అప్పుడు ఆకలి తీర్చి.. ఇప్పుడు ఊపిరి అందించి...

తోచిన సాయం చేయడం వేరు, ఆపదలో ఉన్నవారిని గుర్తించి ఆపన్నహస్తం అందించడం వేరు. రెండో కోవకు చెందుతారు శాంతా తౌటం. తెలంగాణ జౌళి శాఖలో ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తూనే వందలాది మంది కొవిడ్‌ బాధితులకు ప్రాణవాయువును అందిస్తున్నారు. కల్లోల సమయంలో ఎన్నో జీవితాలకు చేయూతనిస్తున్న ఆమెను ‘వసుంధర’ పలకరించింది.

Updated : 19 Oct 2022 16:00 IST

మేమున్నాం

తోచిన సాయం చేయడం వేరు, ఆపదలో ఉన్నవారిని గుర్తించి ఆపన్నహస్తం అందించడం వేరు. రెండో కోవకు చెందుతారు శాంతా తౌటం. తెలంగాణ జౌళి శాఖలో ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తూనే వందలాది మంది కొవిడ్‌ బాధితులకు ప్రాణవాయువును అందిస్తున్నారు. కల్లోల సమయంలో ఎన్నో జీవితాలకు చేయూతనిస్తున్న ఆమెను ‘వసుంధర’ పలకరించింది.

శాంత స్వస్థలం వరంగల్‌. కిట్్స కళాశాలలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి గోల్డ్‌మెడల్‌ సాధించారు. 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లి ‘న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ’లో ఎం.ఎస్‌. చేశారు. శాంతకు స్ఫూర్తి వాళ్ల నాన్న రాజమౌళి తౌటం. వ్యాపారం చేస్తూ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేసేవారు. నలుగురిలో మూడో సంతానమైన శాంత నాన్న నుంచే తనకు తోటి వారికి సాయం చేయాలన్న మనసు వచ్చిందని చెబుతారు. 2010లో తాను ఎం.ఎస్‌. చేసిన విశ్వవిద్యాలయం నుంచే పీహెచ్‌డీలో చేరారు. ఆ సమయంలో క్యాన్సర్‌ బాధితుల కోసం విరాళాల సేకరణ మొదలుపెట్టారు. తాను కొంత డబ్బు ఇచ్చి మిత్రుల సహకారంతో నిధులు సమీకరించి క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలిచేవారు. మీల్స్‌ ఆన్‌ వీల్స్‌ అనే కార్యక్రమం ద్వారా చర్చ్‌ల వద్ద భోజనం ప్యాకెట్లను తీసుకెళ్లి సీనియర్‌ సిటిజన్లకు అందిస్తూ వలంటీర్‌గా పని చేసేవారు. ఎంతో మంది పేదవిద్యార్థులకు అసిస్టెంట్షిప్‌ అందజేస్తూ ఆర్థిక చేయూతనిస్తూ తోడ్పాటునందించారు. పీహెచ్‌డీ పూర్తి చేసి అక్కడే ఓ కంపెనీలో ఆంత్రప్రెన్యూర్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఓ రోజు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ టీహబ్‌ గురించి ప్రసంగిస్తుంటే ఆసక్తి కలిగిందట. అక్కడ పనిచేయాలనే ఆసక్తితో దరఖాస్తు చేసుకోగా ఉన్నతాధికారులు తనతో అరగంట పాటు స్కైప్‌లో ఇంటర్వ్యూ చేశారు. తనను టీహబ్‌లో ‘డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ క్లబ్‌’ పోస్టుకి ఎంపిక చేశారు. మూడున్నరేళ్లు టీహబ్‌ వ్యవహారాలు చూశాక గతేడాది జౌళిశాఖ ఓఎస్డీగా పదోన్నతి పొందారు.
వలసతో మొదలై
విధుల్లో తీరికలేకుండా ఉన్నా శాంత తన ప్రవృత్తి అయిన సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఓ సారి ఏప్రిల్‌లో వరంగల్‌కు వచ్చినప్పుడు ఆక్సిజన్‌ కొరతతో ఆసుపత్రులు, పేదలు అల్లాడిపోవడం చూశారు శాంత. వెంటనే కొన్ని ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను కొని అత్యవసరం ఉన్న వారికి అందజేశారు. తర్వాత ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల అవసరం ఉందని ట్విటర్లో పెట్టి తనకు తెలిసిన అనేక పెద్ద కంపెనీలను సంప్రదించారు. శాంత సేవాభావం గురించి తెలిసిన వారు ముందుకొచ్చారు. నాస్కమ్‌ ఫౌండేషన్‌ వారు 180 ఆక్సిజన్‌ మినీ సిలిండర్లను విరాళంగా అందజేయడంతో వాటిని వరంగల్‌ మహానగరపాలక సంస్థ కమిషనర్‌కు అప్పగించారు. వాటిని నగరంలో ప్రాణవాయువు అవసరమున్న వారికి అందజేసేలా చొరవ చూపారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి 20, యాదాద్రి జిల్లా ఆసుపత్రికి మరో 20, రాచకొండ పోలీసు కమిషనర్‌కు పది వరకు, హన్మకొండలోని మరో స్వచ్ఛంద సంస్థ వారికి 20 కాన్సన్‌ట్రేటర్లు అందజేశారు శాంత. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వేలాది వలస కుటుంబాల ఆకలి తీర్చారు. ముంబయికి వలస పోయిన 150 తెలుగు కుటుంబాలు గతేడాది లాక్‌డౌన్‌లో తిండిలేక అల్లాడిపోతుండగా ఎవరో ప్రభుత్వానికి ట్వీట్ చేశారు. వెంటనే శాంత స్నేహితుడు అజయ్‌ వేములపాటితో పాటు మరికొందరి సహకారంతో ముంబయిలోని ఓ అధికారితో మాట్లాడారు. ఆమె ఖాతాకు డబ్బులు పంపి తన ద్వారా నిత్యావసరాలు అందజేశారు. అలా ఏకంగా 4వేల కుటుంబాల పొట్ట నింపారు. పోచంపల్లితోపాటు వందలాది వరంగల్‌ నేతన్నలకు ఐటీసీ గూంజ్‌ ఫౌండేషన్‌ సహకారంతో సరకులు అందజేశారు. గతేడాది అమెరికా స్నేహితుల సహకారంతో రూ. 20 లక్షల నిధులు సమీకరించి వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు అందజేయగా వాటితో పారిశుద్ధ్య కార్మికులకు చేతి గ్లౌజులు మాస్కులు అందించగలిగారు. ఎవరికి ఏ సాయం కావాలన్నా మిత్రులు, వివిధ స్వచ్ఛంద సంస్థలతో అనుసంధానకర్తగా ఉండి అవసరాలు తీరుస్తున్నారు. కేయూలో పీజీ చేస్తున్న ఓ పేద విద్యార్థినికి శాంత ఈ మధ్యే కొలాజియం ఫౌండేషన్‌ ద్వారా లాప్‌ట్యాప్‌ అందజేశారు. సాయం చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుందని వారి పేరు, అందజేసిన మొత్తం వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటారు. ఆపదలో ఉండి ఎవరు సాయమడిగినా ఏదో విధంగా చేయకపోతే మనసొప్పదంటారు శాంత.

- గుండు పాండురంగశర్మ, వరంగల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్