ఇప్పటికీ సుమతీ శతకాన్ని వల్లె వేస్తా!

అమెరికాలో లూయివిల్‌ విశ్వవిద్యాలయానిది 220 సంవత్సరాల ఘన చరిత్ర. అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు అత్యున్నత హోదా అయిన ప్రెసిడెంట్‌గా మహిళ ఎంపిక కావడం విశేషమేగా! ఆ పదవిని విజయవంతంగా నిర్వహిస్తూ, ఆ దేశంలో అత్యున్నత స్థాయి విద్యావేత్తల్లో ఒకరుగా నిలుస్తోన్న తెలుగింటి ఆడపడుచు డాక్టర్‌ నీలి బెండపూడి వసుంధరతో ముచ్చటించారు....

Updated : 12 Aug 2021 05:54 IST

అమెరికాలో లూయివిల్‌ విశ్వవిద్యాలయానిది 220 సంవత్సరాల ఘన చరిత్ర. అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు అత్యున్నత హోదా అయిన ప్రెసిడెంట్‌గా మహిళ ఎంపిక కావడం విశేషమేగా! ఆ పదవిని విజయవంతంగా నిర్వహిస్తూ, ఆ దేశంలో అత్యున్నత స్థాయి విద్యావేత్తల్లో ఒకరుగా నిలుస్తోన్న తెలుగింటి ఆడపడుచు డాక్టర్‌ నీలి బెండపూడి వసుంధరతో ముచ్చటించారు...

మా సొంతూరు గుంటూరే అయినా బాల్యం గడిచింది వైజాగ్‌లో. అమ్మ పద్మ తిప్పావఝ్జుల.. నాన్న రమేష్‌దత్తా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు. మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం. నాకు ఐదేళ్ల వయసులో నాన్న అమెరికాలోని కేన్సస్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయడానికి వెళ్లారు. ఆయన తిరిగొచ్చి ఏయూలో ప్రొఫెసర్‌గా చేరాక... అప్పుడు అమ్మ చదివి, ప్రొఫెసర్‌ అయ్యింది. కుటుంబ బాధ్యతల మధ్య చదువుకొని ఆ స్థాయికి వెళ్లడం అంటే మాటలు కాదు కదా! అందుకే నాకు ఆమెని మించిన మెంటర్‌ ఎవరూ లేరనిపిస్తుంది. డిగ్రీ చేశాక... నాకు పెళ్లయ్యింది. తర్వాత ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంబీయే చదివి ఫస్ట్‌ ర్యాంకు సాధించా. మా వారు వెంకట్‌ బెండపూడి. ఆయనా, నేనూ అమెరికాలో కేన్సస్‌లో పీహెచ్‌డీ చేయడానికి వెళ్లాం. ఇద్దరమూ బిజినెస్‌లో పీహెచ్‌డీ చేశాం. నాకు టెక్సాస్‌ ఏఅండ్‌ఎమ్‌ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ఓహాయో వర్సిటీలో ప్రొఫెసర్‌గా చేశా. అక్కడి నుంచి మా నాన్నగారు చదివిన కేన్సస్‌ యూనివర్సిటీకే డీన్‌గా వెళ్లాను. ఆ అనుభూతి మరిచిపోలేనిది. నాన్న కూడా గర్వంగా భావించే వారు.

అనుభవ పాఠాలు...

నా బిజినెస్‌ పాఠాలు అనుభవంలోంచి వచ్చినవి అయితే విద్యార్థులకు మరింత ఉపయుక్తంగా ఉంటాయనిపించింది. అందుకే మూడేళ్లు హన్‌టింగ్టన్‌ బ్యాంకులో పనిచేశాను. మనం చదువుకొన్న విద్యాలయాలకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనేది అమెరికన్‌ సంస్కృతిలో నేర్చుకోదగ్గ విషయం. అలా కేన్సస్‌ విశ్వవిద్యాలయానికి... ఐదేళ్లు డీన్‌గా వ్యవహరించాను. పూర్వ విద్యార్థులతో కలిసి 198 మిలియన్‌ డాలర్ల విరాళాన్ని సేకరించి యూనివర్సిటీని అభివృద్ధి చేశాం. ప్రతి రెండేళ్లకూ వైజాగ్‌ వచ్చేదాన్ని. ఇప్పుడు కొవిడ్‌ వల్ల ఆ ప్రయాణాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం నేను ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న లూయివిల్‌.. కెంటకీ ప్రాంతంలో ఉంది. బాక్సర్‌ మహ్మద్‌అలీ తెలుసుగా. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతమిది. 220 సంవత్సరాల చరిత్ర ఉన్న కళాశాలకి మహిళలెవ్వరూ ప్రెసిడెంట్‌గా ఎంపిక కాలేదు. ఆ అవకాశం నాకు దక్కడం సంతోషంగా ఉంది.

సవాళ్లు...

చాలామంది అడుగుతూ ఉంటారు.. ఈ ప్రశ్న..... ఎందుకు లేవు? చాలా ఉన్నాయి. కానీ వాటిని మనసుకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కిందకి లాగాలని చూసేవాళ్లు ఉన్నట్టుగానే... ప్రోత్సహించే వాళ్లూ ఉంటారు. వాళ్ల గురించి మాత్రమే ఆలోచించాలి. నాకు తెలిసిన వాళ్లలో మా అత్తగారు సరోజని బెండపూడి, అమ్మ చాలా స్ట్రాంగ్‌ విమెన్‌.

స్ఫూర్తి...

చదువుకునే టైంలో మావారి ప్రొఫెసర్‌ ఎలిజబెత్‌ అని ఉండేవారు. 23 ఏళ్ల క్రితం  ‘నువ్వు చాలా స్ట్రాంగ్‌... ఏదైనా సాధిస్తావ్‌’ అని ఆవిడ అన్న మాటలు నాకింకా గుర్తు. అవే ఇంత దూరం నడిపించాయేమో అనిపిస్తుంది. వివక్ష విషయానికి వస్తే... చాలామంది మగవాళ్లని ప్రొఫెసర్‌ అనీ, డాక్టర్‌ అని గౌరవిస్తారు. ఆడవాళ్లని మాత్రం మిసెస్‌ జాన్‌ అనో మరో పేరో పెట్టి పిలుస్తారు. ఇలాంటి వివక్షని నవ్వుతూనే ఖండించాలనే వారు నాతో టెక్సాస్‌
యూనివర్సిటీలో పనిచేసిన ఒక మహిళా ప్రొఫెసర్‌. ఆవిడని ఇప్పటికీ నా ‘పీర్‌ మెంటర్‌’గా భావిస్తాను.

పుణ్యం కొద్దీ పురుషుడు..

అంటారు కదా... నాక్కూడా మావారి సహకారం ఎంతో ఉంది. మాకో అమ్మాయి శిరీష, కార్పొరేట్‌ లాయర్‌. అల్లుడు ఇక్కడబ్బాయే, కైల్‌లాడ్‌. మాకు నాలుగు నెలల మనవడు... ‘అర్జున్‌’. ప్రస్తుతం అమ్మ నాతో పాటే ఉంటోంది. ఆవిడ .. తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి పుస్తకాల అనువాదాలు చేస్తున్నారు. తీరిక దొరికితే సుమతి శతకాన్ని మళ్లీ మళ్లీ చదువుతూనే ఉంటాను. ఎందుకంటే ఎక్కడికెళ్లినా మన మూలాలు మరిచిపోకూడదని.

బాధ్యతలు...

శక్తిమంతమైన మహిళా నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో అమెరికాలో ‘ఇంటర్నేషనల్‌ విమెన్‌ ఫోరమ్‌’ని ప్రారంభించారు. ఇందులో సభ్యురాలిని. వివిధ దేశాల మహిళలు ఇక్కడ నాయకత్వ విషయాల్లో శిక్షణ తీసుకుంటారు. అలా 18 దేశాల నుంచి ఎంపికైన మహిళల మధ్య నేనూ శిక్షణ తీసుకోవడం మరిచిపోలేని విషయం. ఇన్ని పనులు ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు... కష్టం కదా అనుకోవచ్చు. నాది బోధనా వృత్తి. నేను పాఠాలు చెప్పే పిల్లలకు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందో తెలియజేయాలి కదా... అందుకే ఇన్ని బాధ్యతలు ఇష్టంగా తీసుకుంటాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్