ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండిలా..

ఏదైనా ప్రాజెక్టుకి మిమ్మల్ని నాయకత్వం వహించమంటే అమ్మో! ‘నేను అమ్మాయిని చేయగలనా? అంత సామర్థ్యం నాకుందా’ అంటూ అని వెనకడుగేస్తుంటాం. కానీ, ఇదే భయం నిరంతరం కొనసాగితే మాత్రం కష్టమే.

Published : 27 Aug 2023 01:35 IST

ఏదైనా ప్రాజెక్టుకి మిమ్మల్ని నాయకత్వం వహించమంటే అమ్మో! ‘నేను అమ్మాయిని చేయగలనా? అంత సామర్థ్యం నాకుందా’ అంటూ అని వెనకడుగేస్తుంటాం. కానీ, ఇదే భయం నిరంతరం కొనసాగితే మాత్రం కష్టమే. ఇలాంటప్పుడు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికి ఈ సూచనలు పనికొస్తాయంటారు నిపుణులు.

విజయాలను గుర్తు చేసుకోండి... జీవితంలో గెలుపోటములు సహజం. ఓడిపోతామని భయపడే బదులు ప్రయత్నించి చూడండి. ఎప్పుడైనా నిరుత్సాహం ఆవరించినప్పుడూ, ముందడుగు వేయలేం అని భయం వేసినప్పుడూ... చిన్నప్పటి నుంచీ ఇప్పటివరకూ మీరు సాధించిన విజయాలను ఓ సారి గుర్తు చేసుకోండి. అందుకు సంబంధించిన గుర్తులు, సర్టిఫికెట్లూ, ఫొటోలు, వీడియోలు ఏమైనా ఉంటే తరచి చూసుకోండి. ఇవన్నీ మీలో పునరుత్తేజాన్ని తీసుకొస్తాయి.

నేర్చుకోండి... ఇది నేను చేయగలనా లేదా అనే భయం, ఆందోళన మనల్ని వెనక్కి నెట్టేస్తాయి. వీటిని మన దరిచేరనివ్వకూడదంటే.. తెలియని విషయాల్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. చేసే పనిలో నైపుణ్యం సాధించాలి. ఇవన్నీ మన లక్ష్యసాధనలో ముందుండి నడిపిస్తాయి.

పోలికవద్దు...  చేసే పనిలో జయాపజయాలను పక్కనపెట్టి ముందు మీపై మీరు నమ్మకం ఉంచండి. ఇతరులతో పోల్చుకోవడం పోటీ   తత్వాన్ని పెంచుతుందన్న మాట నిజమే. అయితే, అదే పనిగా ఎదుటివారిని గమనించడం, వారిలోని లోపాలను వెతికే ప్రయత్నం చేయడం వంటివన్నీ మిమ్మల్ని పక్క దారి పట్టిస్తాయి. మీ తప్పుని సమర్థించుకోవడం మొదలుపెట్టేలా మిమ్మల్ని దారి మళ్లిస్తాయి.

సాధనతోనే... సమావేశాల్లో పాల్గొనే ముందు,  ప్రజెంటేషన్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అందుకు అవసరమైన సమాచారాన్ని ముందుగానే సేకరించుకోవాలి. తడబాటు లేకుండా వివరించేందుకు తగిన సాధన చేయాలి. వీలైతే స్నేహితులూ, కుటుంబ సభ్యుల ఎదుట ప్రాక్టీస్‌ చేయండి. తప్పొప్పులను సవరించుకుని ముందడుగు వేయగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని