Published : 20/09/2021 01:03 IST

పంటల చదువులో దిక్సూచి!

ఒక్క మంచిమాట గమ్యాన్ని మారుస్తుంది..ప్రతికూల ఆలోచనలను పటాపంచలు చేస్తుంది. లక్ష్యాన్ని చేరేందుకు దిక్సూచిగా మారుతుంది. ఇలా తన మాటలతో ఇరవై ఏళ్లుగా వేలమందికి దిశానిర్దేశం చేశారు గుత్తికొండ అనీజ. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా నిర్వహణ సంస్థ (నార్మ్‌) ముఖ్య సాంకేతిక అధికారిగా పనిచేస్తున్న ఆమె... పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ‘అమేయ - ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌2021’ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వసుంధరతో మాట్లాడారు.

ష్టంగా చేసే పనుల్లో అలసట తెలియదు. సరిహద్దులు కనిపించవు. అందుకు నా ప్రయాణమే ఓ ఉదాహరణ. మాది విజయవాడ. నాన్న జగన్మోహనరావు, అమ్మ సీతామహాలక్ష్మి. ఇద్దరూ విద్యారంగానికి చెందిన వారే. మాస్‌ కమ్యూనికేషన్స్‌, ఇంగ్లిషుల్లో మాస్టర్స్‌ చేశాను.   తర్వాత 1993లో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్స్‌ మేనేజ్‌మెంట్‌లో భాగమైన  ఐసీఏఆర్‌లో ముద్రణ విభాగంలో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా కెరియర్‌  ప్రారంభించా. దీనికి అదనంగా ప్రజాసంబంధాల అధికారిగానూ బాధ్యతలు అప్పగించారు. అది మొదలు ఎంతో మంది విద్యార్థులకు వ్యవసాయ విద్యపై అవగాహన, ఆసక్తి పెంచడం నా బాధ్యతగా భావించా.  వారు చదువుతోపాటు జీవననైపుణ్యాలు అలవరచుకునేలా వ్యక్తిత్వవికాస పాఠాలు బోధించటం మొదలుపెట్టా.

తడబాటుని సరిదిద్దాలని...

సామాజిక మాధ్యమాల్లో వ్యవసాయం గురించి ఎంతగొప్పగా చెప్పినా.. వాస్తవంలో యువత ఆలోచనలు భిన్నంగా ఉంటాయి.  మెడిసిన్‌లో సీటు రాకపోవడం వల్ల ఎక్కువ శాతం మంది వ్యవసాయ విద్య కోర్సులను ఎంచుకుంటారు. అప్పటి వరకూ తాము ఎంచుకున్న మార్గం నుంచి పక్కకు వచ్చామనే భావన విద్యార్థులను వెంటాడుతుంది. వ్యవసాయ గొప్పతనం, మున్ముందు నిర్వర్తించాల్సిన బాధ్యతలను గుర్తుచేస్తూ, ప్రేరేపిస్తూ వారి తడబాటును సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నా. సైన్స్‌, విజ్ఞానం రెండింటినీ బాల్యంలోనే దగ్గర చేయాలనే సంకల్పంతో పాఠశాల విద్యార్థులకు, మహిళలకు  అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నా. వారికి క్షేత్ర శిక్షణ ఇస్తున్నాం. వ్యవసాయ రంగానికి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాల నిర్వహణలో కీలకంగా పని చేశా. అవన్నీ నాకు గుర్తింపు తెచ్చాయి. దరఖాస్తు చేయకున్నా నా పనితీరును గుర్తించి ‘అమేయ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021’ పురస్కారం లభించడం ఆనందంగా ఉంది. మరెంతో మంది విద్యార్థులకు దిశానిర్దేశం చేసే మరిన్ని కొత్త కార్యక్రమాలు రూపొందిస్తా.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని