Updated : 01/10/2021 04:37 IST

ఉప్పాడ చీరకు జాతీయ గుర్తింపు!

ప్పాడ చేనేత కళాకారుల అద్భుత సృష్టి జాందానీ. అత్యంత నేర్పుతో ఒక్కొక్క పోగూ చేతితో పేర్చుతూ..దీనికి వన్నె తెస్తారు ఇక్కడి నేత కార్మికులు. ఇప్పుడు ఎర్రటి ఉప్పాడ పట్టు చీరపై వెండి, బంగారు జరీ పోగులతో పూలతలు అల్లి దీనికి వన్నె తెచ్చిందో కార్మికురాలు. అదే ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. నిత్యం చేసే పనే అయినా...తనదైన సృజనకు ఆధునిక సొబగులు చేర్చి అందరితోనూ శెభాష్‌ అనిపించుకుంటోంది. ఆమే తాతోలు దేవి. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలోని చేనేత కుటుంబం తనది. నేత పనిపై ఇష్టంతో...తొమ్మిదితోనే చదువు ఆపేసి మరీ నేర్చుకుంది. పెళ్లయ్యాక అత్తింటివారిదీ అదే ఊరు కావడంతో దాన్నే వృత్తిగా చేపట్టింది. అలా పాతికేళ్లుగా చీరలు నేస్తూనే ఉంది. ఆధునిక డిజైన్లను అందిపుచ్చుకోవడంలో, మార్కెట్‌ పట్టుని తెలుసుకోవడంలో దేవి నేర్పరి. అందులోనూ చీరంతా అల్లుకుపోయేలా జాందానీ పనితనం చూపించడం తన ప్రత్యేకత. అలాంటి చీర నేసినందుకే కేంద్ర చేనేత జౌళి శాఖ ఆమెకు నేషనల్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ను అందించింది. దేవికి ఒక చీర నేయడానికి నెలరోజులకు పైగా పడుతుంది. అలా ఏడాదికి కేవలం పది మాత్రమే నేస్తుంది. తాను తయారుచేసే వాటిని వెంకట రామలక్ష్మి ఫ్యాబ్రిక్స్‌కు సరఫరా చేస్తుంది. ఆ సంస్థ ద్వారానే ఇప్పుడు తనకీ గుర్తింపు దక్కింది. ‘ఉప్పాడ నేతకు నా వల్ల జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. ఈ ప్రోత్సాహం భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రయోగాలకూ, డిజైన్లకూ ప్రేరణగా నిలుస్తుంది’ అంటోంది దేవి.

- గంపా రాజు, న్యూస్‌టుడే యు.కొత్తపల్లి


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని