Updated : 09/06/2021 06:31 IST

ఆమె... సేవా సైన్యం!

ఆపదొచ్చింది.. అంతటా ఎవరొచ్చి ఆదుకుంటారా అని ఎదురుచూపులే! సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆ విన్నపాలే.. ఆసుపత్రుల వద్ద ఎక్కడ చూసినా ఆర్తనాదాలే.. ఈ ఆపత్కాలంలో బాధితులకు అండగా నిలిచిన యువతరం వీరంతా..

కష్టం చూసి.. కన్నీళ్లు తుడిచి!

ప్లాస్మా కోసం ఓ 200 కాల్స్‌, ఆసుపత్రిలో పడకల కోసం ఇంకో వంద, భోజనం కోసం లెక్కలేనన్ని! ఇలా రోజుకు  రెండు రాష్ట్రాల నుంచీ సంప్రదిస్తూనే ఉన్నారు.. ఆమె స్పందిస్తూనే ఉంది. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ రెండు నెలలుగా స్రవంతి కాసరం దినచర్య ఇదే..  
స్రవంతి టెక్‌మహీంద్ర సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. గతేడాది కొవిడ్‌ మొదటి దశలో తనకెదురయిన అనుభవాల కారణంగా సేవలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ ప్రభుత్వాపత్రుల వద్ద కొవిడ్‌ బాధితుల కోసం వేచిచూసే బంధువుల కోసం ఆహారం పంపిణీతో పాటు అవసరమైన ఇతర సాయాలు చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమెకు తోడుగా నిలిచిన వారందరినీ కలుపుకొని ‘వీ ఆర్‌ విత్‌యూ’ వేదికను ఏర్పాటు చేసింది. ఇందుకోసం తన ఉద్యోగాన్నీ తాత్కాలికంగా వదులుకుని పూర్తిగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఈ వేదిక ద్వారా దాతల సాయంతో అవసరం అయిన వారికి ఆహారం, నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందిస్తోంది. ములుగు జిల్లాలోని గిరిజన కుటుంబాలకు నిత్యావసరాల్ని అందిస్తోంది. ‘పరిస్థితులు కుదుటపడేవరకూ ఈ సేవల్ని కొనసాగిస్తా... వీలైనంత మందికి చేయూతనందిస్తా’ అని చెబుతోంది స్రవంతి.


మా వాళ్లంతా వంటలక్కా అంటారు!

వలసకూలీల ఆకలి తీర్చడంతో మొదలైన ఆమె ప్రయత్నం... రెండో దశలో వందలమంది కొవిడ్‌ బాధితుల కడుపు నింపేంతవరకూ సజావుగా సాగుతూనే ఉంది. ఆత్మీయులంతా ప్రేమగా వంటలక్కా అని పిలుచుకునే జ్యోత్స్నాదేవి తన సేవాపథాన్ని ఇలా వివరించింది. ‘‘మాది హైదరాబాద్‌ వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌. మావారు శ్రావణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆయన ఉద్యోగరీత్యా రెండేళ్లు అమెరికాలో ఉండొచ్చాక ఇక్కడ కరోనా మొదటిదశ లాక్‌డౌన్‌ మొదలయ్యింది. అప్పుడే వలసకూలీల బాధలను టీవీలో చూశా. వాళ్లకు ఏదైనా సాయం చేయాలనిపించి... ఉదయాన్నే ఆహార పొట్లాలు సిద్ధం చేశా. మావారు వాటిని పంచి వచ్చాక ఇంకా ఏదైనా చేద్దామన్నారు. అప్పటికే ఆయన ‘వీ2హెల్ప్‌యూ’ సంస్థ ద్వారా పేదలకు సాయం చేస్తున్నారు. ఆ సంస్థనే వేదికగా చేసుకుని ‘ప్రాజెక్ట్‌ ఆరోగ్య’, ‘హెల్ప్‌టీచర్స్‌’ పేరుతో జీతాల్లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు 600 మందికి నెలకు సరిపడా నిత్యావసరాలు, కొంత డబ్బు ఇచ్చాం. ఇది జరిగి సంవత్సరం తిరగకుండానే ఇప్పుడు కొవిడ్‌ రెండో దశ తీవ్రత చూశాం. చాలామంది స్నేహితులు, బంధువులు కొవిడ్‌ కారణంగా.. వంట చేసుకోలేక, సరైన భోజనాల్లేక చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. అందుకే కొవిడ్‌ బాధితులకు భోజనాలు పంపాలని నిర్ణయించుకున్నా. నా వంటతిని వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ మొదలుపెడతా. ఇప్పుడు రోజూ 100 మందికి పంపిస్తున్నా. వాసన, రుచి తెలియని వారికి ప్రత్యేకంగా వండుతున్నాం. ఒక్కో ప్యాక్‌లో 8, 9 రకాల పదార్థాలు ఉంటాయి. వారానికోసారి చికెన్‌. అన్నంతోపాటు జీరారైస్‌, పొంగల్‌, కిచిడీల్లో ఏదో ఒకటి,  పప్పు, రెండు కూరలు, సాంబారు లేదా మిరియాల రసం ఉంటాయి. పల్లీపట్టీలు, సున్నండలు, ఎండుఫలాలు, కోడిగుడ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు జోడిస్తాం. వనస్థలిపురం, పీర్జాదిగూడ, ఉప్పల్‌, చందానగర్‌, కూకట్‌పల్లి, మణికొండల్లో ఐసోలేషన్‌లో ఉన్న కుటుంబాలకు మా భోజనం వెళ్తుంది. ఎక్కువగా మా సొంత డబ్బుతోనే చేస్తున్నాం. కొందరు స్నేహితులూ విరాళాలు ఇస్తుంటారు. అవి వచ్చినా రాకపోయినా మా సేవ ఆగదు’’.

- సతీశ్‌ దండవేణి, ఈటీవీ, హైదరాబాద్‌


సేవే ఉద్యోగమైంది..!

‘‘మార్చి కొవిడ్‌ కేసులు విజృంభిస్తున్న రోజులవి. ఓరోజు నా స్నేహితురాలి తల్లి కొవిడ్‌ బారిన పడింది. పరిస్థితి విషమించింది. ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఎవరూ సాయం చేయలేదు. ఎక్కడ పడకలు ఖాళీ ఉన్నాయో తెలియలేదు. చివరికి ఓచోట దొరికింది. తనిప్పుడు కోలుకుంది. కానీ ఆరోజును తలుచుకుంటే మాత్రం బాధనిపిస్తుంది. మాలాంటి వాళ్లు ఎంత మంది ఉన్నారో అనిపించినప్పుడల్లా మనసు చివుక్కుమంటుంది. అప్పుడే ఏదైనా చేయాలని ఇది ప్రారంభించా అని వివరించింది సికింద్రాబాద్‌కు చెందిన సుకన్య రాయల్‌. హైటెక్‌సిటీలోని ఇన్ఫర్‌ ఇండియా సంస్థలో పనిచేస్తుంది సుకన్య. ఒంటరిగా మొదలైన ఆమె సేవ.. ఈ ఆపత్కాలంలో ఎందరినో ఆదుకుంది. వందల మందికి ప్లాస్మాదానం, ఆసుపత్రుల్లో పడకల విషయంలో సాయపడింది. ఎన్జీవోలు, పోలీసులు, ఐటీ ఉద్యోగుల సాయంతో ఆమె చేసిన సేవలు ఎందరో బాధితుల కన్నీళ్లు తుడిచాయి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సుకన్యకు తల్లి మీనాకుమారే అన్నీ అయి పెంచారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉండాలని ఆవిడ చెప్పిన మాటలే ఆమెకు వేదవాక్కు అయ్యాయి. సైబరాబాద్‌ పోలీసులు చేపట్టే అన్ని సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ వలంటీర్‌గా సేవలందిస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా వచ్చే ప్రతి వినతికీ స్పందించింది. ఆమె పనిచేస్తున్న సంస్థ తన సమయాన్ని పూర్తిగా సేవకే కేటాయించేందుకు అనుమతించి, జీతం కూడా ఇస్తూ ప్రోత్సహించింది. ‘సామాజిక మాధ్యమాల ద్వారా నా నెంబర్‌ చాలామందికి చేరింది. ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా ఫోన్లు వస్తూనే ఉంటాయి. వీలైనంత మందికి కూడా సాయం అందిస్తూనే వచ్చా’ అంటూ చెప్పుకొచ్చింది సుకన్య.

- అభిసాయి ఇట్ట, హైదరాబాద్‌


మంచిమాట

ఏ మహిళ అయినా గొప్ప రక్షణ పొందాలి అంటే అది ఆమె చేతుల్లోనే ఉంటుంది. ధైర్యస్థైర్యాలను పెంచుకోవాలి.

- ఎలిజబెత్‌ క్యాడీ స్టాంటన్‌, మహిళా హక్కుల ఉద్యమ నాయకురాలుగమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని