Updated : 08/09/2021 05:42 IST

అమృతం పంచుతున్నారు

ప్రతి తల్లికీ కన్నబిడ్డకు చనుబాలని ఇచ్చే అదృష్టం దక్కకపోవచ్చు. మరలాంటి బిడ్డలకు డబ్బాపాలే ప్రత్యామ్నాయమా? ‘అవసరం లేదు. ఆ అమృతాన్ని మా బిడ్డలతోపాటు వాళ్లకీ సమానంగా పంచుతాం’ అంటున్నారు కొందరు ఆధునికతరం తల్లులు. తల్లిపాలు దక్కని పిల్లల కోసం ధాత్రి మిల్క్‌ బ్యాంక్‌ వేదికగా వాళ్లు చేస్తున్న సాయం వేలాది మంది పిల్లలకు ఆరోగ్యాన్నిస్తోంది...

బిడ్డకు అమ్మపాలే శ్రీరామరక్ష! కానీ ఎంతోమంది చిన్నారులకు రకరకాల కారణాలతో తల్లిపాలు తాగే అదృష్టం దక్కడం లేదు. కొన్నిరోజుల క్రితం కూకట్‌పల్లికి చెందిన రమణి కూడా ఇలాంటి కష్టాన్నే ఎదుర్కొన్నారు. ‘మాపాప నెలలు నిండకుండా పుట్టింది. నా దగ్గర పాల్లేవు. దాంతో పాప పుట్టి రెండు రోజులయినా దగ్గరకు తీసుకుని పాలివ్వలేని పరిస్థితి. అది గుక్కపట్టి ఏడుస్తుంటే... ఆకలి తీర్చడానికి డబ్బాపాలు తప్ప మరోదారి లేనప్పుడు మనసుకు కష్టంగా ఉండేది. ఆ సమయంలో నా బిడ్డకు చనుబాలిచ్చేందుకు సుదీష్ణ అనే ఓ తల్లి ముందుకొచ్చింది. సంతోషంగా థ్యాంక్స్‌ చెప్పాలని చూస్తే ఆమె ‘దాందేముంది... నాకు ఇద్దరు పిల్లలు అనుకుంటా’ అని అన్నప్పుడు నాకు కన్నీరు ఆగలేదు. ఎన్నో దానాల గురించి నాకు తెలుసు కానీ పసిపిల్లల ఆకలి తీర్చే ఈ సాయం ఎప్పటికీ మర్చిపోలేను అంటారు రమణి. ‘బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలు దానం చేయవచ్చని నెట్‌లో చూసి తెలుసుకున్నాను. ఇంకా వెతికితే హైదరాబాద్‌ నిలోఫర్‌లో ధాత్రి మదర్స్‌ మిల్క్‌బ్యాంకు గురించి తెలిసింది. ఆ మిల్క్‌ బ్యాంకు సహకారంతో 20,000 మి.లీ. పాలని ఎంతోమంది పసిపిల్లలకు అందివ్వగలిగాను’ అంటున్నారు గుంటూరుకు చెందిన సుదీష్ణ. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు. సుదీష్ణలాంటి వారు మాత్రం స్వచ్ఛందంగా చనుబాలని దానం చేసి శెభాష్‌ అనిపించుకుంటున్నారు.

బాలింతలు అనారోగ్య సమస్యలతో బిడ్డకు దూరంగా వేరే ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, లేదా వాళ్ల దగ్గర సరిపడా పాలు లేకపోవటం, నెలల నిండకుండా పుట్టిన పిల్లల విషయంలో.. చనుబాల సమస్య ఏర్పడుతోంది. ఇలాంటి సందర్భాల్లో నవజాత శిశువుల చిట్టిబొజ్జలు నింపేందుకు ఆధునిక అమ్మలు ముందుకొస్తున్నారు. తమ బిడ్డల ఆకలితీరాక మిగిలిన చనుబాలను దానంగా ఇస్తున్నారు. ఒకటి రెండుసార్లు కాదు.. తమ దగ్గర పాలున్నంత వరకూ ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు. ‘పిల్లలు ఆకలితో గుక్కపెడుతుంటే ఏ అమ్మకూ నిద్రపట్టదు. అక్కడ ఉన్నది ఎవరి బిడ్డైనా వాళ్ల కడుపు నింపాలనే చూస్తుంది. అయినా ఒక తరం ఆరోగ్యంగా ఎదగాలంటే నా బిడ్డ ఒక్కడూ బాగుంటే సరిపోతుందా? ప్రతి చిన్నారీ అలానే ఉండాలిగా. అందుకే ఈ దానం’ అంటూ చెప్పుకొచ్చారు పాతబస్తీకి చెందిన ఓ మహిళ. ఈ ఉద్యమం మరింత విస్తృతం అవ్వాలి. ఏ పసిబిడ్డా పాలు లేక ఇబ్బంది పడని రోజు రావాలి.


మొహమాటపడొద్దు

- బూరుగుపల్లి సిరి

నేను కొన్నాళ్లు అమెరికాలో ఉండటం వల్ల చనుబాల దానంపై అవగాహన ఉంది. అక్కడ ఇది సర్వ సాధారణం. మా పాప నిహిర పుట్టాక... ఇక్కడ ఆ అవకాశం ఉందా అని నెట్‌లో వెతికా. కొన్ని ఆసుపత్రులకు ఫోన్‌ చేస్తే ఎగతాళి చేశారు. ‘ధాత్రి’ నాకు అవకాశం ఇచ్చింది. నువ్వు పాలిచ్చిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడంటూ వాళ్లమ్మ చెబుతోంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విషయంలో సిగ్గుపడే వాళ్లనీ చూశాను. తల్లిపాలు పట్టించటంపై అవగాహన పెరగాలి. ఇచ్చేందుకు అమ్మలూ ముందుకు రావాలి. మొహమాటం, బిడియం వదిలేసి ధైర్యంగా చర్చించాలి.


అమ్మగా నా బాధ్యత

- మౌనిక, విజయవాడ

తేడాది నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. మా బాబు తాగగా మిగిలిన పాలను ఎవరైనా  పసిపిల్లలకి ఇవ్వాలని ఫోన్‌ చేసి చెబితే, మరుసటి రోజే వచ్చి తీసుకెళ్లారు. సంతోషంగా అనిపించింది. అమ్మగా ఇది నా బాధ్యత కూడా. ఎంత అవకాశం ఉంటే అంత పాలను దానమివ్వాలనేది నా సూచన.


3 ఏళ్లు... 1,000 లీటర్లు

సుషేన హెల్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 2017 అక్టోబరులో హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో ధాత్రి మిల్క్‌బ్యాంకుని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన తల్లిపాల నిధి ఇది. పుట్టిన వెంటనే బిడ్డకు చనుబాలివ్వటం, అదనంగా ఉన్న వాటిని అవసరం ఉన్న ఇతర బిడ్డలకు దానమివ్వటంపై అవగాహన కల్పిస్తోందీ సంస్థ. మూడేళ్ల వ్యవధిలో 30,638 మందికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు 10,753 మంది బాలింతలు తమ పాలను పంచి మాతృత్వంలోని దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటి వరకూ 10,00,000 మిల్లీలీటర్ల పాలను సేకరించి శుద్ధిచేసి 9,800 మంది నవజాత శిశువులు ఆరోగ్యవంతులుగా ఎదిగేందుకు అవసరమైన చనుబాలు అందించింది ధాత్రి. ‘బయటి పాల వల్ల పిల్లలు అనారోగ్యాల బారిన పడతారు. 10-15 శాతం మంది పిల్లల్లో పేగు సంబంధమైన జబ్బులు రావొచ్చు. దీనికి తల్లిపాలే పరిష్కారం’ అంటున్నారు ఈ సంస్థ బ్యాధతలు చూస్తున్న డాక్టర్‌ సంతోష్‌కుమార్‌.

- జి.సాంబశివరావు, హైదరాబాద్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని