Updated : 08/06/2021 08:46 IST

AP News: రూపాయికే పిల్లలకు వైద్యం

కొవిడ్‌ వ్యాప్తి, ఆంక్షల కారణంగా చిన్నారులకు సకాలంలో వైద్యసేవలు అందకపోవడం చూసి ఆమె చలించిపోయారు. ఈ సమస్య పరిష్కారానికి ఏదైనా చేయాలనుకున్నారు. కేవలం ఒక్క రూపాయికే ఆన్‌లైన్‌ ద్వారా చిన్నారులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆమే డాక్టర్‌ మర్రి పృథ్వి.

ల్గొండ పట్టణానికి చెందిన పృథ్వి కరీంనగర్‌లో ఎంబీబీఎస్‌ చదివారు. తర్వాత డీసీహెచ్‌ (డిప్లొమా ఇన్‌ చైల్డ్‌ హెల్త్‌), డీఎన్‌బీ (డిప్లొమెట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డు) లను పూర్తిచేశారు. బ్రిటన్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌, చైల్డ్‌ హెల్త్‌(ఆర్‌సీపీసీహెచ్‌) నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆమె భర్త సాయికాంత్‌వర్మ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం కడప జిల్లా సంయుక్త పాలనాధికారి. కొవిడ్‌ మొదటి దశ వ్యాప్తి సమయంలో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పృథ్వి ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహించారు. రెండో దశలోనూ అవకాశం వచ్చినా అనారోగ్య కారణాల రీత్యా చేరలేదు. కానీ ఆన్‌లైన్‌లో ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు.

ఇటీవల.. ఒక నాలుగేళ్ల చిన్నారి అనారోగ్యం బారినపడ్డాడు. అతని తల్లి తెలిసినవారి సూచన మేరకు ఆన్‌లైన్‌లో పృథ్విని సంప్రదించింది. అప్పటికే ఆరు రోజులుగా ఆ బాబు జ్వరంతో బాధపడుతున్నాడు. ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారంటే లాక్‌డౌన్‌ కారణంగా ఓపీలు మూసేశారని, ఆన్‌లైన్‌ వైద్యసేవల గురించి తనకు తెలియదని సమాధానమిచ్చింది. ఇది ఆ డాక్టర్‌ని కదిలించింది. ‘స్కూళ్లు, ఆఫీసుల మాదిరిగానే వైద్యులూ ప్రస్తుతం చాలావరకు ఆన్‌లైన్‌ కన్సల్టేషన్లు నిర్వహిస్తున్నారు. కానీ అవగాహన లేక చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దాదాపు ప్రతి కుటుంబంలో ఒక స్మార్ట్‌ఫోన్‌ ఉంటోంది. ఎన్నో యాప్‌లనూ సులువుగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి, ఈ మార్గంలోనే వైద్య సహాయాన్ని అందిస్తే చాలామందికి సకాలంలో మేలు జరుగుతుంది’ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానంటున్నారు పృథ్వి.

ఆదివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 18 ఏళ్ల లోపువారికి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. రోజూ ఆరు నుంచి పదిమంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. అవసరమైనవారు తన instagram: @dr_pruthvi_pediatrician, Facebook:@dr pruthvi_pediatrician ఇన్‌స్టాగ్రామ్‌,ఫేస్‌బుక్‌ పేజీల ద్వారా అపాయింట్‌మెంట్‌ పొందవచ్చని చెబుతున్నారామె. ‘ప్రస్తుతం ఒక్కదాన్నే కన్సల్టేషన్‌ చేస్తున్నా.  అందరికీ అందుబాటులో వైద్యం అందించేందుకు భవిష్యత్తులోనూ రూపాయి ఫీజే తీసుకుంటా. త్వరలోనే స్నేహితుల సహకారంతో 24 గంటలూ ఈ సేవలు అందించాలనుకున్నా’ అని అంటున్నారు పృథ్వి.

- పత్తెం కిరణ్‌ కుమార్‌, కడప


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని