పాల ప్యాకెట్ల నుంచీ ప్రకృతిని కాపాడుతూ...

వంటింటి వ్యర్థాలైన ఖాళీ పాల ప్యాకెట్లు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. వీటి గురించి ఆలోచించారు ముంబయికి చెందిన హన్సు పరిద్వాలా, కుంతీ ఓజా, చిత్రా హిరేమత్‌. వీరి ఆలోచన వల్ల లక్షల పాల కవర్లు బ్యాగులుగా మారి ఉపయోగపడుతున్నాయి. అలా ఆ ముగ్గురు చేపట్టిన ‘మిల్క్‌ బ్యాగు’ ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం.

Updated : 12 Sep 2021 06:01 IST

వంటింటి వ్యర్థాలైన ఖాళీ పాల ప్యాకెట్లు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. వీటి గురించి ఆలోచించారు ముంబయికి చెందిన హన్సు పరిద్వాలా, కుంతీ ఓజా, చిత్రా హిరేమత్‌. వీరి ఆలోచన వల్ల లక్షల పాల కవర్లు బ్యాగులుగా మారి ఉపయోగపడుతున్నాయి. అలా ఆ ముగ్గురు చేపట్టిన ‘మిల్క్‌ బ్యాగు’ ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం.

చిన్న ఆలోచనే పెద్ద మార్పుకు దారి తీస్తుంది. హన్సు, కుంతి, చిత్రలను అలాగే కదిలించింది ఓ ప్రకటన. పాల కవరును కట్‌ చేయగా వచ్చే చిన్న ప్లాస్టిక్‌ ముక్క కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అలా కాకుండా కవరు నుంచి ఆ ముక్కను వేరు చేయకుండా ఉంచితే ప్రకృతికి మనవంతు సేవ నందించినట్లు అవుతుందని బెంగళూరుకు చెందిన ఓ మహిళ చేపట్టిన ప్రచారం వీరిని ఆలోచింప చేసింది. పాలకవర్లు వృథా కాకుండా తామూ ఏదో ఒకటి చేయాలనుకున్నారు. అలా 2019లో ‘మిల్క్‌ బ్యాగు’ ప్రాజెక్టును ప్రారంభించారు.

అవగాహన కలిగించి..

ముంబయి వంటి నగరంలో కోట్లమంది పాల కవర్లను పడేస్తుంటారు. వాటిని సేకరించి పునర్వినియోగమయ్యేలా చేయాలనుకున్నాం అంటారు కుంతి. ‘మా ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చిన్న వీడియోను రూపొందించాం. వాడిన పాలకవర్లను నెల రోజులు భద్రపరచగలిగితే వాటిని మేం సేకరిస్తామని, అలాగే ఎలా భద్రపరచాలో  కూడా చెప్పాం. వాటిని రీసైకిల్‌ చేసి ప్లాస్టిక్‌ కవర్లుగా తిరిగి వినియోగించేలా చేస్తామన్నాం. ఆ వీడియోను తెలిసిన వాళ్లందరికీ పంపాం. సోషల్‌ మీడియాలోనూ ఉంచాం. అలా నెల తర్వాత వెళ్లి వాటిని తీసుకోవడం ప్రారంభించాం. ముందుగానే ప్లాస్టిక్‌ కవర్లు తయారు చేసే వారితో మాట్లాడాం. మేం సేకరించిన పాల కవర్లున ప్లాస్టిక్‌ కవర్ల తయారీ దారులకు అందించే వాళ్లం. మా సేకరణ నుంచి తయారీ వరకు మరొక వీడియో చిత్రీకరించి మా సొసైటీ గ్రూపుల్లో పొందుపరిచాం. దీంతో ఈ ప్రాజెక్టు చాలామందికి చేరింది. కొందరిని కవర్ల సేకరణ కోసం నియమించాం. ప్లాస్టిక్‌ సంస్థలకు నామమాత్రంగా ధరకు ఈ కవర్లును విక్రయించి ఆ నగదును జీతాలుగా అందిస్తున్నాం’ అని వివరించారు కుంతి.

‘హర్‌ ఘర్‌ హరా ఘర్‌’, ‘క్లీన్‌ ముంబయి ఫౌండేషన్‌’, ‘గార్బేజ్‌ ఫ్రీ ఇండియా’ వంటి సేవా సంస్థలతో కొన్నేళ్లుగా కలిసి పని చేస్తున్న ఈ ముగ్గురికీ మిల్క్‌ బ్యాగ్‌ ప్రాజెక్టు ప్రారంభంలో పలు సమస్యలెదురయ్యాయి. 100 కేజీల కవర్లు ఉంటేనే తీసుకుంటామంటూ ప్లాస్టిక్‌ పరిశ్రమలు అభ్యంతరం చెప్పేవి. కొత్తలో ఇది కష్టమయ్యింది. ప్రస్తుతం సమీపంలోని కాలనీలతో పాటు హోటళ్లు, టీ దుకాణాల నుంచి ప్రతి నెలా పాల కవర్లున్నాయంటూ సమాచారం అందుతోంది. బెంగళూరు, దిల్లీ వంటి నగరాల నుంచి కూడా పోస్టులో పంపుతున్నారు. కొవిడ్‌కు ముందు 2.5 నుంచి 3.5 లక్షల కవర్లను రీసైకిల్‌ చేయించగా, లాక్‌డౌన్‌తో విరామం వచ్చింది. ఈ ఏడాది మొదట్లో ప్రాజెక్టును తిరిగి ప్రారంభించారు. ఇప్పుడు పలు ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో కవర్లు రీసైకిల్‌ కోసం ముంబయికి చేరుకుంటున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్