కాసులు కురిపిస్తారు!

డబ్బంటే ఎవరికి చేదు..? కానీ పెట్టుబడి పాఠాలే ఓ పట్టాన కొరుకుడు పడవు. ఇప్పుడా చింత లేదు. సామాన్యులకు అర్థమయ్యేలా... స్టాక్‌మార్కెట్‌ పండితులకు ఉపయోగపడేలా సోషల్‌మీడియా అడ్డా అయ్యింది.  ఈ అమ్మాయిలు డబ్బు పాఠాలతో ఈ మార్గంలోనే లక్షలాదిమందికి....

Updated : 31 Aug 2021 05:19 IST

డబ్బంటే ఎవరికి చేదు..? కానీ పెట్టుబడి పాఠాలే ఓ పట్టాన కొరుకుడు పడవు. ఇప్పుడా చింత లేదు. సామాన్యులకు అర్థమయ్యేలా... స్టాక్‌మార్కెట్‌ పండితులకు ఉపయోగపడేలా సోషల్‌మీడియా అడ్డా అయ్యింది.  ఈ అమ్మాయిలు డబ్బు పాఠాలతో ఈ మార్గంలోనే లక్షలాదిమందికి  చేరువయ్యారు. దేశవ్యాప్తంగా ‘ఫిన్‌ఫ్లూయ్యర్స్‌’గా పేరు సంపాదించుకున్న వీళ్ల గురించి తెలుసుకుందాం..


సోషల్‌మీడియాలో బోధన..

సీఏగా కెరీర్‌ని మొదలుపెట్టిన రచన... కొంతకాలం సీఏ విద్యార్థులకు ఫైనాన్స్‌ పాఠాలు బోధించింది. ఆ అనుభవమే ఆమెను దేశంలోనే ఫైనాన్స్‌ విషయాలని అత్యంత అద్భుతంగా చెప్పే టీచరమ్మగా తీర్చిదిద్దింది. యూట్యూబ్‌లో 25 లక్షలమందికిపైగా వీక్షకులున్న ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పెద్ద ఎత్తునే ఫాలోవర్స్‌ ఉన్నారు. పుణెకి చెందిన రచన ఫడకే రనడే.. బృహన్‌ మహారాష్ట్ర కాలేజీలో బీకాం చదివింది. సావిత్రీబాయిఫులే యూనివర్సిటీ నుంచి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది. పదేళ్లు ఆడిటర్‌గా పనిచేసింది. తర్వాత బిజినెస్‌ స్కూల్లో ఫైనాన్స్‌ లెక్చరర్‌గా పదివేల మంది విద్యార్థులకు ఫైనాన్స్‌ పాఠాలు బోధించింది. ఆ అనుభవంతోనే 2015లో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌నీ, రచన రనడే అండ్‌ అసోసియేట్స్‌ పేరుతో ఆడిటింగ్‌ సంస్థనూ స్థాపించింది. మొదట్లో ఈ ఛానెల్‌లో పర్సనల్‌ ఫైనాన్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, ప్రపంచ ప్రసిద్ధ బ్రాండుల వెనుక ఆసక్తికరమైన కథలు వంటివి అందరికీ అర్థమయ్యేలా... చిన్నచిన్న స్కిట్స్‌తో చెప్పేది. ‘ఇన్నేళ్ల కష్టం ఒకెత్తు... లాక్‌డౌన్‌ సమయం ఒకెత్తు’ అంటుంది రచన. కారణం... లాక్‌డౌన్‌లో ఆదాయ వనరులు వెతుకుతూ యువ సబ్‌స్క్రైబర్లు విపరీతంగా పెరిగారట. ‘బేసిక్స్‌ ఆఫ్‌ స్టాక్‌ మార్కెట్‌’ అంటూ ఔత్సాహిక మదుపరుల కోసం ఆమె చేసిన వీడియో ఒకటి కోటిన్నర వ్యూస్‌ని దక్కించుకుందీ ఆ సమయంలోనే. యూట్యూబ్‌లో నెలకి ఎనిమిది నుంచి పది వీడియోలు చేస్తూ దేశంలోనే పేరున్న ఫిన్‌ఫ్లూయర్‌గా అంటే ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్లూయర్‌గా మారింది. ప్రముఖ బిజినెస్‌ పత్రిక దేశంలోని ముగ్గురు ప్రభావిత ఫిన్‌ఫ్లూయర్స్‌ని ముఖచిత్రంగా ప్రచురిస్తే అందులో రచన ఒకరు. రచన భర్త అక్షయ్‌ కూడా సీఏనే.


అనుభవాలే పాఠాలుగా...

లింకన్‌ ఎలక్ట్రానిక్‌ సంస్థలో సీనియర్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌గా పని చేస్తున్న నిధి నాగోరి కెనడాలో ఉంటోంది. పాతిక దేశాల్లో ఉన్నవారికి ఫైనాన్స్‌ సూత్రాలు చెబుతున్న ఈ అమ్మాయి ఒకప్పుడు తీవ్రమైన ఆత్మన్యూనతతో బాధపడేదట. కోల్‌కతాకు చెందిన నిధి చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయి.. ఆర్థికపరమైన ఒత్తిడినీ ఎదుర్కొంది. ‘మా ఇంట్లో అంతా ఇంజినీర్లు, డాక్టర్లే! నా సీఏ చదువు గురించి ఎవరికీ తెలియదు. అందుకే మొదటిసారే అన్ని సబ్జెక్టులూ క్లియర్‌ చేసినా... అమ్మాయిని కావడం, నా రంగు తక్కువగా ఉండటం వంటి కారణాలతో చాలా మంది నన్ను నిరుత్సాహపరిచారు. ఆ న్యూనతతో సీఏ చదివిన తర్వాత ఆర్టికల్‌షిప్‌కి అర్హత సాధించలేకపోయాను. అదే సమయంలో నాన్న చనిపోవడంతో ఆర్థికంగా నాపై ఒత్తిడి పెరిగింది. చదువుకోవడానికి విదేశాలకు వెళ్లినప్పుడూ ఆత్మన్యూనత వెంటాడింది’ అనే నిధి విద్యార్థినిగా తను పడ్డ ఇబ్బందులు మరొకరు పడకూడదన్న ఉద్దేశంతో నవతరానికి డబ్బు పాఠాలు చెప్పడం మొదలుపెట్టి క్రమంగా ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ ఎక్స్‌పర్ట్‌గా మారింది. ఆసక్తికరమైన పోస్టులతో ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేసే నిధికి మూడున్నరలక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.


తేలిగ్గా అర్థమయ్యేలా...

ప్రస్తుతం చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌(సీఎఫ్‌ఏ) ఆఖరి సంవత్సరం చదువుతోన్న అనుష్క రాథోడ్‌ ఎంతటి కొరుకుడు పడని ఆర్థికాంశాలనైనా అరటిపండు వలిచినంత తేలిగ్గా చెప్పడంలో దిట్ట. ఇరవైల్లో పెట్టుబడిదారునిగా మారడం ఎలా?, క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి?, కొత్తగా వస్తోన్న ఐపీఓల్లో ఏవి మంచివి.. ఇలా ఆమె చెప్పే విషయాలకి ఆన్‌లైన్‌లో చక్కని ఆదరణ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు రెండున్నర లక్షలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు.


సులువుగా.. సరదాగా!

‘కోటి రూపాయలు సంపాదించడం ఎలా?, మ్యూచువల్‌ ఫండ్‌లో డబ్బులు పెడుతున్నారా?.. క్రెడిట్‌ కార్డు బిల్లుని తగ్గించుకోవడం ఎలా?... ఇలా డబ్బు గురించి మీ సందేహం ఏదైనా అరనిమిషం రీల్‌లో అద్భుతంగా ఓ స్కిట్‌ వేసి పెద్దగా చదువుకోని వాళ్లకూ, లెక్కలంటే భయపడే వాళ్లకూ అర్థమయ్యేలా చెప్పేయడం అనామికా రాణా ప్రత్యేకత. ఇన్‌స్టాగ్రామ్‌లో అరలక్షమంది వరకూ ఫాలోవర్స్‌ ఉన్న అనామికా ఎంత కఠినమైన విషయాన్నైనా సరదా సరదాగా చెప్పేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్