Updated : 20/06/2021 22:36 IST

కత్రినా అందానికి మెరుగులు దిద్దాం!

మనసులో బలమైన కోరిక... డాక్టర్‌ అవ్వాలని! పుట్టింట్లో వీలుకాలేదు... పెళ్లయ్యాక పట్టుదలగా  చదివారు. విదేశాల్లో ప్రముఖ యూనివర్శిటీల్లో పై చదువులు చదివి ‘ఈస్తటిక్స్‌’లో సెలబ్రిటీ డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు... సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. టీటీడీ పాలకమండలి సభ్యురాలు కూడా అయిన డాక్టర్‌ నిశ్చిత ముప్పవరపు వసుంధరతో ముచ్చటించారు..

అమ్మమ్మ వాళ్లది గుంటూరు దగ్గర కాకుమాను. వాళ్లింట్లోనే పెరిగాను. తాతగారు డాక్టర్‌ కోదండరామయ్య ఆక్స్‌ఫర్డ్‌లో చదివారు. గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌గా చేశారు. నాన్న వాళ్ల నాన్న గోపాలకృష్ణ చౌదరి ఐదుసార్లు విజయాడైరీకి ఛైర్మన్‌గా పనిచేశారు. రెండు కుటుంబాల్లోనూ ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. చిన్నప్పుడు బాగా చదువుతానని టీచర్లు ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ రాయించారు. స్టేట్‌ మూడోర్యాంకు. ఈనాడు పత్రికలో నా పేరు చూసుకుని.. అంతా పొగుడుతుంటే మురిసిపోయా. కావూరు రెసిడెన్షియల్‌ స్కూల్లో చేరా. ఐదు నుంచి ఎనిమిది వరకూ అక్కడే చదువుకున్నా. అక్కడ వసతులుండేవి కాదు. అయినా ఆ స్కూలంటే నాకిష్టం. ఎందుకంటే ఆ స్కూల్‌ నుంచి ఎంతోమంది అమ్మాయిలు ఉన్నత స్థానానికి వెళ్లడం చూశాను. టీచర్ల ప్రోత్సాహంతో సంస్కృతంలో విశారద చేశాను. ఇంట్లో ఇచ్చిన డబ్బులతో విశాలాంధ్ర సంచార గ్రంథాలయంలో పుస్తకాలు కొని చదువుకొనేదాన్ని. కానీ నాన్నకి నేనక్కడ చదవడం ఇష్టం లేదు. దాంతో ఇంటికి తీసుకెళ్లిపోయారు. పదోతరగతి ప్రైవేటుగా కట్టించారు. నెల్లూరులో నాయనమ్మ ఇంట్లో ఉంటూ డిగ్రీ చేశా. తర్వాత ఎంబీయే. డాక్టర్‌ చదవాలని ఉన్నా ఇంట్లో వాళ్లకి ఇష్టం లేక నా ఆశ అలానే ఉండిపోయింది.

జెనెటిక్స్‌లో పరిశోధనలు...
21 ఏళ్లకే పెళ్లి. వాళ్లది తమిళనాడులో స్థిరపడ్డ కుటుంబం. దైవభక్తి ఎక్కువ. మా పెళ్లిచూపులు, పెళ్లి అన్నీ తిరుపతిలోనే. వాళ్లింట్లో మొత్తం 21 మంది డాక్టర్లు. మావారు బాలాజీ రావెళ్ల సర్జన్‌. అత్తగారు గైనకాలజిస్టు. మాటల మధ్యలో నాక్కూడా డాక్టర్‌ కావాలని ఉందని చెప్పాను. వాళ్లు సంతోషంగా అంగీకరించారు. అలా మీనాక్షి మెడికల్‌ కాలేజీలో ఎంబీబీయెస్‌ చదివా. చదువుతున్నప్పుడే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ఆ చదువు అయిపోగానే పిల్లలని అమ్మకి అప్పగించి విదేశాలకు వెళ్లాను. లండన్‌ కింగ్స్‌ కాలేజీలో.. అమెరికాలోని థామస్‌జెఫర్సన్‌ కాలేజీలో డెర్మటాలజీలో పైచదువులు చదువుకున్నా. హార్వర్డ్‌లో కాస్మెటాలజీకి సంబంధించిన న్యూట్రిషన్‌ కోర్సు చేశాను. హాలివుడ్‌ నటి యాంజెలినాజోలి వంటివారికి కాస్మెటాలజిస్టుగా సేవలందించిన డాక్టర్‌ ఒబాగీ దగ్గర శిక్షణ తీసుకున్నాను. స్థానిక పరిస్థితులపై అవగాహన కోసం చెన్నైలో కొన్నాళ్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేశాను. మా కుటుంబానికి ఆసుపత్రి ఉన్నా.. నాకంటూ ప్రత్యేక ముద్ర ఉండాలని ఈస్తటిక్స్‌ కోసం ప్రత్యేకంగా క్లినిక్‌ని ప్రారంభించాను. ప్రస్తుతం జెనెటిక్స్‌ ప్రధానాంశంగా లండన్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేస్తున్నా. జన్యువులు వయసు నియంత్రణలో ఎలా ఉపకరిస్తాయనే దిశగా అధ్యయనాలు చేశాను. కొవిడ్‌ లేకపోతే ఈపాటికి థీసిస్‌ సమర్పించి ఉండేదాన్ని.

సెలబ్రిటీ డాక్టర్‌గా...
వయసు ఛాయలు ముఖంలో కనిపించకుండా ఉండేందుకు అనేక ఆధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బొటాక్స్‌, ఫిల్లర్స్‌, త్రెడ్స్‌, ప్లేట్‌లెట్‌ రిచ్‌ ఫ్లాస్మా థెరపీ వంటివి ఆధునికమైనవి, ప్రత్యేకమైనవి. సినీతారలు మొదల... రాజకీయ ప్రముఖుల వరకు ఎంతోమంది సెలబ్రిటీలకు మా క్లినిక్‌ సేవలు అందాయి. కత్రీనాకైఫ్‌, రజనీకాంత్‌, విజయ్‌ఆంటోని మొదలుకుని ముఖ్యమంత్రుల వరకూ మా సేవలు అందుకున్న వారే. అయితే ఈ ఫిల్లర్స్‌ ప్రక్రియ అంత తేలికైన వ్యవహారం కాదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖంలో ఒక చిన్న కండరం కూడా ఆకృతిని నిర్ణయించేదే. సింగపూర్‌లో ఇందుకు సంబంధించి ఏటా శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణకు చాలా తక్కువమందిని ఎంపికచేస్తారు. గత ఏడాది ముగ్గురు ఎంపికైతే అందులో నేనొకదాన్ని. ఇవికాకుండా మెటాడీటాక్స్‌ సేవలని ప్రత్యేకంగా అందిస్తాను. అంటే మందులు, పోషకాహారం కలిసిన కాక్‌టెయిల్‌ డ్రగ్‌ విధానం అన్నమాట.

ఉచిత క్యాంపులు చేసేవాళ్లం...
పిల్లలు, వృత్తి... సజావుగా సాగిపోతున్నా పేదలకు ఏదో చేయాలన్న తపన ఉండేది. మావారితో చర్చించా. ఇద్దరం చెన్నైలో ఉచిత మెడికల్‌ క్యాంపులు ప్రారంభించాం. పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల్లో తీవ్ర పోషకాహార లోపాన్ని గమనించాను. తక్కువ ఖర్చులో దొరికే పోషకాహారం గురించి అవగాహన కల్పిస్తూ, మందులవీ అందించే వాళ్లం. పేదపిల్లల కోసం క్యాంపులు నిర్వహించే వాళ్లం. పశ్చిమ్‌బంగాల్‌లోని సిలిగుడి సహా అనేక ప్రాంతాలకు వెళ్లి క్యాంపులు నిర్వహించాం. 2015 నుంచి వారాంతాల్లో ఉచిత క్యాంపులు నిర్వహిస్తున్నాం. బీచ్‌ డ్రైవ్‌లు నిర్వహించాం. బీచ్‌కు వెళ్లి ప్రాణాలు తీసుకోకుండా అడ్డుకోవడం ఈ డ్రైవ్‌ లక్ష్యం. ఈ సేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం రెండుసార్లు బెస్ట్‌ డాక్టర్‌గా అవార్డునిచ్చింది.

శ్రీవారి సేవలో...
మా ఇంట్లో అందరూ బాలాజీ భక్తులు. చిన్నతనంలో నాలుగింటికే నిద్రలేచేదాన్ని. పూజగది శుభ్రం చేసి... పూజకు కావాల్సిన పూలు తీసుకురావడం నా వంతు. అలా నాలోనూ ఆధ్యాత్మిక చింతన అధికమే. మా తాతగారు ఒకాయన.. టీటీడీలో సభ్యులుగా ఉండేవారు. చిన్నప్పుడు ఆయన మా ఇంటికొచ్చినప్పుడల్లా ఆయన చూసి అంతా ‘ఎంత అదృష్టమో... స్వామివారికి సేవ చేసుకునే అవకాశం వచ్చిందని అనేవారు’. మా మాటలు నా మనసులో నాటుకుపోయాయి. నాకూ అలాంటి అవకాశం వస్తే బాగుండును అనిపించేది. చిన్నప్పటి నుంచి శ్రీవారి సేవలో ఉండాలని కోరిక. టీటీడీ సభ్యురాలిగా ఆ కోరిక తీరింది. బోర్డులో మొత్తం ముగ్గురు మహిళలు ఉంటే వారిలో నేనొకదాన్ని కావడం నా అదృష్టం. మరో సభ్యురాలు సుధామూర్తి గారిని చూసి స్ఫూర్తి పొందుతూ ఉంటా. మా పెద్ద పాప నేత్రబాలాజీ షూటింగ్‌లో రాణిస్తోంది. జాతీయ పోటీలకు ఎంపికైంది. చిన్నది ఆద్య. చదువుల్లో చురుకు.

అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి, మన ఆశల్ని నెరవేర్చుకోవడం కోసం నిరంతరం కష్టపడాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే ప్రతి మహిళా అద్భుతాలు చేయగలదని నా నమ్మకం.


అందం, ఆరోగ్యం కాపాడుకోవడానికి నేను చెప్పే చిట్కా ఖరీదు చాలా తక్కువ. నిజానికి... మనం ఏం తింటామో అదే మన అందాన్ని, ఆరోగ్యాన్నీ నిర్ణయిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం శరీరానికి ఆక్సిజన్‌ అందించి... వయసు ఛాయలని అడ్డుకుంటుంది. చాలామంది ఖరీదైన దిగుమతి చేసుకున్న బ్లూబెర్రీలు అందాన్నిస్తాయని అనుకుంటారు. కానీ... ఉసిరికి మించిన యాంటీ ఆక్సిడెంట్‌ ఉండదు. ఆకుకూరలు, మునగాకు ఇతర తాజా ఆహారం అందాన్ని పెంచుతాయి.


మంచిమాట

స్త్రీగా నేనేదైనా చెప్పేముందు నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ‘ఒకవేళ...’ అంటూ నేనే సందేహంగా చెబితే ఎవరికీ నమ్మకం కలగదు. కనుక మన మాటలు కచ్చితంగా నిర్దుష్టంగా ఉండాలి. - అమీ స్కూమర్, స్టాండప్‌ మేడియన్‌


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని