Updated : 28/09/2021 09:53 IST

భర్తను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించింది!  

మూస ధోరణుల్లో ఎంత కష్టపడినా ఏం లాభం? ఇంకొంచెం విభిన్నంగా ప్రయత్నిస్తే పోయేదేముంది? ఈ ఆలోచనే ఓ ఇల్లాలి మదిలో  కొత్త వ్యాపారానికి పునాదులు వేసింది. భర్తను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించడమే కాదు...మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేర్చింది. లక్షల రూపాయల టర్నోవర్‌ను అందుకునేలానూ చేసింది. ఈ కథ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం న్యూ గొల్లగూడెం వాసి కల్లెం సుజాతది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

ష్ట, నష్టాల వెనుకే...జీవితాన్ని గెలిచే అవకాశాలూ ఉంటాయి. వాటిని ఒడిసిపట్టుకుంటే ఇబ్బందులు ఇట్టే దూరమవుతాయి. ఇది నా స్వానుభవంతో చెబుతున్నా. నష్టాలు, రుణభారాన్ని వదిలించుకుని లాభాల బాటలో నడవగలుగుతున్నామంటే...ఇదే మా వ్యాపార మంత్రం. మావారు నర్సింహారావు కిరాణా దుకాణం నడిపేవారు. మొదట్లో బాగానే ఉండేది. ఆపై ఆదాయం తగ్గి...క్రమంగా ఐదు లక్షల నష్టం కనిపించింది. దాంతో అది మానేసి పత్తి వ్యాపారం చేస్తే అక్కడా పది లక్షల లాస్‌. ఈ పరిస్థితులు మమ్మల్ని ఆర్థికంగా కుదేలయ్యేలా చేశాయి. అయినా బతుకుబండిని నడపడాలంటే ఏదో ఒక ఉపాధి మార్గం ఉండాలి కదా! అందుకే ఈసారి టెంట్‌హౌస్‌ని ప్రారంభించాం. అప్పటి నుంచి నేనూ ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టా. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందని తెలిసినా వెళ్లి మాట్లాడి వచ్చేవాళ్లం. ఇంత కష్టపడినా...సంపాదన అరకొరగానే ఉండేది. మా బాబు ఆకాశ్‌ చదువుకూ అప్పులు చేసే పరిస్థితి. ఇంకెన్నాళ్లిలా? ఇదే ఆలోచన నిత్యం మనసుని మెలిపెట్టేది.

ఆ ఆలోచనతో...  వ్యాపార నిమిత్తం మా వారు హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వెళ్లేవారు. అప్పుడు ఓ ఆలోచన తట్టింది. మనమే మెటీరియల్‌ తీసుకొచ్చి షామియానాలు, ఇతర అలంకరణ సామగ్రి తయారు చేస్తే బాగుంటుంది కదా అని. దీనివల్ల ఖర్చు కలిసి రావడంతోపాటు ఇతర ప్రాంతాల వినియోగదారులకు, దుకాణదారులకు కూడా మెటీరియల్‌ విక్రయించొచ్చు. అదే విషయం ఆయనకి చెప్పా. అప్పులో అప్పు మరో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టమన్నా. తను బయట టెంట్ హౌస్‌ వేసే పనులు చూసుకుంటూ ఆర్డర్స్‌ తీసుకొస్తే.. నేను ఇంటి దగ్గర ఉండి వీటి తయారీ, అమ్మకాలు చూసుకుంటానని భరోసా ఇచ్చా. నా మాటతో ఆయనా సరేనన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా తిరిగి కొత్త డిజైన్లతో తీర్చిదిద్దిన షామియానాలను ఎలా తయారు చేస్తున్నారు? మెటీరియల్‌ ఎక్కడ సేకరిస్తున్నారో అధ్యయనం చేశాం. కొంతమంది హోల్‌సేల్‌ వ్యాపారులనూ పరిచయం చేసుకున్నాం. తిరిగొచ్చాక ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని షామియానాల వ్యాపారులను సంప్రదించాం. వారికి తక్కువ ధరకే, వివిధ రకాల షామియానాలు తయారు చేసి సరఫరా చేస్తామనీ, దీనివల్ల వారికీ రవాణా ఖర్చులు ఆదా అవుతాయనీ ఒప్పించాం. ఈ ఒప్పందాల తర్వాత మూడు లక్షల పెట్టుబడితో 2014లో కొత్తగూడెంలో శ్రీనిధి డెకరేషన్‌ వర్క్స్‌ పేరుతో సంస్థను ప్రారంభించాం.

వాట్సాప్‌లో ఆర్డర్‌ ఇస్తే చాలు..  మారుతున్న పరిస్థితులు, వినియోగదారుల అవసరాలు, ఆధునిక పోకడల్ని అందిపుచ్చుకుని నయా డిజైన్లలో షామియానాలు, సోఫాల కవర్లు, వస్త్ర, ప్లాస్టిక్‌ అలంకరణ పూలు, సైడ్‌ వాల్స్‌ ఇతర అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నాం. వాట్సాప్‌లో వారు కోరుకున్న డిజెన్లు చూపించినా...అచ్చంగా అలాంటివే అందిస్తాం కూడా. ఇలాంటి వ్యాపారంలో నిలదొక్కుకోవడం కష్టమైన విషయమే...వినియోగదారులతో సత్సంబంధాలు, నాణ్యత, మార్కెట్‌ పోకడల్ని తెలుసుకుంటూ అడుగులేయడం వల్లే మాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. గత ఏడేళ్లలో వ్యాపారం బాగా విస్తరించింది. కరోనా ముందు వరకు ఏడాదికి రూ.70 లక్షల టర్నోవర్‌ సాధించాం. కానీ కరోనా కారణంగా వివాహాది శుభకార్యాలు ఆగి రూ.8 లక్షల విలువైన ఆర్డర్లు రద్దయ్యాయి. కొన్ని చోట్ల తీసుకున్న అడ్వాన్స్‌ కూడా తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి.అయినా భయపడలేదు. స్వశక్తిని నమ్ముకుంటే సాధించలేనిది ఏమీ లేదు మరి. ఇప్పుడిప్పుడే కొత్త ఆర్డర్లు వస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ వరకూ చదువుకున్న నేను ఒకప్పుడు వంటింటికే పరిమితమయ్యా. కానీ ఇప్పుడు ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని షాపునకి వస్తా. ఆర్డర్లను బట్టి ఉద్యోగులకు పని, మెటీరియల్‌ విభజించి సకాలంలో వినియోగదారులకు ఆయా ఉత్పత్తులు చేరేలా చూడటం ఇప్పుడు నా దినచర్య. బాబు బీటెక్‌ చదువుతున్నాడు. భవిష్యత్తులో మా వ్యాపారాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడమే లక్ష్యంగా సాగుతున్నాం. మేం నిలదొక్కుకోవడంతో పాటు పది మంది మహిళలకు ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది.

- తిప్పర్తి వెంకట నాగాచారి, భద్రాద్రి కొత్తగూడెం


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని