Updated : 26/07/2021 09:02 IST

మా పుట్టింటి వాళ్లను తిడుతున్నాడు!

మా పెళ్లై పన్నెండేళ్లు. ఆయనది విచిత్రమైన మనస్తత్వం. నా మనసులో మాట చెప్పాలన్నా భయమే. ఎప్పుడెలా ఉంటాడో తెలీదు. ఎప్పుడూ మా పుట్టింటివాళ్లను తిడుతూనే ఉంటాడు. మాకు పదేళ్ల బాబు. నా బాధలు చిన్నపిల్లాడితో చెప్పలేనుగా. నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి, విశాఖపట్నం

న్నెండేళ్లుగా భర్తను చూస్తున్నప్పుడు అతను దేనికెలా స్పందించేదీ కొంతవరకైనా అర్థమై ఉంటుంది. మీ వాళ్లని ఎప్పుడూ తిడుతుంటాడంటే అతనిది ఓర్పుతో సహించేది గాక ప్రతి ఒక్కరినీ తప్పుపట్టే తత్వం అయ్యుంటుంది. మొదటినుంచీ ఉన్న ఆ గుణాన్ని మీరు పూర్తిగా మార్చలేరు. మీరన్నట్లు మీ వేదనను పదేళ్ల బాబుకు చెప్పడంవల్ల లాభం లేకపోగా అతడికి మానసిక వ్యథ కలిగించిన వారవుతారు. తండ్రిని అనలేక, మీకు సర్దిచెప్పలేక ఆ అబ్బాయి కుంగిపోవచ్చు. భార్యాభర్తలు తమ మధ్య జరిగే విషయాల్ని పిల్లలతో చెప్పడం అంత మంచిదికాదు. బదులుగా మీ విషయాలను గోప్యంగా ఉంచగలిగే ఆత్మీయులతో పంచుకోండి. ఫిర్యాదు చేస్తున్నట్టు, తప్పుపడుతున్నట్టు కాకుండా మీ బాధని వివరించండి. వాళ్లు కూడా పరిణతితో, బ్యాలెన్స్‌డ్‌గా ఉండటం ముఖ్యం. అప్పుడే వారిచ్చే సలహాలూ ఊరడింపు మాటలు మీకు సాంత్వన కలిగిస్తాయి. ఒత్తిడిగా అనిపించినప్పుడు బొమ్మలేయడం, కవితలు రాయడం, పాటలు పాడటం, వినడం, పుస్తకాలు చదవడం, స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చూడటం వంటివి చేయండి. నడకకి వెళ్లండి. ఇలాంటివన్నీ మనసును మళ్లిస్తాయి... ఊరటనిస్తాయి. వీలైనప్పుడు అనాథ లేదా వృద్ధాశ్రమాలకు వెళ్లండి. మీకంటే కష్టాల్లో ఉన్నవాళ్లతో గడపటం వల్ల మీ సమస్య చిన్నగా అనిపిస్తుంది. ఆయన పద్ధతులు మార్చలేమని గమనించారు కాబట్టి ఇక దాని గురించి ఆందోళన పడకండి. ఆ విషయాన్ని పక్కన పెట్టి మీకు సంతోషం కలిగే వ్యాపకాల మీద ధ్యాస పెట్టండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్