తన పవర్‌ బ్యాంకుకు ఆక్స్‌ఫర్డ్‌ అవార్డు!

ఆ అమ్మాయి ఉన్నత విద్య చదువుకుంది. మంచి ఉద్యోగమూ సంపాదించుకుంది. జీవితం హాయిగా సాగిపోతోంది. తను అంతటితో తృప్తి పడలేదు.

Updated : 07 Aug 2021 03:02 IST

ఆ అమ్మాయి ఉన్నత విద్య చదువుకుంది. మంచి ఉద్యోగమూ సంపాదించుకుంది. జీవితం హాయిగా సాగిపోతోంది. తను అంతటితో తృప్తి పడలేదు. తన తెలివి, సృజన వీలైనంత ఎక్కువ మందికి ఉపయోగపడాలనుకునేది. అలా తన మేథోమథనంలోంచి పుట్టిందే ఓ పవర్‌ బ్యాంకు. మార్కెట్లో చాలా ఉన్నాయి కదా అంటారా? అదే ప్రేరణ ప్రత్యేకత. తను కనిపెట్టిన పవర్‌ బ్యాంకుకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ‘వైస్‌ ఛాన్సెలర్స్‌ సోషల్‌ ఇంపాక్ట్‌ అవార్డు’ను ఇచ్చింది. అంతగా దాంట్లో ఏం ప్రత్యేకత ఉందీ అంటారా? అయితే చదవండి...

బెంగళూరు ఐఐఎంలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో పీజీ చేసింది ప్రేరణ వాదీకర్‌. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉపకార వేతనాన్ని సాధించి ఎంబీఏ చేసింది. కొవిడ్‌ నేపథ్యంలో వీధి దుకాణ దారులు, చిన్న పరిశ్రమల నిర్వాహకుల ఇబ్బందులను గమనించింది. తేలికగా ఛార్జింగ్‌ అయ్యేలా, బ్యాటరీని పోలిన పోర్టబుల్‌ ఎనర్జీ యాక్సెస్‌ సౌకర్యాన్ని వారికి అందేలా చేయాలనుకుంది. విద్యుత్తుతో పనిచేసే చిన్న చిన్న పరికరాలకు అవసరమైతే వెంటనే ఛార్జింగ్‌ అందించేలా ఏదైనా కనిపెట్టాలనే ఆలోచనతో కృషి చేసింది. ఓ సరికొత్త పవర్‌ బ్యాంకును తయారు చేసింది. దీన్ని సోలార్‌ ప్యానెల్‌ లేదా ఎలక్ట్రిక్‌ గ్రిడ్‌తో ఛార్జింగ్‌ చేయొచ్చు. దీని బరువు అరకేజీ కన్నా తక్కువే ఉండటంతో తేలికగా ఎక్కడికైనా తీసుకెళ్లొ చ్చు. కరెంటు లేనప్పుడు చిన్న ఫ్రిజ్‌ను కూడా ఈ పవర్‌ బ్యాంకుతో పనిచేయించొచ్చు. దీన్ని 6-8 గంటలసేపు ఛార్జ్‌ చేస్తే చాలు. 75 (వాట్‌ అవర్‌) డబ్ల్యూహెచ్‌కు సరిపడా పవర్‌ను అందిస్తుంది. దీంతో మూడు డివైస్‌లకు ఒకేసారి ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. లిథియం - అయాన్‌ బ్యాటరీని ఉపయోగించి దీన్ని రూపొందించింది.

వారి కోసమే...

బెంగళూరులో డిస్ట్రిబ్యూషన్‌, మార్కెటింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించింది ప్రేరణ. పలు రంగాల్లో అడుగుపెట్టిన ఈమె, దేశ విదేశాలకు వెళ్లేది. ‘‘మన దేశంతో పాటు ఇథియోపియా, నైజీరియా వంటి చోట్ల పనిచేస్తున్నప్పుడు వీధి వ్యాపారులను చూసేదాన్ని. మన దేశంలో కోట్ల మంది చిరు వ్యాపారులున్నారు. చాలామందికి విద్యుత్తు సౌకర్యం ఉండదు. దాంతో వీరికి తీవ్రంగా నష్టాలెదురవుతుంటాయి. చాలాచోట్ల ఛార్జింగ్‌ సౌకర్యమూ ఉండదు. కొన్ని చోట్ల విద్యుత్తు కోతా ఎక్కువ. అటువంటి ప్రాంతాల్లో వ్యాపారుల ఇబ్బందులను గమనించా. అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ పవర్‌బ్యాంకు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా రూపొందించా. దీన్ని చిరు వ్యాపారులకే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న చిన్న పాఠశాలలు, మొబైల్‌ ఆసుపత్రులకు కూడా వినియోగించొచ్చు. ఈ పైలట్‌ ప్రాజెక్టును మొదట బెంగళూరులో ప్రారంభించా. జీవా గ్లోబల్‌ సంస్థ పేరుతో దీన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నా. ప్రభుత్వ సహకారంతో చిరువ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తా. ఆక్స్‌ఫర్డ్‌ అవార్డు నాలో ప్రోత్సాహాన్ని నింపుతోంది’ అంటోన్న ప్రేరణ యువతకు నిజంగా ప్రేరణ కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్