‌ గ్యాడ్జెట్స్‌ వంటి వాటి గురించీ తెలుసుకోవచ్చు. ఇవి మీకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. నిరాశను దూరం చేస్తాయి.

  • బాధ, సంతోషాలు కాలచక్రంలో ఒకదాని వెంటే పయనిస్తాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే చిన్న సమస్యలు కూడా పెద్ద కష్టంగా కనిపిస్తాయి. గతాన్ని తిరిగి తేలేం కానీ, భవిష్యత్తుకోసం మీరేం కోరుకుంటున్నారో స్పష్టత తెచ్చుకోండి. కెరియర్‌లోకి తిరిగి అడుగుపెట్టడానికి అవసరమైన నైపుణ్యాలన్నీ పోగుచేసుకోండి. అలాకాకుండా స్వయం ఉపాధినో, మరో అభిరుచినో ఏర్పరుచుకోవాలనుకుంటే... దానిపైనా కొంత శోధన చేసి ఓ నిర్ణయానికి రండి. అప్పుడే జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టినట్లుగా అడుగులు వేయండి. ఇష్టంతో చేసే పనిలో త్వరగానే విజయం సాధించగలరు.
  • వయసైపోయిందనో, నల్లగా ఉన్నాననో, పొట్టిగా కనిపిస్తున్నానో...ఇంక నేనేం చేయగలననో మీలోని లోపాలను మీరే ఎత్తి చూపించుకోకండి. అవి మిమ్మల్ని మరింత ఆత్మన్యూనతకు గురి చేస్తాయి. ‘నేను చేయగలను’ అని గట్టిగా అనుకుంటే మీలోని సానుకూల అంశాలు మరింత బలపడతాయి. మీరు కోరుకున్న లక్ష్యానికి దగ్గర చేస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని