close
Updated : 10/06/2021 08:02 IST

Zerodha: ఈవిడ జీతం వందకోట్లు!

‘ఐదంకెల జీతమట..’ అని ఒకప్పుడు గొప్పగా చెప్పుకొనేవాళ్లం! అది పాతమాట. కోట్లలో జీతాలు అందుకోవడం ఇప్పుడు నయాట్రెండ్‌. కొమ్ములు తిరిగిన సీఈవోలతో పోటీ పడుతూ స్టార్టప్‌ల చరిత్రలోనే తొలిసారిగా వందకోట్ల జీతాన్ని అందుకుంటున్న మహిళగా వార్తల్లోకెక్కింది జీరోధా డైరెక్టర్‌ సీమాపాటిల్‌...
దేశంలోనే అతిపెద్ద రిటైల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జీరోధాకి సీమాపాటిల్‌ డైరెక్టర్‌. ఒకప్పుడు ట్రేడింగ్‌ అంటే అదో రాకెట్‌సైన్స్‌ అనుకునేవారు. జీరోధా పుణ్యమాని ఆ భావన మారింది. ఇప్పుడు అందరూ ట్రేడింగ్‌లో సులభంగానే అడుగుపెడుతున్నారు. మునుపెన్నడూ లేనంతగా యువతని ఈ రంగంలోకి ఆహ్వానించిందీ సంస్థ. ట్రేడింగ్‌ ఛార్జీల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లని అందివ్వడంతోపాటు...  సాంకేతిక సాయంతో సులభంగా, తేలిగ్గా వాడుకోగలగడం జీరోధా యాప్‌ ప్రత్యేకత. అరకోటి వినియోగదారులున్న ఈ సంస్థని.. 2010లో సీమా భర్త నితిన్‌ కామత్‌ ప్రారంభించారు. ఈ సంస్థలో తొలినుంచీ సీమా కీలక పాత్ర పోషిస్తోంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌లో ఆరేళ్లు పనిచేసిన అనుభవం జీరోధాని ముందుకు నడిపించడానికి సహకరించిందామెకు. ‘మాది బెళగావ్‌. మధ్యతరగతి కుటుంబం. నితిన్‌ ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తూ... జీరోధా ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. నేను కూడా అక్కడే పనిచేసేదాన్ని. ఇంట్లో మా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు అమ్మానాన్నలు తను పనిచేసే రిలయన్స్‌ ఆఫీసుకెళ్లి వాకబు చేసి వచ్చారు. తను షేర్లు, స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతాడని తెలిసింది. పైగా కొత్తగా వ్యాపారం పెడుతున్నాడు అని తెలియగానే మా పెళ్లికి ససేమిరా అన్నారు. స్థిర ఆదాయం వచ్చే జాబ్‌ ఉంటే పెళ్లి అన్నారు. నాకు మాత్రం నితిన్‌పై పూర్తి నమ్మకముంది. మొత్తంమ్మీద నితిన్‌, తన సోదరుడు నిఖిల్‌తో కలిసి జీరోధాని ప్రారంభించాం’ అంటారు సీమా పాటిల్‌.

తొలిరోజుల్లో హెచ్‌ఆర్‌, క్వాలిటీ వ్యవహారాలు చూసే సీమా... పనివిధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగులపై ఒత్తిడిని వీలైనంతగా తగ్గించాలనేది ఆమె ఆలోచన. ‘లంచ్‌ విత్‌ సీఈవో’ వంటి వినూత్నమైన కార్యక్రమాలని చేపట్టారామె. ‘అందులో భాగంగా కొత్త ఉద్యోగులు... సీఈవోతో కలిసి భోజనం చేస్తూ సంస్థ లక్ష్యాల గురించి తెలుసుకోవచ్చు. తాము సంస్థ నుంచి ఏం కోరుకుంటున్నామో నిస్సంకోచంగా సీఈఓకు చెప్పొచ్చు. మహిళలకు మాతృత్వ సెలవుల తర్వాత పాపాయిని వదిలి రావడం కష్టమనిపిస్తే ‘ఇంటి నుంచే పని’ వెసులుబాటు కల్పించాం. మరికొంతమంది తల్లులు పసిపిల్లలతో ఉద్యోగానికి రాలేక చిన్నబ్రేక్‌ ఇచ్చి మళ్లీ రావాలనుకుంటారు. అటువంటి వారికీ స్వాగతం పలికాం. రెండు, మూడేళ్ల విరామం తర్వాత కూడా వాళ్ల ఉద్యోగాన్ని వాళ్లకు భద్రంగా అప్పగించాం’ అంటారు సీమా. ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యతనిచ్చే సీమా... ఫిట్‌గా ఉండేవారికి బోనస్‌లు ప్రకటించడం విశేషం. జీరోధా ప్రారంభించిన తొలిఏడాదే ‘ఫైట్‌క్లబ్‌’ పేరుతో ఉద్యోగుల కోసం ఫిట్‌నెస్‌ స్టుడియోలను ఏర్పాటు చేశారామె. ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం ఫ్లెట్చ్‌ అనే నిధిని సైతం ఏర్పాటు చేశారు. ఇవన్నీ సంస్థను ముందుకు నడిపించాయి. సామాజిక బాధ్యతలకి సైతం పెద్దపీట వేసే సీమా ‘బ్లాండ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌’ పేరుతో తరచూ డ్రైవ్‌లని నిర్వహించేది. క్యాన్సర్‌కి కీమోథెరపీ తీసుకుంటూ శిరోజాలని కోల్పోయిన వారికి... జుట్టుని డొనేట్‌ చేయడం ఈ డ్రైవ్‌ లక్ష్యం. అంతేకాదు... పర్యావరణ హితం కోణంలో వచ్చే స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ‘రెయిన్‌మేటర్‌’ సంస్థ వేదికగా పెట్టుబడులనీ అందిస్తోంది. అలా 20 సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది.  
ఆర్థిక రంగంలో ఆడవాళ్లు..
సన్‌టీవీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న కావేరీ కళానిధి అత్యధికంగా రూ. 88కోట్ల రూపాయల జీతాన్ని తీసుకునేవారు. ఇప్పుడామెని అధిగమించి సీమా ఏడాదికి 100 కోట్ల రూపాయల జీతాన్ని అందుకుంటోంది. ‘ఇలాంటి ఆర్థిక సంస్థల్లో అమ్మాయిలు రాణించడం ఆశ్చర్యంగానే ఉండొచ్చు కానీ... ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఫండ్‌ మేనేజర్లు, ఫైనాన్షియల్‌ అనలిస్టులుగా ఎంతో మంది మహిళలు మగవాళ్లకంటే మెరుగ్గా రాణిస్తున్నారు. కారణం మహిళలకు అనలిటికల్‌ స్కిల్స్‌ ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు సహజంగానే మల్టీటాస్కింగ్‌ అలవాటు వల్ల తేలిగ్గానే ముందడుగు వేస్తున్నారు. మగవాళ్లు మాత్రమే చేయగలరనుకున్న అనేక రంగాల్లో ఇప్పుడు ఆడవాళ్లు తేలిగ్గా రాణించి చూపిస్తున్నారు’ అంటోంది సీమ.రోజూ ప్రపంచాన్ని కొత్తగా చూడండి. ఇది సమస్యలను, సవాళ్లను పరిష్కరించుకుని ప్రపంచాన్ని జయించటానికి, లోకాన్ని  సృజనాత్మకంగా చూడటానికి మిమ్మల్ని పురిగొల్పుతుంది.  
- బిదిషా నాగరాజ్‌, గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌


Advertisement

మరిన్ని