ఆయన్ని గెలిపించేందుకే పాడా!

మురికివాడలో ఇరుకిల్లు! అంబులెన్సు నడిపే నాన్న..  ముగ్గురు పిల్లల్నీ, ఇంటినీ చక్కబెట్టే అమ్మ. అప్పటి దాకా మూడు పూటలా తిండి కోసమూ ఇబ్బందులు పడిన ఆ కుటుంబం కథ ఒక్కసారిగా మారిపోయింది. ఆ మార్పు తెచ్చింది ఆ ఇంటి పెద్ద కూతురే. తనే ముంబయికి చెందిన శైలీ కాంబ్లే. గణాంకశాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఈ 23ఏళ్ల గాయని..

Updated : 29 Aug 2021 04:35 IST

మురికివాడలో ఇరుకిల్లు! అంబులెన్సు నడిపే నాన్న..  ముగ్గురు పిల్లల్నీ, ఇంటినీ చక్కబెట్టే అమ్మ. అప్పటి దాకా మూడు పూటలా తిండి కోసమూ ఇబ్బందులు పడిన ఆ కుటుంబం కథ ఒక్కసారిగా మారిపోయింది. ఆ మార్పు తెచ్చింది ఆ ఇంటి పెద్ద కూతురే. తనే ముంబయికి చెందిన శైలీ కాంబ్లే. గణాంకశాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఈ 23ఏళ్ల గాయని.. బ్యాంకు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే  ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో మూడో స్థానంలో నిలిచి దేశం గుర్తించే గాయనిగా ఎదిగింది. ఆమె పాటల ప్రయాణాన్ని ‘వసుంధర’తో పంచుకుందిలా..

నాన్న కిషోర్‌ కాంబ్లే 30ఏళ్లుగా అంబులెన్సు నడుపుతున్నారు. అమ్మ సురేఖ ఇల్లు చూసుకుంటుంది. నేను, ఇద్దరు చెల్లెళ్లు. చిన్నతనం నుంచే నాకు సంగీతమంటే ప్రాణం. లతా మంగేష్కర్‌, ఆశాబోంస్లేలను ఆరాధిస్తూ పెరిగా. నాన్నపడే కష్టానికి తప్పకుండా చదవాలి.. ఇల్లు నిలబడాలంటే నేను తప్పకుండా ఉద్యోగం చేయాలి. అందుకే చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. అన్నింట్లో మొదటి ర్యాంకు సాధించేదాన్ని. గణాంకశాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తి చేశా. రెండేళ్లుగా బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నా. ఇటు చదువులో రాణిస్తూనే పాటతో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నా. నాలుగో తరగతి నుంచే పాటతో ప్రయాణం సాగుతోంది. సొంతంగా టీవీల్లో చూస్తూ పాటలు సాధన చేశాను. చిన్నచిన్న కార్యక్రమాలతో మొదలై మరాఠీలో నా గొంతు తెలియని వాళ్లుండరనే స్థాయికి చేరుకున్నాను. ఉద్యోగాల వేటలో పడి ఇండియన్‌ ఐడల్‌ లాంటి కార్యక్రమాల దాకా వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మొదట్లో అమూల్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా, మమ్మీ కె సూపర్‌స్టార్స్‌, గౌరవ్‌ మహారాష్ట్ర లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు నన్ను మా రాష్ట్రానికి పరిచయం చేశాయి. ఆ తర్వాత అనుకోకుండా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12లోకి అడుగుపెట్టాను.

ఇంటి బరువు ఇప్పుడు నేను మోస్తా..

స్థాయి, ప్రాంతం భేదం లేకుండా ప్రతిభ ఉన్న ఎందరికో అవకాశమిచ్చిందీ వేదిక. ఇక్కడ ప్రదర్శన అనగానే తొలుత వణికిపోయాను. కానీ ఇక్కడ టైటిల్‌ గెలవడమే నా లక్ష్యం కాబట్టి ధైర్యం తెచ్చుకుని మరీ పాడాను. సీజన్‌లో తొలి గోల్డెన్‌ మైక్‌ నాకే దక్కింది. అదే నాకు ప్రత్యేక గుర్తింపు. ఆ తర్వాత ఎక్కడా తగ్గకుండా టాప్‌ 10లో నిలిచాను. ఎందరో అభిమానుల ఓట్లతో రన్నరప్‌గా నిలిచాను. అయితే మాకోసం నాన్న పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఆయన కోసమైనా గెలవాలనే కసితో పాడాను. ఇక్కడ గెలిచి ఓ మంచి ఇల్లు కట్టడం, కారు కొనడం, మంచి బట్టలు కొనివ్వడం చేయాలనుకున్నాను. వాళ్లకు ఉన్నత జీవనాన్ని అందించి ఇకపై నేనే కష్టపడాలని నిర్ణయించుకుని పాడా. మా నాన్న శ్రమ గుర్తు పెట్టుకోవాలనే ప్రముఖ కంపోజర్‌ ఆనంద్‌ నాకు ‘శైలీ కిషోర్‌ కాంబ్లే’గా పేరు మార్చారు. ఇండియన్‌ ఐడల్‌లో నాకు దక్కిన గుర్తింపుతో ఇప్పుడు బాలీవుడ్‌లో అవకాశాలొస్తున్నాయి. మరాఠీ సినిమాల్లో పాడుతున్నాను. ఇకపై మా ఇంటి బాధ్యత, బరువు నేనే మోస్తా. ఇంత తక్కువ సమయంలో గెలుపు నన్ను చేరడానికి నాన్న కష్టమే కారణమని చెబుతా.

- అభిసాయి ఇట్ట, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్