Updated : 18/08/2022 16:11 IST

‘ఆమె ఆశలకు..’ అంతర్జాతీయ పురస్కారం!

కాలేజ్‌లో రెబల్‌ స్టూడెంట్‌గా పేరు. క్రమశిక్షణ చర్యలనూ ఎదుర్కొంది. ఇది ఒకవైపు! విద్యాసంస్థే అంతర్జాతీయ పోటీలకు వెళ్లడానికి టికెట్‌ కొని మరీ విమానం ఎక్కించింది. అంతటి ప్రతిభ ఆమె సొంతం. ఇది ఆమెలో రెండో కోణం. అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌..  ‘కేన్స్‌’లో అవార్డు పొందిన పాయల్‌ కపాడియా గురించే ఇదంతా!

పాయల్‌కి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి. తనకు నచ్చిన దర్శకులెందరో పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ)లో చదువుకున్నారని తెలిసి అక్కడే చేరాలని అనుకుంది. ఆ తర్వాత చదువుల్లో పడిపోయింది. ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. ఓరోజు సినిమాకు సంబంధించి ఓ క్లాస్‌లో పాల్గొంది. దీంతో మళ్లీ మనసు మళ్లింది. ఎఫ్‌టీఐఐకి దరఖాస్తు చేస్తే తిరస్కరణకు గురైంది. అది ఆమెను తీవ్ర నిరాశకు గురిచేసింది. తర్వాత ఓ అడ్వర్టైజ్‌మెంట్‌ సంస్థలో వీడియో ఆర్టిస్ట్‌గా చేరింది. కానీ మనసు ఆగదు కదా. మళ్లీ ఎఫ్‌టీటీఐకి దరఖాస్తు చేసింది. గట్టిగా ప్రయత్నించి 2015లో దర్శకత్వ విభాగంలో సీటు సాధించింది.

నచ్చితే ఎంత కష్టానికైనా వెనుకాడని పాయల్‌ నచ్చని దాన్ని వ్యతిరేకించడంలోనూ అంతే పట్టుదలతో ఉంటుంది. కళాశాల ఛైర్మన్‌గా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఓ నటుడిని ఎంపిక చేయడం నచ్చలేదు. దీంతో తరగతులను బహిష్కరించింది. నాలుగేళ్లు దానికి వ్యతిరేకంగా పోరాడింది. అందుకు క్రమశిక్షణ చర్యలనూ ఎదుర్కొంది. స్కాలర్‌షిప్‌నూ కోల్పోయింది. పూర్తవని విద్యార్థి ప్రాజెక్టులను మూల్యాంకనం చేయడాన్నీ వ్యతిరేకించింది. ఈ విషయంలో తన మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా లక్ష్యపెట్టలేదు. తర్వాత కళాశాలే ఆమెకు దన్నుగా నిలిచింది. 2017లో ఆమె షార్ట్‌ఫిల్మ్‌ ‘ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌’ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఇది భారత్‌ నుంచి అధికారిక ఎంట్రీగా గుర్తింపు దక్కించుకుంది. ఆ సమయంలో విమాన టికెట్లు సహా ఖర్చులన్నీ విద్యాసంస్థే భరించింది.

ఈ ఏడాది ఆమె తీసిన ‘ఎ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌’ ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకుంది. ఓ కళాశాల విద్యార్థిని దూరంగా ఉన్న ప్రియుడికి లేఖలు రాయడం కథాంశం. దీనిలో ప్రేమకే పరిమితం కాలేదామె. ఒకమ్మాయి కోరుకునే స్వేచ్ఛ, చుట్టూ పరిస్థితులు, వివక్ష, హింస, భిన్నాభిప్రాయాలు... ఈ పరిస్థితుల్లో ఆమెకు కావాల్సిన ప్రేమ వంటి అంశాలన్నింటినీ స్పృశించింది. ఒకరకంగా సగటు మహిళ అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఇది  న్యాయ నిర్ణేతలను ఆకర్షించింది. ప్రపంచ వ్యాప్త ఎంట్రీల నుంచి ఐదుగురు సభ్యుల జ్యూరీ పాయల్‌ చిత్రాన్ని ఎంపిక చేసింది.

గతంలోనూ తన చిత్రాలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శితమయ్యాయి, అవార్డులనూ అందుకున్నాయి. ద లాస్ట్‌ మ్యాంగో బిఫోర్‌ మాన్‌సూన్‌కు 2015 ఒబెర్హాసెన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకుంది. 2018లో అండ్‌ వాట్‌ ఈజ్‌ ద సమ్మర్‌ సేయింగ్‌ అనే డాక్యుమెంటరీ బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ గ్లోబల్‌ ప్రీమియర్‌ స్థాయి అందుకోవడమే కాకుండా ఆమ్‌స్టర్‌డామ్‌ ఇంటర్నేషనల్‌ డాక్యుమెంటరీ ఫెస్టివల్‌లో స్పెషల్‌ జ్యూరీ అవార్డునీ, 2020 ముంబయి ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఎక్స్‌పరిమెంటల్‌ ఫిల్మ్‌ ప్రైజ్‌నీ అందుకుంది. తను తీసే వాటిల్లో కథకే ప్రాధాన్యమనే 31 ఏళ్ల పాయల్‌... ఈతరం అమ్మాయిల కలలు, ఆశయాలు, ఆకాంక్షలను తెరపై సున్నితంగా, వాస్తవికంగా చూపించడానికి ఇష్టపడతా అంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని