పచ్చని పెళ్లి సంబరం!

పెళ్లంటే... తప్పెట్లు, తాళాలు, బంధువులు... గుర్తుండిపోయే సందడి అది. కానీ ఆ వేడుక తాలూకూ చిహ్నాలు చెత్తరూపంలో భూమికి భారమవుతున్నాయి. తన పెళ్లి అలా కాలుష్యానికి కారణమవొద్దనుకున్న ఓ డాక్టరమ్మ ప్రయత్నం నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది.

Updated : 13 Jun 2024 14:13 IST

పెళ్లంటే... తప్పెట్లు, తాళాలు, బంధువులు... గుర్తుండిపోయే సందడి అది. కానీ ఆ వేడుక తాలూకూ చిహ్నాలు చెత్తరూపంలో భూమికి భారమవుతున్నాయి. తన పెళ్లి అలా కాలుష్యానికి కారణమవొద్దనుకున్న ఓ డాక్టరమ్మ ప్రయత్నం నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆమెవరంటే...

పూర్వీ భట్‌... పోషకాహార నిపుణురాలు. ‘హెర్బేశ్వరి’ పేరుతో ఇన్‌స్టాలో ఆహారంలోని పోషకాలపై అవగాహన కల్పిస్తుంటారు. ఈమెది బెంగళూరు. పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు కలవడమే కాదు, ఆ వేడుక భూమికీ భారమవ్వకూడదు అనుకున్నారామె. అందుకే తన పెళ్లిలో ‘సున్నా వృథా’ ఉండాలని ఆశపడ్డారు. అందుకు రెండు కుటుంబాలూ ఆమోదం తెలపడంతో తను ఆశించిన పర్యావరణహిత పెళ్లి సాధ్యపడిందంటారామె. పెళ్లి మంటపాన్ని చెరకు గడలు, పూలు, మామిడాకులు, కొబ్బరి ఆకులతో రూపొందించారు.

భోజనాలకేమో డిస్పోజబుల్‌ వాటిని కాదని, అరటి ఆకులు, స్టీలు గ్లాసులకు ప్రాధాన్యమిచ్చారు. తాజాపూలు, పత్తిదారాలతో పూలదండలు సిద్ధం చేసుకున్నారు. పచ్చని చెట్ల మధ్యే పెళ్లి. పెళ్లికి వాడిన నీరంతా చెట్లకు వెళ్లే ఏర్పాటు చేసుకున్నారు. అతిథులకు బహుమతులను జ్యూట్‌ బ్యాగులో అందించారు. మంటపానికి వాడిన చెరకుగడల్ని తరవాత ముక్కలు చేసి, ఆవులకు మేతగా పెట్టారు. ఇక వాడిన పూలు, ఆకులను కంపోస్టు చేసి, వేడుక జరిగిన తోటలోని మొక్కలకే ఎరువుగా మార్చే ఏర్పాటు చేసుకున్నారట. ‘ఇదంతా సాధ్యమవడానికి మా అమ్మే కారణం. ప్రణాళిక దగ్గర్నుంచి వేడుకంతా దిగ్విజయంగా పూర్తవడంలో తనదే ప్రధాన పాత్ర’ అంటారు పూర్వీ. ఈ వివరాలన్నీ వీడియోగా తీసి, ఇన్‌స్టాలో పోస్టు చేశారామె. దాన్ని 91 లక్షల మంది చూడటమే కాదు, ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. మరికొందరు ఆమె బాటలోనే మేమూ నడుస్తామంటున్నారు. ‘ఒకప్పుడు పెళ్లిళ్లే అంత. వాడిన ప్రతి వస్తువునీ తరవాత ఏదో రూపంలో వాడేవారు. మళ్లీ అలాంటి రోజులు వచ్చి పచ్చదనంతో కూడిన పెళ్లిళ్లకు ప్రాధాన్యం పెరిగితే బాగుండు’ అంటున్నవారూ లేకపోలేదు. ఏదేమైనా పూర్వీ ప్రయత్నం మాత్రం అభినందనీయమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్