Updated : 29/09/2021 05:05 IST

బొమ్మల్లో.. భారతీయం

వయసుతో సంబంధం లేకుండా పిల్లలందరికీ బొమ్మలంటే ప్రాణమే. కానీ ఇందుకు విదేశీ వాటిపైనే ఎందుకు ఆధారపడాలనుకున్నారు వీళ్లిద్దరూ. అనుకోవడమే కాదు స్వయంగా రూపకల్పన మొదలుపెట్టారు. అలా అవని, రంజన్‌ రూపొందించిన వాటికి ఇప్పుడు విదేశాల్లో మంచి గిరాకీ. ఈ టాయ్‌ ఆంత్రప్రెన్యూర్ల గురించి చదివేయండి.

వనికి ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే ఆమె కుటుంబం యూఎస్‌కి మారింది. తన చిన్నతనంలో ఆడుకున్న బొమ్మలు, పెరిగిన వాతావరణం బాగా నచ్చేది. ఆమెకీ, అన్న విరల్‌ మోదీకీ ఒకేసారి పిల్లలు పుట్టారు. మన సంప్రదాయం, సంస్కృతిని అలవాటు చేయాలన్నది వాళ్ల ఆలోచన. సంబంధిత పుస్తకాలు, బొమ్మల కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. దీంతో సొంతంగా చేయిద్దామనుకుంది. మొదట బాల గణేశుడి రూపంలో బొమ్మను, మధ్యలో నొక్కితే శ్లోకాలు వచ్చేలా తయారు చేయించింది. దాంతో పాప ఆడుకుంటున్న ఫొటో, వీడియోలను సోషల్‌ మీడియాలో ఉంచితే అనూహ్య స్పందన వచ్చింది. దీంతో అన్నతో కలిసి ‘మోదీ టాయ్స్‌’ పేరిట 2018లో రూ.పది లక్షల పెట్టుబడితో సంస్థను ప్రారంభించింది. అవని అప్పటికే ఓ ప్రముఖ సంస్థలో మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తోంది. ఆ పరిజ్ఞానంతో వెబ్‌సైట్‌ రూపొందించి అమ్మడం ప్రారంభించింది. బాల గణపతి బొమ్మలతో పాటు ఇతర దేవుళ్లవీ, పిల్లల పుస్తకాలు, పజిళ్లపైనా దృష్టిపెట్టింది. ఈ-కామర్స్‌ సంస్థలతోనూ కలిసి పనిచేసింది. ఈ బొమ్మలు పిల్లలతోపాటు వృద్ధులూ, యువతా తీసుకోవడం ప్రారంభించారు. ఇతర దేశాల నుంచీ మంచి స్పందన వచ్చింది. ఏడాదిలోనే పెట్టుబడి వచ్చేయడంతోపాటు 39% లాభాలనూ సంపాదించింది. ఈ ఏడాది లాభాలు 158 శాతం పైనే. ఇప్పటివరకూ 27 దేశాల్లో 40 వేల బొమ్మలను అమ్మారట. భర్త అవిక్‌ ఉద్యోగి. ముగ్గురు పిల్లలు, వ్యాపారాన్ని చూసుకోవడానికి ఉద్యోగానికి రాజీనామా చేసింది. విదేశాల్లో స్థిరపడినా మన సంస్కృతిపై మనవాళ్లకున్న అభిమానమే తన విజయానికి కారణమనే 37 ఏళ్ల అవని.. ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలోనూ చోటు దక్కించుకుంది. ఏటా లాభాల్లో కొంత పిల్లల చారిటీలకు ఇస్తోంది. వాళ్లకోసం ఫండ్‌ రైజింగ్‌తోపాటు, నిపుణులతో స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌లనూ నిర్వహిస్తోంది.

బార్బీకి దీటుగా.. రంజన్‌ బేన్‌ టైలరింగ్‌, బొమ్మల తయారీని సరదాగా నేర్చుకుంది. భర్త ఉద్యోగరీత్యా ఎన్నో ప్రాంతాల్లో ఉన్నారు వాళ్లు. వీలు చిక్కినప్పుడల్లా బొమ్మలను చేసి పిల్లలకిచ్చేది. ఈమెది గుజరాత్‌. గాంధీనగర్‌లో ఉంటున్నప్పుడు తనకు తెలిసిన విద్యను ఇతర మహిళలకూ నేర్పాలనుకుంది. అలా 8000 మందికిపైగా శిక్షణనిచ్చింది. ఓసారి ఆమె చిన్న కొడుకు వ్యాపార నిమిత్తం అమెరికా వెళ్లాల్సొచ్చింది. తన ప్రాజెక్టు కోసం బొమ్మలు చేసివ్వమని అమ్మను అడిగాడు. తను ఐదు నెలల్లో 20 బొమ్మల్ని చేత్తో చేసిచ్చింది. అవి అక్కడివాళ్లకి ఎంతో నచ్చాయి. దీన్నే వ్యాపారంగా మలచాలనుకుని 1995లో ‘కళాశ్రీ ఫౌండేషన్‌’ను ప్రారంభించింది. అన్నీ చేత్తోనే చేయడం వీళ్ల ప్రత్యేకత. ఒక్కో బొమ్మకీ.. పెయింటింగ్‌, స్కల్‌ప్చింగ్‌, టైలరింగ్‌.. ఇలా 14 రకాల పనులుంటాయి. ఒక్కోదాని తయారీకీ 18 గంటలు పడుతుంది. 300 రకాల బొమ్మలు రూపొందిస్తున్నారు. ఈమె ఇప్పుడు పదుల సంఖ్యలో మహిళలకు ఉపాధినిస్తోంది. ప్రస్తుతం వీళ్లు తయారు చేస్తున్న బొమ్మలకు 18 దేశాల నుంచి కస్టమర్లున్నారు. ‘పిల్లలకు సురక్షితం’ కోణంలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలనూ పాటిస్తున్నారు. ప్రపంచానికి భారతీయ బొమ్మలను పరిచయం చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్న వీళ్లు.. బార్బీకి దీటుగా తమ వాటిని నిలబెడతామంటున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని