Updated : 14/07/2021 17:11 IST

ఆకుపచ్చని విజయం!

ఇదో ఆధునిక కాలపు యజ్ఞం... ఈ మహా యజ్ఞాన్ని నిర్వహించింది మహబూబ్‌నగర్‌ జిల్లా మహిళలు... ఓ గొప్ప సంకల్పం కోసం లక్షా పాతిక వేల మంది అతివలు ఒక్కటై రెండు కోట్ల విత్తన బంతులని చేసి అబ్బురపరిచారు. ఆ బంతులతో అతి పెద్ద వాక్యాన్ని రాసి గిన్నిస్‌బుక్‌ రికార్డుల్లోకి ఎక్కిన ఆకుపచ్చని విజయమిది..

డవి అమ్మలాంటిది. అది పచ్చగా ఉంటే... కాయకసరుకు లోటుండదు. పశువులు ఎండిన డొక్కలతో కాకుండా పుష్టిగా ఉంటాయి. భూగర్భజలాలు నిండుగా ఉంటాయి. పల్లెలూ పచ్చగా వెలిగిపోతాయి. అందుకే అడవుల విస్తరణ కోసం అతివలంతా ఒక్కటయ్యారు. సీడ్‌బాల్స్‌ (విత్తనబంతులని)ని తయారుచేసి వెదజల్లాలనుకున్నారు. ఈ ఆలోచన ఆచరణగా మారే క్రమంలో వచ్చిన అవాంతరాలని అధిగమించి పదిరోజులపాటు దీక్షలా, యజ్ఞంలా విత్తన బంతుల తయారీ చేపట్టి విజయం సాధించారు. ఈ ఏడాది జూన్‌ 15, 16 తేదీల్లో జిల్లా కలెక్టరు ఎస్‌.వెంకట్‌రావు నేతృత్వంలో అటవీ శాఖ రెండు కోట్ల విత్తనబంతుల తయారీ లక్ష్యంతో మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చింది. మొదట్లో ‘చేయగలమా?’ అనే సంశయం వెంటాడినా ఆ అనుమానాల్నీ, అసంతృప్తులనీ వెనక్కినెట్టి తమ రికార్డుని తామే బద్దలుకొట్టాలనుకున్నారు పాలమూరు మహిళలు. అవును... గత సంవత్సరం కూడా కోటి విత్తన బంతులని తయారు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు రెండు కోట్లు చేయడానికి సిద్ధమయ్యారు. వాళ్ల ఉత్సాహాన్ని గమనించిన జిల్లా అటవీ శాఖ అధికారులు విత్తన బంతులను శాస్త్రీయ పద్ధతిలో ఎలా తయారు చేయాలి? అలా చేసిన వాటిని గుట్టలు, ఖాళీ ప్రదేశాలు, అడవుల్లో ఎలా చల్లాలి? అనే వాటిని క్షుణ్ణంగా వివరించారు. అతితక్కువ సమయంలో అన్ని విత్తన బంతులను చేయడం సవాలే అయినా... కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ, మాస్కులు పెట్టుకుని, సామాజిక దూరం పాటిస్తూ ముందడుగువేశారు. జిల్లాలోని 11,506 స్వయం సహాయక సంఘాలకు చెందిన 1,23,576 మంది మహిళలు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు.

పచ్చదనాల జాతర...
రావి, మర్రి, వేప, చింత, సీతాఫలం, నల్ల తుమ్మ, జువ్వి, నెమలినార, కానుగ, మేడి, రేల విత్తనాలని వాడి ఈ సీడ్‌బాల్స్‌ని తయారు చేశారు. వీటి తయారీకోసం 70శాతం జల్లెడ పట్టిన ఎర్రమట్టి, 30 శాతం పశువులపేడ, గోమూత్రం వాడారు. ఇంట్లో పనులు ముగించుకుని ఉదయం 7 గంటలకే తయారీ కేంద్రాలకు రావడం... సాయంత్రం వరకు మరో ధ్యాస లేకుండా బంతుల తయారీయే లక్ష్యంగా పనిచేశారు. వీరెవరూ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా పనిచేయడం విశేషం. అలా చేసిన వాటిని మహబూబ్నగర్‌ శివారులోని కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్కులో డ్రోన్ల సాయంతో చల్లారు. తమ విజయానికి గుర్తుగా రైల్వే శాఖ సామాజిక భవనంలో
two crore seed balls made and planted by shg women transform mahabubnagar in to hetero green belt అనే వాక్యాన్ని విత్తన బంతులతో రాశారు. ఇంత పెద్ద వాక్యాన్ని గంటా 55 నిమిషాల్లో తయారు చేసి శెభాష్‌ అనిపించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా వీక్షించిన గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు ఈ మహిళల దీక్షను ప్రశంసిస్తూ రికార్డుని అందించారు.

పాత రికార్డు చిగురించింది...
గతేడాది సరిగ్గా ఇదే నెలలో 69,200 మంది జిల్లా మహిళలు కోటి విత్తన బంతులను తయారు చేశారు. వీటిని డ్రోన్ల సాయంతో రోడ్లకిరువైపులా, అడవులు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో చల్లి రికార్డుల్లోకెక్కారు. వాటిల్లో 58 శాతం మొలకెత్తినట్లు జిల్లా కలెక్టరు చేయించిన అధ్యయనంలో తేలింది. వాటికి రక్షణ కంచెలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ స్థానిక మహిళలే సంరక్షిస్తున్నారు. రెండేళ్లలో రెండు రికార్డులు సృష్టించిన పాలమూరు మహిళా సంఘాలు తక్కిన జిల్లాలకు ఆదర్శమే కదా!

- నర్సింగోజు మనోజ్‌ కుమార్‌, మహబూబ్‌నగర్‌


మనల్ని మనం ముందుగా అంగీకరిస్తే, ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించగలుగుతాం.
- సుస్మితాసేన్‌, బాలీవుడ్‌ నటి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని