30వేల ఎకరాల భూసారాన్ని పెంచారు...

అన్నదాతల కష్టాన్ని దగ్గరగా చూశారామె. అందుకే సేద్యంలో వారెదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఆలోచించాలనుకున్నారు. ఏళ్లపాటు వినూత్న ప్రయోగాలు చేసి భూమి సారాన్ని పెంచే పదహారు

Published : 13 Sep 2021 00:51 IST

అన్నదాతల కష్టాన్ని దగ్గరగా చూశారామె. అందుకే సేద్యంలో వారెదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఆలోచించాలనుకున్నారు. ఏళ్లపాటు వినూత్న ప్రయోగాలు చేసి భూమి సారాన్ని పెంచే పదహారు రకాల సేంద్రియ ఉత్పత్తులను కనిపెట్టారు. వాటిని రైతులకు అందుబాటులోకి తెచ్చి మూడు దశాబ్దాలుగా ముప్పైవేల ఎకరాల్లో పచ్చని పంట పండేలా కృషి చేస్తున్నారు. 53 ఏళ్ల సందీప కనిట్కర్‌ స్ఫూర్తి కథనమిది.

పుణెకు చెందిన సందీప కనిట్కర్‌ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేశారు. తన చదువు కర్షకులకు ఉపయోగపడేలా ఉండాలనుకున్నారు. ముఖ్యంగా రైతులను లబ్ధిదారులుగా మార్చాలనుకున్నారు. రసాయన ఎరువులను వినియోగించడానికి అలవాటు పడిన రైతులను తిరిగి సహజసిద్ధమైనవాటివైపు అడుగులేసేలా ప్రయత్నించారు. అందుకు మైక్రోబయాలజిస్ట్‌గా దిగుబడిని, భూమి సారాన్నీ పెంచే ఉత్పత్తుల తయారీ కోసం వినూత్న ప్రయోగాలెన్నో చేశారు. పలురకాల ఉత్పత్తులను ఆవిష్కరించారు.   

రెండేళ్ల తర్వాతే...

సందీప మొదటి ప్రయోగం విజయవంతం కావడానికి రెండేళ్లు పట్టింది. అలా 1993లో తొలి సేంద్రియ ఉత్పత్తిని తయారుచేశారు. భూమిలోని సారాన్ని పెంచి అధిక దిగుబడికి తోడ్పడే ఈ జీవ ఎరువును వినియోగించడానికి రైతులు ముందడుగు వేయకపోయినా, ఈమె నిరుత్సాహపడలేదు. దీన్ని మొదట అమెరికా, ఆస్ట్రేలియా రైతులకు పరిచయం చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని చెరకు రైతులకు ఈ జీవ ఎరువు గురించి అవగాహన కల్పించారు. ఇందుకోసం పంట పొలాల్లో రైతులతో కలిసి నడిచేవారు. పంటలు, అవి ఎదిగే తీరుని పరిశీలించేవారు. క్రమంగా వారు వాటిని వినియోగించి దిగుబడిని పెంచుకునేలా చేశారు. సందీప ఆయా ప్రాంతాల్లో మట్టి తీరుని బట్టి వివిధ ఆవిష్కరణలు చేశారు. ఈ దిశగా తన పరిశోధనలు చేయడానికి ‘కన్‌ బయోసిస్‌’ పేరుతో ఓ స్టార్టప్‌నీ ప్రారంభించారు.

పదిహేను దేశాలకు ఎగుమతి...

భూమి సారవంతమైతే విత్తనాలు ఆరోగ్యంగా మొలకెత్తుతాయి అంటారు సందీప. ‘మట్టి సారాన్ని పెంచేందుకు తీసుకువచ్చిన రకాలు...భూమిలో నైట్రోజన్‌, కార్బన్‌వంటి పోషకాల శాతాన్ని మెరుగుపరుస్తాయి. మొలకలు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తాయి. పురుగులను అరికట్టి, దిగుబడిని పెంచుతాయి. ఇవి పూర్తిగా రసాయన రహితమైనవి. వీటిని వాడేలా మేం చేసిన రెండు దశాబ్దాల కృషికి ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో వ్యవసాయదారులు ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నారు. దాదాపు పది లక్షలమంది కర్షకులు 30వేల ఎకరాల్లో వాడి అధిక దిగుబడిని సాధిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, టర్కీ, యూరప్‌, ఆఫ్రికా తదితర 15 దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నాం’ అంటారామె. ఆమె కృషికి యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ బంగారుపతకాన్ని అందించింది. నేషనల్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ‘ద ఫస్ట్‌ టెక్నాలజీ డే’ అవార్డుతో గౌరవించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్