Updated : 02/10/2021 00:59 IST

సిరిమంతురాళ్లు!

సంపద సృష్టి మగవాళ్లకే కాదు మాకూ వచ్చు అంటూ అద్భుతాలు చేశారీ శ్రీమంతురాళ్లు. సొంతగా వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించినా... వారసత్వ పగ్గాలను అందుకున్నా... తమదైన బాటలో పయనించి ఔరా అనిపించారు. తాజాగా హురున్‌ విడుదల చేసిన అత్యంత ధనవంతులైన భారతీయుల జాబితాలో తొలి వంద మందిలో నిలిచిన సిరిమంతురాళ్లు వీళ్లు...


కారు షెడ్డే కార్యాలయం...

మహిళలు ఇంటికే పరిమితమైన రోజుల్లో ఆ అడ్డుగోడల్ని బద్దలు కొట్టి బయోటెక్‌ క్వీన్‌గా అద్భుతాలెన్నో సృష్టించారు  కిరణ్‌ మజుందార్‌ షా. డిగ్రీ చేసి వైద్యురాలు కావాలనుకున్నారు. అది నెరవేరక నిరాశపడితే ‘కోరుకున్నది దొరకనప్పుడు... దొరికిన దాంట్లో అద్భుతాలు సృష్టించాలి’ అన్న నాన్న మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియాలో మాల్టింగ్‌ అండ్‌ బ్రూవింగ్‌లో పట్టా సాధించారు. ఉద్యోగం కోసం వెళ్లిన ప్రతి చోటా ‘నువ్వు ఈ కోర్సు చేశావా’ అనే వెక్కిరింపులు. చివరికి తానే మద్యం కంపెనీలకు సలహా సంప్రదింపుల సంస్థను ఏర్పాటు చేశారు. అప్పుడే కిరణ్‌కి బయోటెక్నాలజీపై ఆసక్తి మొదలైంది. ఎంజైములపై అధ్యయనానికి ఐర్లాండ్‌ వెళ్లారు. అక్కడ బయోకాన్‌ కెమికల్‌ సంస్థ అధినేత అచిన్‌ క్లోస్‌ పరిచయమయ్యారు. ఆయన కిరణ్‌ ఆసక్తి, నైపుణ్యాలను చూసి ఇండియాలో ఏర్పాటు చేయనున్న బయోకాన్‌లో భాగస్వామిగా చేరమని ఆహ్వానించారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న కిరణ్‌ బయోకాన్‌ ఇండియా ఏర్పాటులో విదేశీ నిధులపై కఠిన ఆంక్షలు, ఆడపిల్ల అనే వివక్ష, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని చుట్టుముట్టినా నిబ్బరాన్ని కోల్పోలేదు. కారు షెడ్డునే ఆఫీసుగా మార్చి కార్యకలాపాలు సాగించారు. ఏడాది తిరిగే సరికి భారత్‌లో తొలి ఎంజైమ్‌ల తయారీ సంస్థగా నిలబెట్టారు కిరణ్‌. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెపోటుని దరి చేరనీయని ఉత్పత్తులతో సంచలనం సృష్టించారు. కిరణ్‌ మజుందార్‌షా మెడికల్‌ ఫౌండేషన్‌ ద్వారా కర్ణాటకలోని అనేక పల్లెల్లోని ప్రజలకు అతి తక్కువ చందాతో వైద్య సదుపాయాలు, చికిత్స అందిస్తున్నారు. ఆ సేవలకే పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో సత్కరించింది. గత ఏడాది కన్నా ర్యాంకు తగ్గినా రూ. 28,200 కోట్ల సంపదతో హురున్‌ జాబితాలో అత్యంత ధనికురాలైన రెండో మహిళగా నిలిచారు.


యజమానైనా.. ఉద్యోగిలానే!

రాధా వెంబు.. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ‘జోహో’ కో ఫౌండర్‌. ప్రపంచవ్యాప్తంగా ఈమెయిల్‌ సర్వీస్‌ అందించే ప్రముఖ సంస్థల్లో జోహో మెయిల్‌నూ ఒకదానిగా నిలబెట్టడంలో ఈమెదే ప్రధాన పాత్ర. అన్న శ్రీధర్‌తో కలిసి 1996లో దీన్ని ప్రారంభించింది. ఈమెది చెన్నై. ఐఐటీ నుంచి ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. సహ వ్యవస్థాపకురాలైనా దానిలో సాధారణ ఉద్యోగిగానే చేరింది. తర్వాత ప్రాజెక్ట్‌ మేనేజర్‌ హోదాని చేపట్టి, అందరూ ఆశ్చర్యపడే స్థాయికి సంస్థను అభివృద్ధి చేసింది. అయినా తన హోదాని మార్చుకోలేదు. 14 ఏళ్లుగా అలాగే కొనసాగుతోంది. దీనికి యాభై కోట్లకు పైగా యూజర్లున్నారు. జోహో ప్రొడక్ట్స్‌ నిర్వహణ బాధ్యతతోపాటు బృందాలనూ ముందుండి నడిపిస్తోంది. పని ప్రదేశంలో ఎలాంటి పక్షపాత ధోరణీ లేకుండా చూడటం తన బాధ్యత అనే రాధ తెర వెనుక ఉండటానికే ఇష్టపడుతుంది. అదేమంటే.. నాణ్యత ముఖ్యం కానీ దాని వెనక పని చేసే వారు కాదని సమాధానమిస్తుంది. అందుకే ప్రచారానికే కాదు.. సోషల్‌ మీడియాకూ దూరంగా ఉంటుంది. తన పని తీరూ చాలా భిన్నంగా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌లకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది. అదే తన విజయ రహస్యమనీ చెబుతుంది. ఫోర్బ్స్‌తోపాటు హురున్‌ విడుదల చేసిన ప్రపంచవ్యాప్త రిచెస్ట్‌ సెల్ఫ్‌ మేడ్‌ విమెన్‌ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది 93% అభివృద్ధితో ఆమె సంపద రూ.23,100 కోట్లకు చేరింది. దీంతో ‘హురున్‌ అత్యంత సంపన్నుల జాబితా 2021’లో చోటు దక్కించుకుంది. రాధ.. మరో రెండు అగ్రికల్చరల్‌, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు డైరెక్టర్‌ కూడా.


కళలపై ఇష్టంతో...  

ఐదు ఖండాల్లో విస్తరించి... 124 సంవత్సరాల చరిత్ర ఉన్న వ్యాపార కుటుంబం గోద్రెజ్‌. ఈ వంశంలో మూడోతరం వారసురాలు స్మిత. మొత్తం గోద్రెజ్‌ ఆస్తుల్లో ఐదో వంతు వాటా తనదే! 33 వేల కోట్ల సంపదతో హురున్‌ జాబితాలో మహిళల్లో ప్రథమ స్థానంలో ఉన్నారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌ విజయక్రిష్ణని వివాహమాడి స్మితక్రిష్ణగోద్రెజ్‌గా మారారు. గోద్రెజ్‌ వ్యాపారాలతోపాటు... సామాజిక బాధ్యతలనీ తలకెత్తుకున్నారామె. నౌరోజీ గోద్రెజ్‌ సెంటర్‌ ఫర్‌ ప్లాంట్‌, రాప్టర్‌ రిసెర్చ్‌ అండ్‌ కన్జర్వేషన్‌ ఫౌండేషన్‌కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ పశ్చిమ కనుమల్లోని వృక్ష వైవిధ్యాన్ని కాపాడుతూ ఔషధ మొక్కలని సంరక్షించే ప్రయత్నం చేస్తోంది. వాళ్ల అమ్మ ప్రారంభించిన ఉదయాచల్‌ స్కూళ్లనీ స్మితే నడుపుతున్నారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న భవనాలని కాపాడే అభిరుచితో ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త డాక్టర్‌ హోమీ జే బాబా ఇంటిని కొని దాని పరిరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ సంస్థను నిర్వహిస్తూ... ఎంతోమంది కళాకారులకు అంతర్జాతీయ అవకాశాలను అందించారు. ఆమె కుమార్తె నైరికా హోల్కర్‌ కూడా సంస్థ నిర్వహణలో కీలకంగా ఉన్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని