నేను చేస్తోంది అల్లా పనే
close
Updated : 10/07/2021 06:31 IST

నేను చేస్తోంది అల్లా పనే

సేవ చేయాలనే కోరిక ఆమెతోపాటు పెరుగుతూ వచ్చింది. చదువుకుంటూనే హెచ్‌ఐవీ బాధితులకు చేయూతనందించింది. సేవే జీవితంగా మారి సాగుతున్న వేళ కరోనా విరుచుకుపడింది. ఆమెలోని అమ్మ ఆగలేకపోయింది. బాధితుల సాయానికి నడుం బిగించింది. ఆమె చిత్తశుద్ధి చూసి మరికొందరు తోడయ్యారు. వదాన్యులూ ఆ అమ్మకు అండగా నిలుస్తున్నారు. వారందరి తోడ్పాటుతో వేల మంది ఆకలి తీర్చింది. వందల మందికి సాంత్వన చేకూరుస్తోంది.... ఆమే రాజమహేంద్రవరానికి చెందిన అక్సా పాషా! తనతో వసుంధర సంభాషించింది...
‘స్కూల్లో టీచర్‌ పెద్దయ్యాక ఏం చేస్తావ్‌ అంటే.. తడుముకోకుండా సేవ చేస్తానని చెప్పా. అప్పుడు సేవ అంటే ఏంటో తెలియదు. ఇంటికి వెళ్లి ఏంటని అమ్మానాన్నలను అడిగా. పదిమంది ఆనందం కోసం నువ్వు ఏ కష్టానికైనా సిద్ధపడటమే సేవ అన్నారు. అప్పుడే నిర్ణయించుకొన్నా.. నా జీవితం సమాజం కోసమే’ అని గుర్తుచేసుకుంది అక్సా. వాళ్లది పిఠాపురం. దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న నాటకాల్లో మేకప్‌ మ్యాన్‌, అమ్మ గృహిణి. అక్సా డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా ఊళ్లో ‘స్వరాజ్య అభ్యుదయ సేవా సమితి’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ బాధితులకు చేయూతనిస్తుంది. ఎయిడ్స్‌ రోగులకు సేవ చేయాలనే తలంపుతో 2004లో ఆ సంస్థలో వలంటీర్‌గా చేరింది అక్సా. చదువుకుంటూనే సెలవులు, ఖాళీ సమయాల్లో హెచ్‌ఐవీ బాధితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేది. రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడం, ఆర్థిక సాయం అందించడం వంటివి చేసేది. అదే సంస్థలో పని చేసే అమీర్‌పాషాతో మనసు కలిసింది. పెద్దల అంగీకారంతో ఇద్దరి జీవితాలూ ఒకటయ్యాయి.  ఇద్దరూ రాజమహేంద్రవరానికి చేరారు. అమీర్‌ పండ్ల వ్యాపారం చేస్తారు. తీరికవేళ్లలో ‘పారా’ స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కుమార్తె దివ్యాంగురాలు. హెచ్‌.ఐ.వి.పై ప్రచారం చేయడం, బాధితులకు అవగాహన కల్పించడం అక్సా కార్యక్రమాలు. మొదట్లో వారంతా ఇంటి దగ్గరకు వస్తుంటే ఇరుగూ పొరుగూ అభ్యంతరపెట్టేవారు. అయితే అక్సా వారికీ నచ్చచెప్పి తన దారికి తెచ్చుకుంది.

కరోనా కాలంలో.... గతేడాది లాక్‌డౌన్‌ నుంచి అక్సా సేవలు విస్తృతమయ్యాయి. ఉపాధి కోల్పోయిన వారు, సొంత వారు కాదంటే రోడ్డున పడ్డవారు, కొవిడ్‌ వచ్చిందని.. వెలివేసిన బంధువులు, అంతిమ సంస్కారం చేసేవారు లేని కొవిడ్‌ మృతదేహాలు.. ఇలా ఎందరివో వెతలు ఆమెను కదిలించాయి. వీటికేదైనా పరిష్కార మార్గం కావాలనుకుంది. ఆమె ఆలోచనలకు భర్త అమీర్‌పాషా సహకారం తోడయ్యింది. ఇద్దరూ కలిసి కరోనా మొదటి దశలో.. హోం ఐసోలేషన్‌లో ఉంటూ భోజనం కోసం ఇబ్బంది పడుతున్న వారు, వలస కూలీలు, యాచకులు, షెల్టర్‌ హోమ్స్‌లోని వారికి ఇంట్లోనే వండుకుని తీసుకువెళ్లి ఆహారాన్ని అందించారు. రెడ్‌జోన్‌లో ఉన్నవారికి కావాల్సిన మందులు, సరకులు అందజేశారు. అలా సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మందికి భోజనం అందించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రాజమహేంద్రవరం చుట్టుపక్కల గ్రామాల్లో పేదలకు నెలకు సరిపడా బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు తదితర నిత్యావసరాలను పంచారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియజేయమంటూ ఫోన్‌ నంబరును ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ద్వారా పది మందికీ తెలియజేశారు. ఒంటరి వృద్ధులకు మందులు అందించడం, వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం చేసేవారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో కూడా అక్సా సేవలు కొనసాగుతున్నాయి. ఆరు ఆక్సిజన్‌ సిలెండర్లు కొనుగోలు చేసి.. ప్రభుత్వాసుపత్రిలో  బెడ్లు దొరక్క విషమ పరిస్థితిలో ఉన్న రోగులకు అందజేశారు. అక్సా సేవా కార్యక్రమాలను చూసి స్నేహితులు, బంధువులు, తెలిసిన వారు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. తన స్ఫూర్తితో కొందరు స్వచ్ఛంద సేవకులుగానూ మారారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలూ వీరికి అండగా నిలుస్తున్నాయి. దృష్టికి వచ్చిన సమస్యలను నమోదు చేసుకోవడం, పరిష్కారమయ్యేలా వలంటీర్లను పురమాయించడం ఆమె పనిగా మారింది. ఆమె బృందంలో ప్రస్తుతం 20 మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు.
అంతిమయాత్రలో తోడుగా..  అక్సాతోపాటు ఆమె భర్త ఆమిర్‌ కూడా అదే స్థాయిలో సేవల్లో పాల్గొంటున్నారు. కరోనాతో మరణించిన వందల మందికి ఆయన తన బృందంతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. ‘ఇట్లా వెనకాముందూ చూసుకోకుండా చేస్తున్నారు, నీకు, నీ భర్తకు ఏమైనా అయితే కుటుంబం పరిస్థితి ఏంటి’? అని బంధువులు ప్రశ్నిస్తుంటారు... ‘నేను చేస్తోంది అల్లా పని.. ఆయనే మా  యోగక్షేమాలు చూసుకుంటాడు..’ అని చిరునవ్వుతో సమాధానమిస్తుంది అక్సా.

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌, రాజమహేంద్రవరం     


                                                                                                                    
స్వేచ్ఛ ఒకరిచ్చేది కాదు, మనమే సాధించుకోవాలి. ఏ విషయంలోనయినా పరాధీనత లేకుండా స్వీయ నిర్ణయాలు తీసుకోవాలి.
- టోనీ మొరిసన్‌, రచయిత్రి, సంపాదకురాలు


Advertisement

మరిన్ని