80 ఏళ్ల.. బాటసారి

ఏడు వారాల్లో.. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం ఇదీ లక్ష్యం. ప్రయాణ సాధనం ఏ బైకో, కారో కాదు.. ఒక గుర్రం. దాన్ని నడిపించేదేమోఓ మహిళ. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపుగా అయిదు

Updated : 25 Sep 2021 05:58 IST

ఏడు వారాల్లో.. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం ఇదీ లక్ష్యం. ప్రయాణ సాధనం ఏ బైకో, కారో కాదు.. ఒక గుర్రం. దాన్ని నడిపించేదేమో ఓ మహిళ. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపుగా అయిదు దశాబ్దాలుగా ఏటా ఈమె ఈ ప్రయాణం చేస్తూనే ఉంది. అదీ ఒంటరిగా! ఆమే ఇంగ్లాండ్‌కు చెందిన జేన్‌ డాట్చిన్‌.

జేన్‌ది ఇంగ్లాండ్‌లోని హెక్స్‌హామ్‌. వాళ్లకి చిన్నతనంలో చాలా గుర్రాలుండేవి. వాటి సంరక్షణ తన తల్లి చూసుకునేది. ఒక దాన్ని చూసుకోవడం ఆమెకు కష్టమయ్యేది. దాంతో దాని బాధ్యతను జేన్‌ తీసుకునేది. ఓసారి స్నేహితులను కలవడానికి వెళ్లాలనుకుంది. తన గుర్రం సంరక్షణ తల్లికి భారమవుతుందని భావించి, దాని మీదే ప్రయాణిస్తూ వెళ్లింది. మొత్తం దూరం 480 కి.మీ. అది ఆమెకెంతో నచ్చింది. దీంతో ఏటా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించడం మొదలుపెట్టింది. అలా 1972లో ప్రారంభమైన ఈ ప్రయాణాలు 80 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది.

దీనికంటూ ప్రత్యేకంగా ప్రణాళికలేమీ వేసుకోదు. ఆలోచన రాగానే అప్పటి వాతావరణ పరిస్థితిని బట్టి ఎటు వెళ్లాలన్నది నిర్ణయించుకుంటుంది. ఎప్పుడూ ఒంటరి ప్రయాణమే. ఎక్కువ లగేజీనీ తీసుకెళ్లదు. బస చేయడానికి ఓ టెంట్‌, కొన్ని నిత్యావసరాలు, కొన్ని జతల దుస్తులు, ఓ మొబైల్‌... ఇవే తన సరంజామా. బస చేసే ప్రాంతంలో దొరికే, తేలిగ్గా అరిగే ఆహారాన్ని తీసుకుంటుంది. వెళ్లే మార్గాన్ని బట్టి మధ్యలో తన స్నేహితులనూ కలుస్తుంది. ఈ ఏడాది ప్రయాణం ఇప్పటికే ప్రారంభించింది. రోజుకు 25 - 35 కి.మీ. దాకా ప్రయాణిస్తోంది. 

‘నేను ప్రారంభించేటప్పటికీ ఇప్పటికీ సంస్కృతుల్లో, పరిస్థితుల్లో ఎన్నో మార్పులొచ్చాయి. కానీ ఒంటరిగా గుర్రంపై ప్రయాణం ఎప్పుడూ విసుగనిపించలేదు. పైగా ఎంతో మందిని కలుసుకునే అవకాశం. దీన్ని మరింత ఆనందదాయకంగా చేసుకోవాలనే స్నేహితులను కలవడాన్ని చేర్చుకున్నా. ఏ మ్యాప్‌ సాయమూ తీసుకోను. నాకు గుర్తున్న దారుల్లో  సాయంత్రానికల్లా కచ్చితంగా చేరతానన్నప్పుడే సమాచారమిస్తా. ముందు చెప్పి ఏ వాతావరణ కారణం వల్లో ఆగిపోతే అనవసరంగా వాళ్లకి కంగారు. సమాచారమిచ్చేటపుడు మినహా ఫోన్‌ను స్విచాఫ్‌ చేస్తా. అలా చేస్తే ఒకసారి పెట్టిన చార్జింగ్‌ ఆరు వారాలు వస్తుంది’ అని నవ్వుతోందీ బామ్మ. ఈసారి తనతోపాటు పెంపుడు కుక్కనీ తీసుకెళ్లింది. తన ప్రయాణాలన్నింటినీ పుస్తక రూపంలోనూ తీసుకొస్తోంది. ఎన్నో ప్రచురితమయ్యాయి కూడా. ఇన్నేళ్ల ఒంటరి ప్రయాణం, ఒకరిపై ఆధారపడని తత్వానికి గుర్తింపుగా బ్రిటిష్‌ హార్స్‌ సొసైటీ గత ఏడాది ‘ఎక్సెప్షనల్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’ను అందించింది. ఓపిక, దృష్టి లోపం లేనంతవరకూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తానంటోంది జేన్‌. ఈమెను చూస్తే ఏదైనా చేయడానికి మనసుంటే చాలు.. వయసెప్పుడూ అడ్డం కాదని అనిపిస్తుంది కదూ! తనూ అదే చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్