పరిశ్రమలో... మహిళకు జై!

భారీ యంత్రాలన్నా... పెద్దపెద్ద ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలన్నా ఇన్నాళ్లూ మగవాళ్లే గుర్తుకొచ్చేవారు. ఆ అభిప్రాయాన్ని చెరిపేస్తున్నారు నవతరం మహిళలు. సంప్రదాయేతర పనుల్లో రాణిస్తూ... ఉత్పత్తి రంగంలో తమవాటాని పెంచుకుంటూ  ముందడుగు వేస్తున్నారు. తాజాగా.. ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ  పదివేలమందితో ఆల్‌ఉమెన్‌ టీంని ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ బాటలో ఇప్పటికే కొంతదూరం నడిచిన వారున్నారు. వారి గురించి చదివేయండి..

Updated : 16 Sep 2021 05:17 IST

భారీ యంత్రాలన్నా... పెద్దపెద్ద ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలన్నా ఇన్నాళ్లూ మగవాళ్లే గుర్తుకొచ్చేవారు. ఆ అభిప్రాయాన్ని చెరిపేస్తున్నారు నవతరం మహిళలు. సంప్రదాయేతర పనుల్లో రాణిస్తూ... ఉత్పత్తి రంగంలో తమవాటాని పెంచుకుంటూ  ముందడుగు వేస్తున్నారు. తాజాగా.. ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ  పదివేలమందితో ఆల్‌ఉమెన్‌ టీంని ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ బాటలో ఇప్పటికే కొంతదూరం నడిచిన వారున్నారు. వారి గురించి చదివేయండి..

మైనింగ్‌, హెవీ ఇంజినీరింగ్‌ రంగాల్లో పనిచేసే మహిళల సంఖ్య చాలా తక్కువ. ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు వేదాంత సంస్థ ఈ ఏడాది మొదట్లో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అల్యూమినియం, విద్యుత్‌ రంగాల్లో అగ్రగామి సంస్థ అయిన వేదాంత.. ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌లలోని తమ ప్లాంట్‌లలో కీలక బాధ్యతలని మహిళలకు అప్పగించింది. క్రేన్‌ఆపరేటర్లు, సెక్యూరిటీ ఆఫీసర్లు, మెయింటెనెన్స్‌ ఇంజినీర్లు, కోల్‌ప్రొక్యూర్‌మెంట్‌హెడ్‌లుగా ఆడవాళ్లకి అవకాశాన్ని ఇచ్చింది. ‘అగ్నివాహిని’ పేరుతో మొదటిసారిగా ఆల్‌ విమెన్‌ ఫైర్‌ఫైటింగ్‌ టీంనే ఏర్పాటు చేసింది. ‘ఈ పనిని మగవాళ్లే చేయగలరు అని ఎందుకు అనుకుంటున్నారు. ఆడవాళ్లూ చేయగలరు’ అంటూ మహిళల శక్తిసామర్థ్యాలపై భరోసాని పెంచేందుకు వేదాంత చేసిన ఈ ప్రయత్నం ఇతర కార్పొరేట్‌ కంపెనీలు, పరిశ్రమల్లో స్ఫూర్తిని రగిలించింది.

మీరు వాడుతున్న ఫోన్‌ ఏ బ్రాండ్‌? ఒక వేళ అది షావోమీదయితే మీరు కచ్చితంగా దాని తయారీలో చెమటోడ్చిన మహిళల గురించి ఒక్కసారైనా తలుచుకోవాల్సిందే. అదేంటి వీటిని మహిళలు చేస్తారా అని ఆశ్చర్యపోవద్దు. అవును.. చిత్తూరులోని శ్రీసిటీలో ఉన్న ఫాక్స్‌కాన్‌ ఇండియా ఈ ఫోన్లని తయారుచేస్తూ ఉంటుంది. గుదిగుచ్చి తయారుచేసిన తర్వాత వాటి నాణ్యతని, పనితీరుని ఒకటికిపదిసార్లు పరీక్షించేది మహిళలే. ఒక్కోఫోన్‌ని సుమారుగా 180 మంది మహిళలు చెక్‌ చేసిన తర్వాతే అది మనవరకూ వస్తుంది. దేశవ్యాప్తంగా కోట్ల ఫోన్లని అమ్ముతున్న ఈ సంస్థలో అసెంబ్లీ లైన్లలో కూర్చుని ఫోన్ల నాణ్యతని పరీక్షించే పనిని 90 శాతం మహిళలే చేస్తున్నారు. తమిళనాడు, ఒడిశా, ఏపీలకు చెందిన మహిళలు శిక్షణతో, నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఈ ఉపాధి అవకాశాలని కైవసం చేసుకుంటున్నారు.

ఆశీర్వాద్‌ ఆటా, ఇప్పీ నూడుల్స్‌ వంటి ఉత్పత్తులని తయారుచేసే ఐటీసీ సంస్థ గురించి తెలుసుగా! ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలో దిగ్గజంగా చెప్పే ఈ సంస్థ కర్ణాటకలోని నన్జన్‌గుడ్‌లో ఉన్న తమ ప్లాంట్‌లో అన్ని షిఫ్ట్‌ల్లోనూ మహిళలు పనిచేయడానికి అవకాశం ఇచ్చింది. తమిళనాడులోని పుదుక్కోటైలో ఉన్న ప్లాంట్‌లో 85 శాతం మహిళా ఉద్యోగులే ఉన్నారు. ఆమాటకొస్తే ఈ సంస్థ మొత్తం ఉద్యోగుల్లో కూడా 60 శాతం మహిళలే ఉండటం విశేషం. మహిళలు ఆర్థికంగా బలపడితే దేశం ఆర్థికంగా ముందుకు నడుస్తుందనే ఈ సంస్థ మహిళలు సౌకర్యవంతంగా పనిచేసేందుకు వీలుగా క్రెష్‌లు, ఇతర సదుపాయాలనీ ఏర్పాటు చేసింది. భోజనం, రవాణా, రక్షణ వంటి బాధ్యతలూ తీసుకుంది. వీళ్లు ప్రయాణించే బస్సుల్లో పానిక్‌ బటన్‌, జీపీఎస్‌ ట్రాకర్‌, విమెన్‌ సెక్యూరిటీ గార్డుల ఏర్పాటు ద్వారా వారికి భరోసాని అందించింది.

టాటా సంస్థల్లో టైటాన్‌ గ్రూప్‌కున్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద వాచ్‌ తయారీ సంస్థ. మనదేశ మార్కెట్‌లో యాభైశాతం వాటా ఉంది. తమిళనాడులోని హోసూరులో ఈ సంస్థను స్థాపించాలకున్నప్పుడు మొదట ఎదురైన సమస్య నైపుణ్యం గల మానవ వనరులు. ఇందుకోసం నామక్కల్‌, కృష్ణగిరి జిల్లాలు తిరిగి పదోతరగతి పాసైన యువతీయువకుల కోసం వేటసాగించిందా సంస్థ. ఇప్పుడు ప్రపంచం మెచ్చే వాచీలు తయారుచేసే ఆ సంస్థలో అత్యధికమంది ఉద్యోగులు మహిళలే.

‘పనిచేసే చోట ఎక్కువ తక్కువలు ఉండకూడదు’ అంటూ లింగవివక్షను తగ్గించే ప్రయత్నం చేసింది ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్‌ ఇండియా. దేశంలో ఏ ఆటోమొబైల్‌ సంస్థలోనూ లేనివిధంగా 31 శాతం మహిళా ఉద్యోగులని నియమించుకుంది. స్థానిక మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉపాధినిస్తోంది. అంతేకాదు ఈ సంస్థ నుంచి వచ్చిన యాభైవేలవ ‘హెక్టార్‌ ఎస్‌యూవీ’ కారుని పూర్తిగా ఆల్‌విమెన్‌క్రూ తయారుచేయడం విశేషం.

పదిహేడుసెకన్లలో ఒక పంపుని తయారుచేస్తారు కొయంబత్తూరులోని కిర్లోస్కర్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఆల్‌ విమెన్‌ టీం. 200 మంది మహిళలున్న ఈ ప్లాంట్‌ అధిక సామర్థ్యం చూసిన తర్వాత కిర్లోస్కర్‌ సంస్థ తమ కంపెనీలో మహిళలకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలనివ్వాలని తీర్మానించుకుంది. ఇవి మాత్రమే కాదు మరెన్నో కంపెనీలు మహిళలకు ఉపాధి అవకాశాలనివ్వడంపై ఆసక్తి చూపిస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్