కదలాలమ్మా...కదలాలి!

నిత్య ఐటీ ఉద్యోగిని...కరోనా ముందు వరకూ సన్నగానే ఉండేది... ఏడాదిగా వర్క్‌ఫ్రమ్‌ హోం. దాంతో రోజూ 10, 12 గంటలు కూర్చున్న చోటు నుంచి కదలదు. ఈ మధ్య చిన్న మాటకే చివాలున లేస్తోంది. ఎప్పుడూ అసహనం, ఒత్తిడి...

Updated : 18 Aug 2021 04:48 IST

* నిత్య ఐటీ ఉద్యోగిని...కరోనా ముందు వరకూ సన్నగానే ఉండేది... ఏడాదిగా వర్క్‌ఫ్రమ్‌ హోం. దాంతో రోజూ 10, 12 గంటలు కూర్చున్న చోటు నుంచి కదలదు. ఈ మధ్య చిన్న మాటకే చివాలున లేస్తోంది. ఎప్పుడూ అసహనం, ఒత్తిడి...
* లాలిత్య బ్యాంకులో పనిచేస్తోంది. ఉదయం బస్సులో గంట ప్రయాణం... ఆపై తొమ్మిది నుంచి సాయంత్రం ఐదువరకూ ఆఫీసు పని. తర్వాత మరో గంట జర్నీ... ఇలా చూస్తే పదిగంటలు కూర్చునే. వయసు తక్కువే అయినా మోకాళ్ల నొప్పులు, ఊబకాయం, అలసటా...
* నీరజ గృహిణి... పనంతా పొద్దున్నే పూర్తి చేసుకుని సోఫాలో చేరుతుంది. కాసేపు అమ్మతో, అక్కతో ఫోన్లు. తర్వాత.... ఐదారుగంటలు కూర్చుని సీరియళ్లు చూస్తుంది. వ్యాయామం లేక హార్మోన్లలో తేడాలు కనిపించాయి. నెలసరి క్రమం తప్పింది... పీసీఓడీ పలకరించింది. బరువూ పెరిగింది

ముగ్గురి నేపథ్యాలు, అభిరుచులు, అలవాట్లు... వేరు. ఒకటే పోలికంటే... ఎక్కువ సమయం కూర్చునే ఉంటున్నారు. వారికే కాదు... చాలా మందికి ఇంట్లో, వంటలో ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఎక్కడికి వెళ్లాలన్నా బైకు, కారు.. ఇక శారీరక శ్రమే లేదు. ఇవన్నీ అనారోగ్యాల్ని తెస్తున్నాయి. ఏ శ్రమా లేకుండా రోజులో ఎనిమిది గంటలకు పైగా కూర్చుని పని చేసే వారి జీవితకాలం తగ్గుతోందని అధ్యయనాలూ వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్త మరణాల్లో నాలుగో వంతు... ఎక్కువగా కూర్చోవడం వల్లేనట! పొగ తాగడం వల్ల చనిపోయే వారికన్నా ఇది ఎక్కువ.

కూర్చుంటే ఏమవుతుంది?

గుండె సమస్యలు, మధుమేహం, కండరాలు, వెన్ను నొప్పి, కీళ్లు బిగుసుకుపోవడం, రక్త ప్రసరణ ఇబ్బందులు, మతిమరుపు, కుంగుబాటు కమ్మేస్తాయి. అలసటా, బడలికలతో శరీరం నిస్సత్తువగా మారుతుంది. జీవక్రియల వేగం నెమ్మదించి కెలొరీల ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా కొలెస్ట్రాల్‌ పెరుగుదల నియంత్రించే లిపోప్రొటీన్‌ లిపేజ్‌ ఎంజైమ్‌ పని తీరు తగ్గిపోతుంది. అధికబరువు, మధుమేహ ముప్పు పెరుగుతాయి. మూడుగంటలకంటే ఎక్కువ కూర్చుంటే రక్తప్రసరణ వేగం తగ్గి, గుండె కొట్టుకునే వేగంలో తేడా కనిపిస్తుంది. అధిక రక్తపోటుకీ కారణం ఇదే. శరీరాకృతీ దెబ్బ తింటుంది. పొట్ట కండరాలు బలహీనంగా మారతాయి. కీళ్లనొప్పులూ, వాపులూ తప్పక పోవచ్చు. ఈ సమస్యలు మహిళల్లో ఒకింత ఎక్కువే అంటున్నాయి అధ్యయనాలు.

అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ లక్ష మందిపై చేసిన అధ్యయనంలో రోజుకు ఆరుగంటలకి పైగా కూర్చున్న మహిళల్లో 94% మంది ముందుగా మరణించారని, అది పురుషుల్లో 48%  అనీ తేలింది.

మరేం చేయాలి...

*మంచం మీదే... మెలకువ రాగానే శరీరాన్ని స్ట్రెచ్‌ చేయండి. కాళ్లూ, చేతుల్ని విదిలిస్తే... శరీరం చురుగ్గా ఉంటుంది. వెల్లకిలా పడుకునే సైక్లింగ్‌, స్క్వాట్స్‌ వంటివి చేస్తే కండరాలన్నీ శక్తిని అందిపుచ్చుకుంటాయి.
* కూర్చున్నా కదలాలి... కూర్చుని ఉండే సమయాన్ని తగ్గించుకోవాలి. అప్పుడప్పుడూ నిలబడండి. వీలైనప్పుడు నడవండి. ఉదాహరణకు... ఫోనొస్తే నడుస్తూ మాట్లాడాలి. ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే... కాళ్లు కదపాలి, మడమలు అటూఇటూ తిప్పాలి. అప్పుడు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
* ప్రతి 20 నిమిషాలకీ 2 నిమిషాలు నిలబడాలి. నాలుగడుగులు వేస్తే మరీ మంచిది.
* ల్యాప్‌టాప్‌ల మీద పని చేసేప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు సోఫాలు, మంచాలపై కాకుండా నేలపై నిటారుగా కూర్చోవాలి. రెండు గంటలు దాటితే చేతుల్ని నిటారుగా పైకెత్తడం, గుండ్రంగా, సవ్య, అపసవ్య దిశల్లో తిప్పడం వంటివి చేయడం వల్ల వెన్ను, భుజాలు, చేతి కండరాలు బలంగా మారతాయి.
* నీళ్ల సీసాలు, కర్ర, చున్నీ, తాడు... వంటి వాటితో చేసే వ్యాయామాలు ఉత్సాహాన్నిస్తాయి.
* చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాచి ఒకసారి కుడికి, మరోసారి ఎడమకు తిరగండి. ఇలా పది- ఇరవై సార్లు చేయండి. అలానే కాలి వేళ్లనూ అందుకునే ప్రయత్నం చేయండి.
* మెడను మెల్లిగా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు తిప్పాలి. సవ్య, అపసవ్య దిశల్లో పది, పదిహేను సార్లు తిప్పండి. భుజాలు, చేతుల్నీ పైకి, కిందకు గుండ్రంగా, వ్యతిరేకంగా చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్