అమ్మను కాలేకపోయా..కానీ!

తల్లి కావాలని... బిడ్డలతో జీవితానికో నిండుదనం తెచ్చుకోవాలని ఏ ఇల్లాలైనా ముచ్చట పడుతుంది.. మేఘన కూడా అలానే కలలు కంది. కానీ ఆ కల నెరవేరలేదు..  అలాగని ఆమె కుంగిపోలేదు. తన తల్లి ప్రేమను ఎందరికో పంచుతూ సేవామార్గంలో అడుగుపెట్టింది. ‘ఫీడ్‌ ది హంగ్రీ’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనాథలకి అమ్మగా మారింది. అవసరార్థులకు భరోసా ఇస్తోన్న మేఘన తన సేవా ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంది...

Updated : 12 Sep 2021 05:17 IST

తల్లి కావాలని... బిడ్డలతో జీవితానికో నిండుదనం తెచ్చుకోవాలని ఏ ఇల్లాలైనా ముచ్చట పడుతుంది.. మేఘన కూడా అలానే కలలు కంది. కానీ ఆ కల నెరవేరలేదు..  అలాగని ఆమె కుంగిపోలేదు. తన తల్లి ప్రేమను ఎందరికో పంచుతూ సేవామార్గంలో అడుగుపెట్టింది. ‘ఫీడ్‌ ది హంగ్రీ’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనాథలకి అమ్మగా మారింది. అవసరార్థులకు భరోసా ఇస్తోన్న మేఘన తన సేవా ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంది...

దకొండేళ్ల కిందట మా అమ్మ క్యాన్సర్‌ బారిన పడింది. అప్పుడు చికిత్స కోసం ఎందరినో అర్థించాం. ఒక్కో రూపాయీ పోగేసేందుకు పడిన కష్టం.. అప్పటి కన్నీళ్లు మరిచిపోలేను. అతికష్టమ్మీద డబ్బు అందింది. మా అమ్మ మహమ్మారిని గెలిచింది. మూణ్నెళ్ల క్రితం ఓ కొరియోగ్రాఫర్‌.. వయసు ఇరవై ఏడే.. చావుబతుకుల మధ్యనున్నా అయినవాళ్లు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు బాధ్యత తీసుకొని మిత్రుల సాయంతో డబ్బులు పోగేశాం. ఇన్నేళ్ల కాలంలో ఏమీ మారలేదు. అప్పుడూ.. ఇప్పుడూ... పేద, మధ్యతరగతి కుటుంబాలది అదే వ్యథ. దీన్ని మార్చడంతో పాటు ప్రేమను కోరుకుంటున్న చిన్నారులు, వయోధికులకు సాయం చేయాలనే ఆరేళ్ల క్రితం ‘ఫీడ్‌ ది హంగ్రీ’ సంస్థను స్థాపించాను. 25 మంది వలంటీర్లు, మా ఆయన... వారి సాయంతోనే ఈ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నాను.

సగభాగం సవాళ్లలోనూ..

2004లో ఓ ధారావాహిక చిత్రీకరణలో ఇంద్రనీల్‌తో స్నేహం, ఆ తర్వాత ప్రేమ, ఇంట్లో వాళ్లను ఎదిరించి పెళ్లి జరిగిపోయాయి. తనది విజయవాడ. నాది బంగాల్‌. మా కుటుంబం స్థిరపడింది హైదరాబాదులోనే. మొదట్లో ఒప్పుకోకున్నా.. తర్వాత అత్తగారింట్లో సొంత కూతురిలానే చూసుకున్నారు. అంతా సంతోషంగా సాగుతుండగానే అమ్మ కాబోతున్నానని తెలిసింది. ఓ చిత్రీకరణ సమయంలో ఆ మాతృత్వం దూరం అయ్యింది. ఆ తర్వాత అనాథ పిల్లల్ని పెంచుకోమనీ, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలనూ మిత్రులు సూచించారు. ఇవేవీ నచ్చలేదు. కొన్నేళ్లు నటన ఆపేశాను. ఇంటికే పరిమితమయ్యాను. ఊహించనంత బరువు పెరిగాను. ఆ సమయంలో మా ఆయన తోడుగా నిలిచారు. నేనేం చేసినా మద్దతిచ్చారు. నటన ఆపేసినా... మళ్లీ వస్తానన్నా అడ్డుచెప్పలేదు. నేను చేసే సాయంలోనూ ఆయనదే కీలకపాత్ర. ఆకలి అంటే కడుపుదే కాదు. ఎందరో అనాథలు అమ్మా నాన్నలకు, వృద్ధులు పిల్లల ప్రేమకు దూరమై ఆశ్రమాల్లో ఒంటరి బతుకులు గడుపుతున్నారు. వాళ్లకు ఏం కావాలో, ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. ఎక్కడ ఏ వస్తువులు, నిత్యావసరాలు అవసరమున్నాయో తెలుసుకుని తోచినంత ఇవ్వడంతో పాటు దాతల నుంచి సమీకరించి ఇస్తున్నాం.పోయినేడాది ఏప్రిల్‌ నుంచి జులై వరకూ రోజుకి వంద కుటుంబాలకి భోజనాలు పెట్టి, నిత్యావసర సరుకులనీ అందించాం. ఆరు అనాథ, వృద్ధాశ్రమాలకు నిత్యావసరాలు, నిధులు సమకూర్చాం. ఒక్కో ఆశ్రమానికీ నెలకి రూ. లక్ష వరకూ ఖర్చవుతోంది. పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశాం. గతేడాది వరదల సమయంలోనూ క్షేత్రస్థాయిలో పనిచేశాం. చాలామందికి వైద్యచికిత్సలకు నిధులను సమీకరించి ఇచ్చాం. అగ్నిప్రమాద బాధితులు, పేద రోగుల కోసం మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాం. నెలలో రెండు మెడికల్‌ క్యాంపులు తప్పక నిర్వహిస్తాం. స్నేహితులు, నటీనటుల్లో చాలామంది పెద్దమొత్తంలో సాయం చేశారు. ఎంతో మంది విద్యార్థుల చదువులకు కూడా మా వేదిక ద్వారా సాయం చేస్తున్నాం. వీటన్నింటి కోసం యూట్యూబ్‌లో ‘నీలిమేఘాలు’ ఛానల్‌ రూపొందించాను. ఏ వేదిక ద్వారా వచ్చిన నిధులైనా సేవ కోసమే.

కష్టపడి వీలైనంత సంపాదించి, అవసరమున్న వాళ్లకు అందించాలి అనుకున్నాం. అందుకే నటనను మళ్లీ మొదలుపెట్టాను. మా ఇద్దరికీ వచ్చిన దానిలో అవసరాలకు పోనూ మిగిలిందంతా సేవకే ఖర్చు చేస్తున్నాం. వృత్తి విరమణ తర్వాత హైదరాబాద్‌లోనే వృద్ధాశ్రమం నిర్మించి.. అక్కడే గడిపేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

- అభిసాయి ఇట్ట, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్