రెండు భాషల్లో రాసి... రికార్డు కొట్టేసి..

ఆమెకు మాతృభాషలో నవల రాయాలనేది కల. తాను రాయాలనుకుంటున్న కథలో సగభాగాన్ని మరో భాషలో రాయించి, దానికి ముగింపు మాత్రం తన మాతృభాషలో అందించి ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఇది తనకు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానాన్ని దక్కించింది. రెండు సగాలు, రెండు భాషల్లో ఉన్న ఈ నవల ఆ రెండింటిలోనూ....

Updated : 16 Sep 2021 05:38 IST

ఆమెకు మాతృభాషలో నవల రాయాలనేది కల. తాను రాయాలనుకుంటున్న కథలో సగభాగాన్ని మరో భాషలో రాయించి, దానికి ముగింపు మాత్రం తన మాతృభాషలో అందించి ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఇది తనకు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానాన్ని దక్కించింది. రెండు సగాలు, రెండు భాషల్లో ఉన్న ఈ నవల ఆ రెండింటిలోనూ విడుదల చేసి కొత్త పంథాను పరిచయం చేసిన ఆమెను ప్రశంసిస్తున్నారు పుస్తకప్రియులందరూ. ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆమే కేరళకు చెందిన అంజూసాజిత్‌.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ)లో ఓ పాఠశాలలో 12 ఏళ్లుగా ఉపాధ్యాయినిగా పని చేస్తోంది అంజూ. తనకు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. చదవడమే కాదు, తనూ ఓ నవల రాయాలని అనుకునేది. ఊటీలో కాలేజీ ప్రొఫెసర్‌గా ఉన్న మణివణ్ణన్‌ రాసిన తమిళ కవితలకు మలయాళ తర్జుమాను ఓసారి సోషల్‌ మీడియాలో చదివింది. అద్భుతంగా ఉన్న ఆయన రచనాశైలి, ఆ కవితలు ఆమెకు చాలా నచ్చాయి. ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. నవల రాయాలనుకుంటున్న విషయాన్ని మణివణ్ణన్‌ చెప్పడంతో తన మనసులోని విషయాన్ని బయటపెట్టింది అంజూ. తాను సగ భాగాన్ని తన మాతృభాష తమిళంలో రాస్తానని, మిగతా భాగాన్ని మలయాళంలో పూర్తి చేయాలని మణివణ్ణన్‌ చెప్పడంతో దానికి అంజూ అంగీకరించింది. అలా ఇద్దరూ కలిసి చేసిన ప్రయోగమే ఈ రోజు రికార్డులోకెక్కింది.

కష్టతరం

ఒక కథను రెండు భాషల్లో పూర్తి చేయడమంటే చాలా కష్టమైన విషయం అంటుంది అంజూ. ‘మణివణ్ణన్‌ సగం నన్ను రాయమని అడగ్గానే ముందు కొంత భయపడ్డా. తర్వాత ప్రయత్నించాలనుకున్నా. నాకు తమిళం రాదు. తనకు మలయాళం తెలీదు. అలాంటి మేమిద్దరం కలిసి రాయడం ఎలా అని ఆలోచించాం. ముందుగా తను రాయనున్న భాగాన్ని వాయిస్‌ మెసేజ్‌గా తను వివరించి, ఆ తర్వాతే రాశాడు. తన మెసేజ్‌ను విని అర్థం చేసుకున్న నేను, మిగతాదాన్ని మలయాళంలో పూర్తి చేయగలిగా. అలాగే నేను రాయనున్న దాన్ని అదే పద్ధతిలో ఆయనకు పంపించా. అలా ఇద్దరం కలిసి నవల పూర్తి చేయగలిగాం. అంతేకాదు, దీన్ని తమిళంలో ‘తరిషు నిళంగళ్‌’, మలయాళంలో ‘వెన్‌ తరిషు నిళమ్‌’గా విడుదల చేశాం. కథాంశమంతా తమిళ సంప్రదాయం, ప్రాచీన తమిళరాజ్యాన్ని పాలించిన మార్‌వర్మన్‌, ఇస్తాబెల్లా గురించి ఉంటుంది. దీన్ని రాయడానికి లాక్‌డౌన్‌ సమయాన్ని వినియోగించుకున్నా. ఈ పుస్తకం విడుదలైన తర్వాత ఇండియా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులోకెక్కడం సంతోషంగా ఉంది’ అని సంబర పడుతోంది అంజూ. ఇలా తమ సృజనాత్మకతను ప్రదర్శించి నవలాప్రియులను ఆకట్టుకుంటున్న ఈ రచన నిజంగానే కొత్త ఆలోచన కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్