Covid: ధైర్యం నింపే ‘కొవిడ్‌మీల్స్‌’

కరోనా రోగులు, వారికి సేవలందిస్తోన్న వైద్యులు తదితరులు వేళకు తిండి దొరక్క బాధ పడకూడదని తపిస్తోన్న కరుణామయి ఆమె...

Updated : 10 Jun 2021 07:31 IST

కరోనా రోగులు, వారికి సేవలందిస్తోన్న వైద్యులు తదితరులు వేళకు తిండి దొరక్క బాధ పడకూడదని తపిస్తోన్న కరుణామయి ఆమె...
బెంగళూరు యువతి స్నేహ వచ్చనే ‘మేక్‌ మై ట్రిప్‌’ ట్రావెల్‌ కంపెనీలో పెద్ద హోదాలో ఉంది. కరోనా వల్ల ఇప్పుడది ఆగింది. ఈ ఆపత్కాలంలో సమయాన్ని ఏదైనా మంచి పనికి వినియోగించాలనుకుంది. ఒక ఫ్రెండ్‌తో కలిసి ‘కొవిడ్‌ మీల్స్‌.ఇన్‌’ వెబ్‌సైట్‌ ఆరంభించింది. వండేందుకు, సప్లయ్‌ చేసేందుకు వాలంటీర్లు కావాలని ప్రకటించింది. దరఖాస్తులను బట్టి కొందరిని ఎంపిక చేసుకుంది. ఆహారం శుచిగా, రుచిగా, పోషకాలతో, రోగనిరోధకశక్తిని పెంచేలా ఉండాలని నిబంధన పెట్టుకుంది. ‘బెల్లందూర్‌ పరిసరాల్లోని కొవిడ్‌ పేషెంట్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం ఇంటి భోజనం సిద్ధం చేస్తా’నంటూ ఇన్‌స్ట్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. చాలామంది ఆమెని సంప్రదించారు. అభ్యర్థనల వెల్లువ మొదలైంది. కొన్ని రోజుల్లోనే అభ్యర్థనల సంఖ్య ఊహాతీతంగా పెరిగింది. ఆమె స్నేహితులూ డబ్బు, సరకులు పంపసాగారు. ఇంతలో స్నేహ వాళ్ల కాలనీని ‘కంటెయిన్‌మెంట్‌ జోన్‌’గా ప్రకటించారు. ఆ అపార్ట్‌మెంట్‌కు రాకపోకలు ఆపేశారు. బాధగా ఉన్నా చేసేదేమీ లేక ఓ వారం వంటలు ఆపేసింది. ఈలోపు ‘ఇడ్లీస్‌ అన్‌లిమిటెడ్‌’ అనే హోటల్‌ నడిపే వ్యక్తికి కొవిడ్‌ మీల్స్‌ గురించి తెలిసింది. ఆమె ఎదురింట్లోనే ఉండే అతను, అతని భార్య స్నేహతో చేతులు కలిపారు. వారి హోటల్‌లో చేయించి ఇప్పుడు మళ్లీ రోజుకు 150 మందికి టిఫిన్లు, భోజనాలు పంపగలుగుతున్నారు.
స్నేహ స్ఫూర్తితో ఎందరో ఈ వెబ్‌సైట్‌తో అనుసంధానమయ్యారు. ‘కొవిడ్‌ మీల్స్‌’ చెన్నై, మైసూరు, దిల్లీ నగరాలకూ విస్తరించింది. సైట్‌లో నగరం, ఏరియా, లొకాలిటీ.. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ కాలమ్‌లు నింపితే చాలు ఆయా నగరాల్లోని వాలంటీర్లు భోజనాదులు అందిస్తారు. ‘15 దేశాల నుంచి ఎందరో ప్రవాస భారతీయులు వారి బంధువులకు సాయం చేయమని మెసేజ్‌లు పెడుతున్నారు. భోజనాలు పంపడం ప్రారంభించాక వారెంత సంతోషిస్తున్నారో చెప్పలేను. వారి మెసేజ్‌లు చూస్తే గుండె బరువెక్కిపోతుంది. అవన్నీ చూస్తోంటే ఇంకా సేవచేయాలనే ఉత్తేజం కలుగుతోంది. చీకటి కమ్ముకుంటోన్న ఇలాంటి సమయంలో ఆశాభావం నింపాలి. సానుకూల వాతావరణం కల్పించాలి. లేదంటే విషాదంలో కూరుకుపోతారు’ అంటుంది స్నేహ. ఈ మాటలు మరెందరినో ప్రభావితం చేసేలా ఉన్నాయి కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్