Published : 27/09/2021 00:47 IST

ప్లేట్లు, గ్లాసుల బ్యాంక్‌

 

నేషనల్‌ బ్యాంక్‌, బ్లడ్‌ బ్యాంక్‌, కిడ్డీ బ్యాంక్‌... ఇలా చాలా వాటి గురించి విన్నాం. మరి క్రాకరీ బ్యాంక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? పర్యావరణ పరిరక్షణ కోసం... వ్యక్తిగత, సామాజిక కార్యక్రమాలేవైనా ఉచితంగా స్టీలు పాత్రలను అందించే సంస్థ ఇది. సమీరా సతీజా దీని నిర్వాహకురాలు. ఆమె స్ఫూర్తి ప్రయాణాన్ని  తెలుసుకుందాం.

‘ఇప్పటివరకూ పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టింది చాలు... మన అలవాట్లు, ఆలోచనలు మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. అందుకే ఈ ప్రయత్నం’ అంటోంది సమీర. దీంట్లో భాగంగా ఏర్పడిందే ‘క్రాకరీ బ్యాంక్‌ ఫర్‌ ఎవ్రీవన్‌’. దీని ద్వారా అందరికీ పర్యావరణంపై అవగాహన, ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయాల వాడకం వంటివి అలవాటు చేస్తోంది. సమీర వృత్తిరీత్యా ఆడిటర్‌, వాళ్లది గుడ్‌గావ్‌. చిన్నప్పటి నుంచీ సామాజిక స్పృహ ఎక్కువే. అందుకే ఆమె గత కొన్నేళ్లుగా వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో వాలంటీర్‌గా పనిచేస్తోంది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసుల వంటి చెత్త పేరుకోవడంతో భూమి, కాలువలు, చెరువులు కాలుష్యం బారిన పడటం చూసింది. వాటిని తిన్న జంతువులు ప్రాణమ్మీదకు తెచ్చుకోవడం గమనించింది. స్టెరిడాటోతో తయారు చేసిన వీటిల్లో వేడి ఆహారం వేయడంవల్ల స్టైరిన్‌ అనే క్యాన్సర్‌ కారకం విడుదలవుతుంది. అందుకే వీటికి అడ్డుకట్ట వేయాలనుకుంది. ప్రత్యామ్నాయాలు వెతికింది.

గొప్ప సేవ అని...

తన స్నేహితురాలు డాక్టర్‌ ఆరుషి సాయంతో... ‘క్రాకరీ బ్యాంక్‌ ఫర్‌ ఎవ్రీవన్‌’ పేరుతో ఫేస్‌బుక్‌లో పేజీ తెరిచింది. ఏ కార్యక్రమానికైనా సరే పాత్రల్ని తీసుకెళ్లొచ్చనీ, వాడుకున్నాక శుభ్రం చేసి తిరిగి అప్పగిస్తే చాలని చెప్పింది. ఆపై కమ్యూనిటీలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, ఆధ్యాత్మిక బృందాలకు వాటిని ఉచితంగా అందించింది. ఈ పద్ధతి ఎంత సులువో, ప్రయోజనకరమో చెప్పేందుకు 2018లో ఓ ప్రయోగం చేసింది. హిందువులు పవిత్రంగా భావించే నిర్జల ఏకాదశి రోజు ఓ ఆలయంలో ప్రసాదాలకు వీటిని వాడింది. అ పళ్లాలు, గ్లాసులను శుభ్రం చేసేందుకు వాలంటీర్లను ఆహ్వానించింది. అది గొప్ప సేవగా భావించి ఎంతో మంది వచ్చారు. ఆ రోజు 15000కు పైగా ప్లాస్టిక్‌ పాత్రల వాడకాన్ని ఆపగలిగింది. తర్వాత దేశవ్యాప్తంగానూ ఈ కార్యక్రమాలను ప్రోత్సహించింది. గుడ్‌గావ్‌, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు సుమారు 35 ప్రాంతాల్లో ఈ క్రాకరీ బ్యాంకుల్ని ఏర్పాటు చేసింది. సమష్టి కృషితో దాదాపు నాలుగులక్షలకు పైగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించగలిగింది. సమీర కృషిని గుర్తించిన కేంద్రప్రభుత్వం కూడా ‘సస్టైనబిలిటీ విజన్‌ -2030’ పేరుతో ఆమెను సత్కరించింది. ఈ కార్యక్రమాల్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలనేదే తన లక్ష్యం అని చెబుతోంది సమీర.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని