Updated : 19/02/2021 15:24 IST

గుప్పెడు సంకల్పం!

మార్పు కోరుకుంటే...దానికోసం మొదటి అడుగు మనమే వేయాలి. దాన్నే నమ్మింది ఓ అమ్మాయి. బడికెళ్లే వయసులో మనసులో నాటుకున్న సేవాబీజం...ఒంటరిగా మొలకెత్తి... మరికొంతమందినీ తనతో చేర్చుకుంటూ విస్తరిస్తోంది. మరి అదెలాగో తెలుసుకుందామా!
‘సాయం చేయాలనే తపన ఉండాలే కానీ...అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు’...అందుకే నా ఆలోచనలు, ఆశయాలకు హద్దులు గీసుకోలేదని చెబుతోంది విజయవాడకు చెందిన అనూష. బడికెళ్లేటప్పుడు ఓ సారి వరదబాధితులకు చందాలు సేకరించి ఇచ్చింది. ఆ క్రమంలోనే తనకు సేవాభావం అలవడిందని చెబుతోందామె.
నిరుపేద రోగుల వైద్య సాయం కోసం స్నేహితుల నుంచి  పాత పుస్తకాలు సేకరించి.. వాటిని అమ్మి డబ్బు ఇచ్చేది. చందాలు పోగు చేసేందుకు కాలేజీలో ప్రత్యేకంగా ఒక బాక్సుని ఏర్పాటు చేసింది. సేవ చేయాలనే ఆమె తపన గుర్తించిన ఓ అధ్యాపకుడు... రోజూ గుప్పెడు బియ్యం దాచి చేయగలిగే పనుల్ని ఓసారి ఆమెతో పంచుకున్నారు. అనూషకు ఆ ఆలోచన నచ్చడంతో బంధువులు, స్నేహితులకు అవగాహన కల్పించి రోజూ గుప్పెడు బియ్యం చొప్పున దాచే ఏర్పాటు చేసింది. అలా అందరిసాయంతో ఇప్పటివరకూ కొన్ని వేల క్వింటాళ్ల బియ్యాన్ని సేకరించి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు అందించింది. ఇందుకోసం అనూష ప్రతి మూడు నాలుగు నెలలకోసారి ఇంటింటికీ తిరిగి బియ్యాన్ని సేకరిస్తోంది. లాక్‌డౌన్‌ కాలంలోనూ రోజూ సుమారు మూడు నుంచి నాలుగు వందల మంది ఆకలి తీర్చేది.

* పిల్లలకు పాఠాలు చెబుతూ... మురికివాడల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్య అందాలి...వారు చదువుకి దూరం కాకూడదనే ఆలోచనతో వారికి పాఠాలు చెప్పాలనుకుంది. ఇందుకోసం ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ అనే సంస్థలో చేరింది. బస్తీల్లో తిరుగుతూ విద్యార్థులను గుర్తిస్తోంది. వారు కాస్త దారిలో పడేవరకూ... వారంలో నాలుగు రోజుల పాటు తరగతుల్ని నిర్వహిస్తోంది. ఆంగ్లం, గణితం వంటివాటిల్లో పట్టు సాధించేలా చేస్తోంది. చదువుల్లో ప్రతిభ చూపించేవారి ఉన్నత విద్యకోసం అవసరమైన ఆర్థికసాయాన్ని ఆ సంస్థ చేయూతతో అందిస్తోంది. ఇలా 40 మంది అమ్మాయిలను చదివిస్తోంది. విజయవాడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి ‘లైంగిక వేధింపులపై అవగాహనా తరగతులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం యువతలో పెరిగిపోతున్న ఆత్మహత్యా ధోరణిని, చెడువ్యసనాల్ని నియంత్రించేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

- తెలికా బాలరాజు, విజయవాడ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని