జన్మభూమిలో పనిచేసే అదృష్టం దక్కింది!

లండన్‌లో కార్పొరేట్‌ అటార్నీగా కెరియర్‌ని మొదలుపెట్టిన వీణారెడ్డి...  ప్రతిష్ఠాత్మక యూఎన్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌లో కొలువుని సాధించారు. ప్రస్తుతం ఆ సంస్థ తరపున భారత్‌, భూటాన్‌ మిషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచారు. హైదరాబాద్‌ వచ్చిన ఆమె ‘వసుంధర’తో ప్రత్యేకంగా మాట్లాడారు... తన ప్రస్థానాన్ని పంచుకున్నారు...

Updated : 16 Sep 2022 10:54 IST

లండన్‌లో కార్పొరేట్‌ అటార్నీగా కెరియర్‌ని మొదలుపెట్టిన వీణారెడ్డి...  ప్రతిష్ఠాత్మక యూఎన్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌లో కొలువుని సాధించారు. ప్రస్తుతం ఆ సంస్థ తరపున భారత్‌, భూటాన్‌ మిషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచారు. హైదరాబాద్‌ వచ్చిన ఆమె ‘వసుంధర’తో ప్రత్యేకంగా మాట్లాడారు... తన ప్రస్థానాన్ని పంచుకున్నారు...

నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరులో. పెరిగింది అమెరికా, బ్రిటన్‌లలో. మూడు సంవత్సరాల వయసులో అమ్మా, నాన్నలతో లండన్‌ వెళ్లటంతో నా చదువు సంధ్యలు అక్కడే సాగాయి. నాన్నది  ప్రొద్దుటూరు. అమ్మ రామలక్ష్మమ్మది కర్నూలు జిల్లా కోయిలకుంట్ల. ఇప్పటికీ ఆ రెండు ప్రాంతాల్లో చాలా మంది బంధువులు ఉన్నారు. రాకపోకలు సాగుతూనే ఉంటాయి. మా నాన్న విశ్వనాధ బలరామరెడ్డి కర్నూలు మెడికల్‌ కళాశాలలో చదువుకున్నారు. చేతనైనంతలో పేదలకు సాయం చేయాలన్నది ఆయన ధోరణి. ఆ లక్షణాలు నాలోనూ ప్రవహిస్తున్నాయి. అయితే నా మనసు వైద్యం వైపు కాకుండా న్యాయశాస్త్రం మీదకి మళ్లింది. బ్రిటన్‌ నుంచి అమెరికా వచ్చాక ‘లా’లో పీహెచ్‌డీ చేశాను. కార్పొరేట్‌ అటార్నీగా లండన్‌, లాస్‌ఏంజెల్స్‌, న్యూయార్కుల్లో పని చేస్తుండగా అమెరికన్‌ ఫారెన్‌ సర్వీసు సాధించాను. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలో (యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌- యూఎస్‌ ఏఐడి)లో న్యాయాధికారిగా 2004లో ఉద్యోగంలో చేరాను.

మన వంటకాలుంటే పండగే

తెలుగు వంటకాలు ఇంట్లో వండిన రోజు మాకు పండగే. గోంగూర పచ్చడి, గోంగూర పులుసు, బెండకాయ వేపుడు, పులుసులు అంటే ప్రాణం లేచొస్తుంది. హైదరాబాద్‌ బిర్యానీ సంగతి చెప్పనక్కర్లేదు. ఆయా కూరగాయల లభ్యత అక్కడి దేశాల్లో అంతంత మాత్రమే కదా. అందుకే అవి వండిన రోజు ఎక్కువ ఉత్సాహం వస్తుంది. అదృష్టం కొద్దీ ఇప్పుడు మన దేశంలో పని చేసే అవకాశం వచ్చింది. ఇక ప్రతి రోజూ తెలుగు వంటలే. మా అమ్మ వంటలు చాలా రుచిగా చేస్తుంది. నేనూ వంట చేస్తాను. చిత్రాన్నం, పప్పు బాగా చేస్తాను. కొన్నేళ్ల తరువాత ఇప్పుడే హైదరాబాద్‌ బిర్యానీ రుచి చూశాను. అమెరికాలోనూ అక్కడక్కడా బిర్యానీ దొరికినా ఈ రుచి ఎక్కడా రాదు. ఇంట్లో తెలుగు మాట్లాడుతుంటాం కానీ అనర్గళంగా కాదు. మేమున్న సమాజంలో తెలుగు మాట్లాడే వారు తక్కువ. అందువల్ల గలగలా మాట్లాడలేను. అలాగని మాతృభాషను మరిచేది లేదు. ఊమాట్లాడుతుంటేనే భాష సజీవంగా ఉంటుంది. సంస్కృతి మన వెన్నంటి ఉంటుంది.

- ఐ.ఆర్‌.శ్రీనివాసరావు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని