Published : 24/09/2021 01:02 IST

ఆ బాధ తెలుసు.. అందుకే ఈ ప్రయత్నం

బిడ్డకి చిన్న దెబ్బతగిలితేనే తల్లి విలవిల్లాడిపోతుంది. అలాంటిది ఆ బిడ్డకి ఆటిజం అని తెలిస్తే? అత్తవారింటి నుంచీ, సమాజం నుంచీ ఎన్నో ఒత్తిళ్లు. ఇదంతా కొంత అవగాహన వచ్చాక పరిస్థితి. అసలదేంటో తెలియని రోజుల్లోనే ఐతరాజు స్రవంతి దాన్ని ఎదుర్కొంది. దానిపై పరిశోధన చేసి ఎంతోమందికి మార్గదర్శిగా మారింది. ఓవైపు బిడ్డ ఆలనాపాలనా, ఉద్యోగం, మరోవైపు తనలాంటి తల్లులకు కౌన్సెలింగ్‌ ఇస్తూ స్ఫూర్తిగా నిలుస్తోంది. వసుంధరతో తన ప్రయాణాన్ని పంచుకుందిలా..

ప్పుడంటే ఆటిజంపై కొద్దిగా అవగాహన వచ్చింది కానీ.. మా బాబు చందన్‌ పుట్టే వరకూ ఆ పదాన్నే వినలేదు. తనకు పుట్టుకతోనే గ్రహణమొర్రి. రెండేళ్ల వయసులో రెండు, మూడు పదాలు పలికే వాడు. తర్వాత అవీ మానేశాడు. ఈ మధ్యలో పెదానికి మూడు సర్జరీలయ్యాయి. నొప్పితో మాట్లాడలేక పోతున్నాడేమో అనుకున్నాం. కొంత భిన్నంగా ప్రవర్తిస్తుండటంతో ప్రముఖ ఆసుపత్రిలో చూపిస్తే ‘ఆటిజం’ అన్నారు. అలా దాని గురించి మొదటిసారి విన్నా. ఏంటని అడిగితే మెదడులో చిన్న లోపమన్నారు. రాన్రానూ వాడి ప్రవర్తనలో మార్పులొచ్చాయి. దేశ వ్యాప్తంగా ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా మార్పు కనిపించలేదు.

మామూలు స్కూల్లో చేర్చుకోలేదు. వైద్యుల సలహాతో తిరుపతిలో స్పెషల్‌ స్కూల్లో చేర్చా. నా బిడ్డను ఇలాంటి చోట చేర్చాల్సి రావడం చూసి ఏడుపొచ్చింది. అక్కడ ఓ పోస్టర్‌పై ఎన్‌ఐఎంహెచ్‌ పేరు చూశా. ఈ సంస్థ ఆటిజంపై పని చేస్తోందని తెలుసుకుని అక్కడికి వెళ్లి, కొన్ని రోజులున్నా. డాక్టర్లతో మాట్లాడి, పుస్తకాలను కొని చదివా. కొంత అవగాహన వచ్చింది. దీనిపై ఎవరూ స్పష్టతను ఇవ్వలేక పోయారు కాబట్టి నేనే పీహెచ్‌డీ చేద్దామనుకున్నా. మాది అనంతపురం. సైకాలజీలో పీజీ చేశా. తిరుపతిలో సాంఘిక సంక్షేమాధికారిగా ఉద్యోగం. ఎస్వీ విశ్వవిద్యాలయం అప్పటి సైకాలజీ ప్రొఫెసర్‌, ప్రస్తుత పద్మావతి వర్శిటీ ఉపకులపతి జమున పర్యవేక్షణలో పరిశోధన చేశా. ఆమె జెరెంటాలజీలో చేయన్నా... నా ఉద్దేశాన్ని చెప్పడంతో సరేనన్నారు. 2008లో నా పరిశోధన ప్రారంభమైంది.

తిరుపతి చుట్టుపక్కల గ్రామాల్లో ఆటిజం ఉన్న 428 మందిని గుర్తించాం. 6-12 వయసుల వారిని శాంపిల్‌గా తీసుకున్నా. వివిధ దశల్లో వడపోస్తే 23 మంది మిగిలారు. హైపర్‌ యాక్టివిటీ, అగ్రెషన్‌ వంటి కామన్‌ అంశాలను తీసుకున్నా. తల్లిదండ్రులకు క్వశ్చనీర్‌ ఇచ్చి, సమాధానాలు కోరా. దాని ప్రకారం సైంటిఫిక్‌ మెథడ్స్‌లో ఏం చేయాలో అవగాహన కల్పించాం. తర్వాత మళ్లీ క్వశ్చనీర్‌ ఇచ్చాం. దాని ప్రకారం మార్పులు.. ఇలా పలు దఫాల్లో చేశాక పిల్లల్లో మార్పు కనిపించింది. పరిశోధన విజయవంతమైంది. ఇందుకు పదేళ్లు పట్టింది. ఆటిజంపై తెలుగు రాష్ట్రాల్లో తొలి రిసెర్చ్‌ నాది. ఇది చేస్తూనే సైకాలజీకి సంబంధించి ఎనిమిదంశాల్లో కోర్సులూ చేశా.

ఆ పరిజ్ఞానంతో ఆటిజంపై అవగాహన కల్పిస్తున్నా. మూడేళ్లలో 350కి పైగా టీవీ, 200కి పైగా రేడియో ప్రోగ్రామ్‌లు నిర్వహించా. తితిదే సహా వివిధ చోట్లా ఆటిజం గుర్తింపు, చికిత్సలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటా. ఉద్యోగంతో పాటే వీటినీ చేస్తున్నా. దీని గురించి తెలియక మోసపోయే వారే ఎక్కువ. డబ్బు ఖర్చైనా ప్రయోజనం ఉండదు. వీళ్లందరికీ మార్గనిర్దేశం చేస్తుంటా. ఇది తగ్గేది కాదు కానీ నిపుణులు ప్రణాళికాబద్ధ చికిత్సనందిస్తారు. అంటే.. వాళ్లకు ప్రాథమిక అవసరాలను నేర్పడం తద్వారా సమాజానికి, వాళ్లకి వాళ్లు భారం కాకుండా చూడటం. తమ పిల్లలకు ఇలా అని తెలిశాక కుంగిపోయే తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంటా. నన్నే ఉదాహరణగా చూపిస్తుంటా. దెబ్బ తగిలిన వాడే ఆ నొప్పి గురించి చెప్పగలుగుతాడు. నాకీ బాధ తెలుసు కాబట్టే దాన్ని ఇతరులకు వివరించగలుగుతున్నా.

- వేలూరి నారాయణప్ప, ఈటీవీ, తిరుపతి


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని