వెళ్లగొట్టే హక్కు లేదు!

ఓవైపు అమ్మాయిలు అంతరిక్షంలోకీ అడుగుపెడుతుంటే... మరోవైపు ఆడపిల్లలపై వివక్ష ఇంకా ఉందని తెలియజేసే ఘటనలూ జరుగుతున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా చీరాల మండలం కొత్తపాలెంకు చెందిన కుసుమాంజలికి ఎదురైన అనుభవమే ఇందుకు నిదర్శనం.

Published : 10 Jul 2024 01:12 IST

ఓవైపు అమ్మాయిలు అంతరిక్షంలోకీ అడుగుపెడుతుంటే... మరోవైపు ఆడపిల్లలపై వివక్ష ఇంకా ఉందని తెలియజేసే ఘటనలూ జరుగుతున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా చీరాల మండలం కొత్తపాలెంకు చెందిన కుసుమాంజలికి ఎదురైన అనుభవమే ఇందుకు నిదర్శనం. 2021లో మణికంఠరెడ్డి, కుసుమాంజలి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే 20రోజుల క్రితం ఆమె భర్త ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న అక్కల కుసుమాంజలి వారం క్రితం ప్రసవించింది. అప్పటికే ఓ ఆడబిడ్డ ఉండగా రెండో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలకు ఆమె జన్మనిచ్చింది. ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో అత్తింటివారు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వారి జోక్యంతో సమస్య సద్దుమణిగింది. అయితే, ఇలాంటి సమస్యల పరిష్కారానికి న్యాయ నిపుణులు ఏమంటున్నారంటే...

గృహహింస చట్టం ప్రకారం వివాహితకు అద్దెదైనా సరే అత్తింట్లో నివసించే హక్కు ఉంటుంది. ఒకవేళ అది ఆమె భర్త సొంత ఆస్తి అయి, వీలునామా రాయకుండా చనిపోతే అందులోంచి ఆమెకూ, పిల్లలకూ వాటా ఉంటుంది. అంతేకాదు, ఆమెకు పెళ్లప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం, బహుమతులూ, అత్తమామలు ఇచ్చిన బంగారంతో సహా ఆమె స్వార్జితంగానే భావించాలి. అవన్నీ ఆమెకు చెందినవే. భర్తకు వచ్చిన పిత్రార్జిత ఆస్తి అయినా, సొంతంగా సంపాదించిందైనా ఆమెకూ, పిల్లలకూ వాటా ఉంటుంది. భర్తకు వచ్చే ప్రావిడెంట్‌ ఫండ్‌ లాంటి వాటిలోనూ అతని తల్లికీ, భార్యకూ సమానంగా హక్కు ఉంటుంది. అయితే, మామగారి స్వార్జితంలో ఆయన బతికి ఉండగా వీళ్లకు హక్కు ఉండదు. ఇవేకాదు, ‘పుట్టబోయేది ఆడా, మగా అని నిర్ణయించేది మగవారిలోని క్రోమోజోములే. దీనికి ఆడవాళ్లు కారణం కాదు. ఈ విషయాన్ని ఆడపిల్లను కన్నావంటూ కోడళ్లను వేధించే అత్తమామలు తెలుసుకోవాలి’ అంటూ ఇటీవల దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి, అమ్మాయిలూ ఇలాంటి కఠినమైన సందర్భాల్లో... ఇది నా తలరాతని సరిపెట్టుకోకుండా, కుసుమాంజలి మాదిరిగానే ధైర్యంగా చట్టాన్ని ఆశ్రయించండి. మీకు న్యాయం దక్కుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్