కన్నయ్య జీవితం మనకు పాఠం!

తల్లులకు చిలిపి కృష్ణుడు.. చిన్నారులకు స్నేహితుడు.. అమ్మాయిలకు గోపికా వల్లభుడు.. పెద్దలకు మార్గనిర్దేశకుడు.. ఇలా అందరికీ ఆత్మీయుడిలా కనిపిస్తాడు కన్నయ్య! తన జన్మదినాన్నే కృష్ణాష్టమిగా జరుపుకొంటాం.

Updated : 07 Sep 2023 04:30 IST

తల్లులకు చిలిపి కృష్ణుడు.. చిన్నారులకు స్నేహితుడు.. అమ్మాయిలకు గోపికా వల్లభుడు.. పెద్దలకు మార్గనిర్దేశకుడు.. ఇలా అందరికీ ఆత్మీయుడిలా కనిపిస్తాడు కన్నయ్య! తన జన్మదినాన్నే కృష్ణాష్టమిగా జరుపుకొంటాం. పూజ, నైవేద్యాలేనా? ఆయన నుంచి ఏం నేర్చుకోవాలో మన పిల్లలకి పాఠాలుగా చెబుదామా మరి?


ఈ క్షణమే ముఖ్యం..

ఉరుకుల పరుగుల జీవితం. ‘రేపు, భవిష్యత్తు’ పేరుతో మనం పరుగులు తీస్తున్నాం. పిల్లలనీ ఆ రేసులోకి నెడుతున్నాం. ఎంతసేపూ భవిష్యత్తు బాగుండాలని పరుగెడుతుంటే ఈ క్షణాన్ని అనుభవించేదెప్పుడు? కృష్ణయ్య జీవితం నేర్పేదదే! రాబోయే పరిస్థితులకు సిద్ధంగా ఉండమంటాడు. కానీ ప్రస్తుతాన్ని ఆస్వాదించమంటాడు. ఈ విధానాన్ని నేర్పండి. అప్పుడు ఒత్తిడి కాదు.. జ్ఞాపకాలు పోగేసుకుంటూ ప్రశాంత జీవనాన్ని ఆస్వాదించగలుగుతారు.


నచ్చిందే చేయాలి..

కృష్ణుడంటే మొదట గుర్తొచ్చేది వేణునాదమే! ఎన్ని బాధ్యతలున్నా తన గురించి తనెప్పుడూ మరవలేదు. నచ్చిన వేణునాదాన్ని సాధన చేస్తూనే వచ్చాడు. జీవితంలో ఏదైనా ఎదురవనీ.. నీకు నచ్చిన దానికోసం సమయం కేటాయించుకోవాలన్నది కన్నయ్య నుంచి నేర్చుకోమనొచ్చు.


స్నేహానికి ప్రాణం..

ఆర్థికంగా చితికిపోయిన కుచేలుడు తన ఇంటికొస్తే ఇల్లు, తిండి అన్నీ సమకూర్చాడు. స్వచ్ఛమైన స్నేహం చూపిస్తే ఎలా తిరిగి మంచి జరుగుతుందో దీన్ని ఉదాహరణగా చెప్పొచ్చు.


బాధ్యతగా మెలగాలి..

బంధువులతో పోరుకి సందేహిస్తున్న అర్జునుడికి తన బాధ్యతను గుర్తుచేశాడు. అన్నగా రక్షిస్తానని ద్రౌపదికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. చిన్నదైనా పెద్దదైనా చేస్తాను అని అంటే ఆ మాట నిలబెట్టుకోవాలన్న పాఠం నేర్పుతుంది కృష్ణుడి జీవితం. చాలావరకూ ఫలితం గురించి ఆలోచించి ప్రయత్నానికి వెనకాడతారు పిల్లలు. అందుకే అక్కడే ఆగిపోతారు. విజయమైనా, అపజయమైనా అనుభవం వస్తుందని వెన్నుతట్టండి. కొత్తవి చేయడానికి భయపడరు.


ఒదిగుండాలి..

‘కారణ జన్ముడు’ అని అందరూ కీర్తించినా.. నేనే గొప్ప అన్నట్టుగా ఉండదు కృష్ణయ్య తీరు. పెద్దలను గౌరవించేవాడు, ఎవరితోనైనా మృదువుగానే మాట్లాడేవాడు. అందుకే తనని మెచ్చనివారు ఉండరు. చుట్టూ ఉన్నవారి మనసు గెలవాలా.. ఈ తీరును అలవరచుకోమనండి.


వస్తువుల్లో చూడొద్దు..

రాజ్యం, సంపద, మనుషుల పొగడ్తల్లో కాదు.. పశువులతో గడపడం, సంగీతం, స్నేహితులతో ఆటలు ఇలా ప్రతిదానిలో ఆనందం వెతుకున్నాడు. కాబట్టి.. పక్కవారితో పోల్చుకొని బాధ పడటం.. ఇతరుల వద్ద ఉన్న బొమ్మలు వస్తువులు నా దగ్గర లేవని ఏడవడం కాదు. చిన్న చిన్న విషయాల్లో.. సాయంలో సంతోషాన్ని వెతుక్కోమనండి. జీవితంలో ప్రతి విషయంలోనూ సానుకూలత చూడటం అలవాటు చేసినవారవుతారు.


కృష్ణుడంటే భక్తి, పూజలే కాదు.. దయకీ, బలానికీ, మంచితనానికీ, స్నేహానికీ ముఖ్యంగా నాయకత్వానికీ ప్రతీక. ఆ తత్వాన్ని మన బాలకృష్ణులకీ బోధించగలిగితేనే ఈ వేడుకకి అసలైన పరమార్థం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని