మోసం చేస్తే అంతే!

ఆఫీసులో పక్కవాళ్లని మెచ్చుకుంటూ మనల్ని పక్కనపెడితే ఎవరికైనా బాధే! వాళ్లు ఎందులో గొప్ప అని సరిచూసుకుని మరింత కష్టపడితే సరే! అలాకాకుండా అసూయ పెంచుకుని, వాళ్లు ఇబ్బందిపడితే చూడాలి అనుకుంటే మీకే సమస్యగా మారొచ్చు.

Published : 13 Jun 2024 02:55 IST

ఆఫీసులో పక్కవాళ్లని మెచ్చుకుంటూ మనల్ని పక్కనపెడితే ఎవరికైనా బాధే! వాళ్లు ఎందులో గొప్ప అని సరిచూసుకుని మరింత కష్టపడితే సరే! అలాకాకుండా అసూయ పెంచుకుని, వాళ్లు ఇబ్బందిపడితే చూడాలి అనుకుంటే మీకే సమస్యగా మారొచ్చు. అందుకు ఈ కథే ఉదాహరణ. గాడిద, నక్క మంచి స్నేహితులు. ఎక్కడికైనా కలిసే వెళ్లేవి. ఓసారి ఇలాగే ఆహారం కోసమని వెళితే సింహం ఎదురుపడింది. దాన్ని చూడగానే రెండింటికీ గుండె ఆగినంత పనైంది. కానీ కాసేపటికి తేరుకున్న గాడిద పారిపోదామంది. ఆలోచనలో పడ్డ నక్క మాత్రం ‘సింహంతో నేను మాట్లాడి వస్తా, నువ్విక్కడే ఉండు’ అని దాని దగ్గరికెళ్లింది. వెళ్లాక ‘మృగరాజా... నన్ను చంపను అంటే... మీరు కష్టపడకుండా ఆ గాడిద మీకు ఆహారమయ్యేలా చూస్తా’ అంది. బాగా ఆలోచించిన సింహం కూడా సరేనంది. తన పథకం పారిందని సంతోషించిన నక్క ‘మనిద్దరినీ వదిలేయమని కోరా. గబగబా పారిపోదాం రా’ అని గాడిదను తీసుకెళ్లి, ఓ గుంతలో నెట్టేసింది. ఆపై సింహంవైపు గర్వంగా చూసింది. ‘గాడిద ఎలాగూ పారిపోలేదు. దాన్నెప్పుడైనా తినొచ్చు. ముందు దీని పనిచెబుదా’మనుకున్న సింహం నక్కపై దాడిచేసి చంపేసింది. స్కూలు, కాలేజీ లాంటిదే ఆఫీసు కూడా. ప్రాణస్నేహితులే ఉండాల్సిన అవసరం లేదు కానీ... పని సజావుగా సాగడానికి కనీస స్నేహం అవసరం. ముందు చిరునవ్వుతో పలకరిస్తూ... వెనక వారిపై లేనిపోనివి చెప్పడం, వారి తప్పులను పైవారికి చేరవేయడం లాంటివి చేయకూడదు. అవి తిరిగి బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువ. పైగా ఎవరికీ మీపై నమ్మకం ఉండదు. ఇంకా, వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యమిస్తూ బృందపనికి దూరమైతే విజయం దక్కదు సరికదా... ఆత్మీయులూ ఉండరు. మరి ఇలాంటి ప్రవర్తనకు దూరంగా ఉందామా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్