అందుకే నోరు విప్పాలి!

అలా మంచం మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటుంటే... భోజనం సహా అన్నీ దగ్గరకు తెచ్చివ్వాలి. తల నిమురుతూ దగ్గరకు తీసుకోవాలి. చాక్లెట్, ఐస్‌క్రీమ్, చిప్స్‌... మనసు కోరిన స్నాక్స్‌ కోరుకోగానే ప్రతక్ష్యమవ్వాలి... పీరియడ్‌ సమయంలో ఇలా కోరుకోని అమ్మాయి ఉండదు.

Published : 14 Jun 2024 03:20 IST

అలా మంచం మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటుంటే... భోజనం సహా అన్నీ దగ్గరకు తెచ్చివ్వాలి. తల నిమురుతూ దగ్గరకు తీసుకోవాలి. చాక్లెట్, ఐస్‌క్రీమ్, చిప్స్‌... మనసు కోరిన స్నాక్స్‌ కోరుకోగానే ప్రతక్ష్యమవ్వాలి... పీరియడ్‌ సమయంలో ఇలా కోరుకోని అమ్మాయి ఉండదు. ఇంట్లో ఉంటే ఇవన్నీ కొందరికైనా సాధ్యమవుతాయేమో! ఆఫీసులో అసలు ఊహించగలమా? కాస్త వేడిగా తాగు అని ఓ కప్పు కాఫీ... మూడ్‌ బాగవుతుందని ఓ చాక్లెట్‌ ఇవ్వడం... ‘ఈరోజుకి నువ్వు విశ్రాంతి తీసుకో. నీ పని నేను చూసుకుంటాలే’ అనే సహోద్యోగి, ‘ఏవైనా ఉంటే ఫోన్‌లో చెప్పొచ్చు కానీ... ముందు నువ్వు సెలవు తీసుకో’ అనే బాస్‌... ఇలా పీరియడ్‌ సమయంలో ఆఫీసు వాతావరణం ఉంటే ఎంత బాగుంటుందో కదా! అది ఊహే... వాస్తవంలో మాత్రం అసాధ్యమే. అయినప్పటికీ...

పీరియడ్‌లో నొప్పి, చిరాకు ఉంటాయన్నది తెలిసిందే. కానీ అది రావడానికి ముందు నుంచే మనకెన్ని పరీక్షలు పెడుతుంది? ఒక్కోసారి నీరసం ఆవరిస్తే... మరోసారి భావోద్వేగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అసహనం, విసుగు ప్రదర్శిస్తే ఏమంటారు? ప్రియుడితోనో, భర్తతోనో గొడవపడి ఉంటుంది అంటారు. ఎక్కువసేపు నిల్చోలేక కూర్చొని ఏదైనా వివరించినా, మాట్లాడినా... ‘సుకుమారం’ అన్న దెప్పుళ్లు సరేసరి. పోనీ తట్టుకోలేక లీవ్‌ అడుగుదామా అంటే... ఇంత చిన్నదానికి సెలవు అవసరమా అని మనకు మనమే చెప్పుకొంటాం. మన అసౌకర్యాన్ని బయటకు చెప్పలేక, అవతలివాళ్లు అర్థం చేసుకోవడం లేదని బాధపడతాం కూడా. ఈ ఒక్కరోజైనా వదిలేస్తే బాగుండు అనీ అనుకుంటాం. కానీ ఒక్కసారైనా ప్రతినెలా మనలో జరిగే ఈ సంఘర్షణని  చెబుతామా? నెలసరి గురించి ఏం మాట్లాడతామంటాం, వినడానికీ సిగ్గుపడతాం. ఇంత రహస్యంగా దాచే దాని గురించి అవతలి వాళ్లు మాత్రం ఎలా అర్థం చేసుకుంటారు? అందుకే నోరు విప్పమంటోంది ‘పరీ’ అనే శానిటరీప్యాడ్స్‌ తయారీ సంస్థ. ‘ఈజ్‌ హర్‌ వర్క్‌ ఫ్లో’ క్యాంపెయిన్‌ ద్వారా ఈ అవగాహన కల్పిస్తోంది. నెలసరి ఇబ్బందిని నోరు విప్పమని మనకీ, ఆ సమయంలో ఆమె ఇబ్బందిని అర్థం చేసుకోమని సహోద్యోగులకీ చెబుతోంది. అప్పుడే ఆఫీసుల్లో మహిళలు సౌకర్యవంతంగా మరింత ఆత్మవిశ్వాసంతో పనిచేయగలుగుతారంటోన్న వీళ్ల ఆలోచన బాగుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్