Published : 07/09/2021 00:48 IST

పద్ధతిని మార్చి సత్ఫలితాలను సాధించి

గిరిజనులు కొండల మీద గట్లు కట్టి మడులుగా చేసి సాగు చేస్తుంటారు.. కొండ వాగు నుంచి వస్తున్న నీటిని వెదురు బొంగులతో పంటలకు మళ్లించుకుంటారు. ఇలా సాగులో ఏవో ప్రయోగాలు చేస్తూంటారు. విశాఖ జిల్లా హంసబండకు చెందిన వంతల జమున కూడా ఓ ప్రయోగం చేసింది. అది సఫలమై ఆ సాగుకి ఆమె పేరే వచ్చేసింది.

మావోయిస్టులకు అడ్డాగా ఉండే ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్‌(ఏవోబీ)లోని ఓ కుగ్రామం జమునది. కొన్నేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తోంది. జమున ఏమీ చదువుకోకపోయినా... సాగులో వైవిధ్యం కోసం శాస్త్రవేత్తలను మించి మరీ ప్రయోగాలు చేస్తోంది. ఆ మధ్య ఎకరా భూమిలో చోడి నారు వేసింది. అప్పటి నుంచి కోత కోసే వరకూ ప్రతి దశనూ గమనిస్తే... పెట్టుబడి తిరిగొచ్చినా విత్తనాలు వృథా అవ్వడం గుర్తించింది. దీనికి తోడు కూలీ ఖర్చు పెరగడం, మొక్కలు సరిగ్గా ఎదగక పోవడం వంటి ఇబ్బందులూ కనిపించాయి. దాంతో ఆ పద్ధతి మార్చాలనుకుంది. అప్పటికే ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయంపై సలహాలిస్తున్న సంజీవినీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అమ్మాజీని కలిసింది. రైతు సాధికార సంస్థ ఎస్‌ఆర్పీ దేవుళ్లు నుంచీ కొన్ని సూచనలు తీసుకుంది.

కొత్తగా... బాగా ఆలోచించి నారు మడికి స్వస్తి చెప్పి పొలాన్ని చదును చేసింది. నేరుగా విత్తనాలనే నాటింది. పదిహేను రోజులకే మొలకలు మొదలయ్యాయి. ఇంటి దగ్గరే... ఘన, ద్రవ జీవామృతాలు తయారుచేసి వాటికి అందించింది. నేరుగా మొక్కలకే పోషకాలు అందే విధంగా సాగు పద్ధతిని మార్చేసింది. వీటన్నింటి వల్లా ఈ సారి 12.2 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇది సాధారణం కంటే రెట్టింపు. ఎకరాకు పెట్టుబడి పోను పాతికవేలకు పైగానే ఆదాయం అందుకుంది. ఇలా చోడి సాగులో కొత్త ఒరవడితో అందరి దృష్టినీ ఆకర్షించింది. అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తోన్న ఈ ఆదివాసీ మహిళ కృషిని గుర్తించిన రైతు ప్రాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ విజయకుమార్‌ ఆ సాగు విధానానికి ‘జమున పద్ధతి’గా నామకరణం చేశారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కలే కాదు... విశాఖ, తూర్పుగోదావరి మన్యం ప్రాంతంలోని పలువురు రైతులూ ఈ విధానాన్ని అనుసరిస్తూ లాభాలు పొందుతుండటం ఆమె విజయానికి నిదర్శనం. ‘మా పొలంలో దిగుబడి పెంచుకోవాలన్న ఆలోచనతోనే కొత్త పద్ధతిలో చేశాను. ఈ పద్ధతికి నా పేరు పెడతారని కలలో కూడా అనుకోలేదు. నా విధానాలు నలుగురికీ ఉపయోగపడ్డాయంటే అంతకంటే సంతోషమేముంది’ అంటోంది జమున.

- బొద్దల పైడిరాజు, విశాఖపట్నం


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని